Andhra News: సభ నుంచి వెళ్లిపోతే డబ్బులు ఆపేస్తాం

‘మీరు మంత్రి రాకముందే సభలోంచి వెళ్లిపోతే వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం డబ్బులు నిలిపేస్తాం.. సంఘాల నుంచి తొలగిస్తాం’.. పొదుపు మహిళలకు మెప్మా ఆర్పీల బెదిరింపులివి. 

Updated : 27 Apr 2022 08:52 IST

మంత్రి కార్యక్రమంలో పొదుపు మహిళలకు బెదిరింపులు

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ‘మీరు మంత్రి రాకముందే సభలోంచి వెళ్లిపోతే వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం డబ్బులు నిలిపేస్తాం.. సంఘాల నుంచి తొలగిస్తాం’.. పొదుపు మహిళలకు మెప్మా ఆర్పీల బెదిరింపులివి. మంగళవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్‌ ద్వారా సున్నా వడ్డీ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల పరిధిలోని పొదుపు మహిళలను పిలిపించారు. సభ ఉదయం 10 గంటలకని ప్రకటించగా, మధ్యాహ్నం 2 అయినా మంత్రి రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన మహిళలు బయటకు వెళ్లిపోతుండగా, మెప్మా ఆర్పీలు వారిని అడ్డగించారు. పథకం డబ్బులు జమ చెయ్యం, బ్యాంకు రుణాలు రాకుండా చేస్తామంటూ బెదిరించడంతో మహిళలు ప్రతిఘటించారు. కాసేపు వారి మధ్య వాదులాట జరిగింది. ‘మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ’ పలువురు వెళ్లిపోయారు. ఈలోగా జిల్లా మెప్మా పీడీ రవికుమార్‌ వారి వద్దకు వచ్చి మంత్రి వస్తున్నారు రావాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు మంత్రి కార్యక్రమం ప్రారంభమైంది.

గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు..: ‘‘మంత్రి వస్తున్నారని, సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని చెబితే 9 గంటలకే వచ్చాం. మధ్యాహ్నం 2 గంటలైనా కనీసం గుక్కెడు నీళ్లయినా ఏర్పాటు చేయలేదు. పైగా ప్రయోజనాలన్నీ నిలిపేస్తామంటూ బెదిరించడం ఎంతవరకూ సబబు?’ అని మార్కాపురానికి చెందిన చాబోలు పెద్దక్క అనే పొదుపు మహిళ వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని