Ap High Court: చదునైన పాదం ఉంటే ఆ పోస్టుకు కష్టమే: హైకోర్టు

చదునైన/సమతల పాదం (ఫ్లాట్‌ ఫుట్‌) కలిగిన వ్యక్తి సహాయ మోటార్‌ వాహన ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ)గా ఎంపిక అయ్యేందుకు అనర్హులని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాంటి పాదం కలిగిన వ్యక్తికి నడిచేటప్పుడు,....

Updated : 06 Apr 2022 08:37 IST

విధి నిర్వహణకు ఆటంకం కలుగుతుంది
ఆసక్తికరమైన తీర్పు వెలువరించిన ఉన్నత న్యాయస్థానం

ఈనాడు, అమరావతి: చదునైన/సమతల పాదం (ఫ్లాట్‌ ఫుట్‌) కలిగిన వ్యక్తి సహాయ మోటార్‌ వాహన ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ)గా ఎంపిక అయ్యేందుకు అనర్హులని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాంటి పాదం కలిగిన వ్యక్తికి నడిచేటప్పుడు, పరిగెత్తే సమయంలో పట్టు ఉండదని తెలిపింది. ఇది అంగవైకల్యం కానప్పటికీ.. ఏఎంవీఐగా విధుల నిర్వహణకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది. ఆ పోస్టు ఒకచోట స్థిరంగా ఉండి విధులు నిర్వహించేది కాదని పేర్కొంది. ఏఎంవీఐ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలన్న పిటిషనర్‌ వాదనను తిరస్కరించి వ్యాజ్యాన్ని కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. రవాణాశాఖలో 23 ఏవీఎంఐ పోస్టుల భర్తీకి 2018లో ప్రకటన జారీచేశారు.

పూర్వ కడప జిల్లాకు చెందిన నాగేశ్వరయ్య పరీక్ష రాశారు. మెరిట్‌ లిస్ట్‌లో రెండో స్థానం సాధించారు. తర్వాత మెడికల్‌ పరీక్షకు హాజరయ్యారు. తుదిఫలితాల్లో తన పేరు లేకపోవడంతో విస్మయానికి గురయ్యారు. ఎందుకు ఎంపిక కాలేదని విచారించగా కుడికాలికి ‘చదునైన పాదం’ ఉండటమే కారణమని అధికారులు తెలిపారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. సమతల పాదం కలిగిన వారిని అనర్హులుగా పేర్కొనడం వారిపట్ల వివక్ష చూపడమేనన్నారు. ఉద్యోగ ప్రకటనను రద్దు చేయాలని కోరారు. ఈ కేసులో రహదారులు-భవనాలశాఖ, ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు.

వీటన్నింటినీ విన్న ధర్మాసనం.. చదరపు పాదం అనేది చట్ట నిర్వచనం ప్రకారం అంగ వైకల్యం (డిజెబిలిటీ) కాదని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్‌కు దివ్యాంగుల రిజర్వేషన్‌ వర్తించే అంశం ఉత్పన్నం కాదని పేర్కొంది. మరోవైపు రవాణాశాఖలో చేపట్టే పోస్టులకు రిజర్వేషన్‌ వర్తించకుండా దివ్యాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్‌ 34(1) ద్వారా మినహాయింపు ఇచ్చారని గుర్తుచేసింది. ఏఎంవీఐ ఉద్యోగ ప్రకటన నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న పిటిషనర్‌ వాదనను తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. ఆ పోస్టు ఒకచోట ఉండి నిర్వహించేది కాదని, పలురకాల విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ సబార్డినేట్‌ సర్వీసు నిబంధన 10(డి)(4), 2009 ఫిబ్రవరిలో ఇచ్చిన జీవో 71 ఫ్లాట్‌ ఫుట్‌ కలిగిన వారిని ఏఎంవీఐగా నియామకాన్ని నిలువరిస్తున్నాయని గుర్తుచేసింది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని