Andhra News: పదేళ్ల బాదుడు.. బయటపడింది!

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగితే.. ఆ మార్గంలో మాత్రం తగ్గాయి. ఇన్నాళ్లుగా ఆ మార్గంలో ప్రయాణికులపై మోపిన అదనపు భారం సంగతి తాజాగా బయటపడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం

Updated : 18 Apr 2022 09:14 IST

పాడేరు-చోడవరం మార్గంలో తగ్గిన ఆర్టీసీ ఛార్జీలు 

పాడేరు, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగితే.. ఆ మార్గంలో మాత్రం తగ్గాయి. ఇన్నాళ్లుగా ఆ మార్గంలో ప్రయాణికులపై మోపిన అదనపు భారం సంగతి తాజాగా బయటపడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు డిపో నుంచి చోడవరం వరకు గతంలో 67 కిలోమీటర్ల దూరం చూపించి, టికెట్‌పై రూ.80 వసూలు చేసేవారు. ప్రభుత్వం ఇటీవల బస్సు ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వగానే ఈ ధరను రూ.85కు పెంచారు. ఒకట్రెండు రోజుల తర్వాత టికెట్‌పై ఉన్న దూరాన్ని 67 కి.మీ నుంచి 56 కి.మీకు కుదిస్తూ, ఛార్జీలను రూ.85 నుంచి రూ.75కు తగ్గించారు. దీనిపై సమాచార హక్కుచట్టం కార్యకర్త అల్లాడ శ్రీనివాసరావు డిపో యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ‘గతంలో పాడేరు నుంచి వి.మాడుగుల మీదుగా చోడవరానికి బస్సులు నడిచేవి. ఈ దూరాన్ని బట్టి రూ.80 టికెట్‌ వసూలు చేశాం. పదేళ్లుగా వి.మాడుగుల వెళ్లకుండానే ఘాట్‌రోడ్డు మీదుగా చోడవరం వెళ్తున్నాయి. అయినా అదే ధరను కొనసాగించారు. తాజాగా మారిన దూరాన్ని గణించి ఛార్జీలు తగ్గించామ’ని వివరణ ఇచ్చారు. బస్సుల రూట్‌ మారిన విషయాన్ని ఆర్టీసీ పరిగణించకుండా ఇన్నాళ్లుగా పాత ఛార్జీలే కొనసాగించడాన్ని శ్రీనివాసరావు ఆక్షేపించారు. కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చి దూరాలు తగ్గినప్పుడు, ఆ మేరకు ఛార్జీలు సర్దుబాటు చేయకుండా ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చేయడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని