Andhra News: మర్యాద ఇవ్వలేదని కానిస్టేబుల్‌పై ఎంపీ నందిగం సురేష్‌ ఆగ్రహం

రాజధాని ప్రాంతమైన రాయపూడి హోసన్నమందిరం వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడికొండకు చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడిని తనిఖీ చేస్తున్నప్పుడు...

Updated : 20 Apr 2022 07:04 IST

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంతమైన రాయపూడి హోసన్నమందిరం వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడికొండకు చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడిని తనిఖీ చేస్తున్నప్పుడు... తాను ఎంపీ నందిగం సురేష్‌ తాలూకు మనిషినని చెప్పాడు. అయితే ఎవరైనా పత్రాలు చూపించాల్సిందేనని ఆ కానిస్టేబుల్‌ స్పష్టం చేశారు. వెంటనే ఆ వాహనదారుడు ఎంపీకి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆ కానిస్టేబుల్‌కు ఫోన్‌ ఇమ్మన్న సురేష్‌ తాను ఎంపీని మాట్లాడుతున్నానని అనగానే కానిస్టేబుల్‌ ‘సరేనండీ’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ సురేష్‌ ఆ కానిస్టేబుల్‌ను తన ఇంటికి రావాలని హుకుం జారీ చేశారు. తాను ఎంపీనని చెబుతున్నా మర్యాద ఇవ్వలేదని పోలీసు అధికారికి ఎంపీ సురేష్‌ ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ పోలీసు అధికారి ఇదిమరింత రచ్చకాకుండా ఆయన ఇంటికి వెళ్లి ఈ అంశాన్ని చక్కదిద్దారు. దీనిపై బాపట్ల ఎంపీ సురేష్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా తన మనిషి హెల్మెట్‌ ఉంచుకుని పెట్టుకోలేదని, అతనిపైనే అరిచానన్నారు. అంతే తప్ప కానిస్టేబుల్‌పై ఆగ్రహించలేదన్నారు. కానిస్టేబులే ఫోన్‌లో మాట్లాడుతూ గతంలో తాను ఓ చిన్న పనిచేసి పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని