Acharya: ఏపీలో ‘ఆచార్య’ టికెట్‌ కనీస ధర రూ.70

ముఖ్యమంత్రి ఈ మాటలన్న మూడు నెలల్లోనే సినిమా టికెట్‌ ధరల్ని ప్రభుత్వం భారీగా పెంచేసింది. నగర, గ్రామ పంచాయతీల్లో నాన్‌ ఏసీ థియేటర్లలో కనీస ధర రూ. 20కి, గరిష్ఠ ధరను రూ.40కి పెంచింది. నగరాల్లోని ప్రత్యేక థియేటర్లలో కనీస ధర రూ.100కి, గరిష్ఠ ధర

Updated : 28 Apr 2022 07:39 IST

పెద్ద సినిమాలొస్తే అదనపు బాదుడే!


‘పేదవాడికి అందుబాటులో వినోదాన్ని అందించాలని సినిమా టికెట్‌ ధరల్ని నిర్ణయిస్తే, దాని మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటివాళ్లు పేదల గురించి ఆలోచించేవాళ్లేనా? పేదల గురించి పట్టించుకునేవాళ్లేనా? పేదవారికి వీళ్లు శత్రువులు కాదా?’  

- రాష్ట్రంలో సినిమా టికెట్‌ కనీస ధరను రూ.5కి తగ్గించిన సందర్భంలో జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగిన ఒక సభలో ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి.


ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి ఈ మాటలన్న మూడు నెలల్లోనే సినిమా టికెట్‌ ధరల్ని ప్రభుత్వం భారీగా పెంచేసింది. నగర, గ్రామ పంచాయతీల్లో నాన్‌ ఏసీ థియేటర్లలో కనీస ధర రూ. 20కి, గరిష్ఠ ధరను రూ.40కి పెంచింది. నగరాల్లోని ప్రత్యేక థియేటర్లలో కనీస ధర రూ.100కి, గరిష్ఠ ధర రూ.125కి పెంచింది. దాంతోపాటు ఇప్పుడు ‘పెద్ద’ సినిమాలు విడుదలైన ప్రతిసారీ అదనంగా ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తోంది. ఇటీవలే రాధేశ్యామ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల విషయంలో ధరల పెంపునకు వీలు కల్పించిన ప్రభుత్వం, తాజాగా ‘ఆచార్య’ సినిమా విడుదలయ్యాక పది రోజులపాటు నాన్‌ ప్రీమియం, ప్రీమియం తేడా లేకుండా అన్ని కేటగిరీలపైనా రూ. 50 చొప్పున పెంచుకునేందుకు అనుమతిచ్చింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఆ సినిమా కనీస టికెట్‌ ధర రూ.70. ఒకప్పుడు రూ.5 ఉన్న కనీస ధర.. ఇప్పుడు రూ.70కి చేరింది. అంటే 14 రెట్లు పెరిగింది. మల్టీఫ్లెక్స్‌లలో గరిష్ఠ ధర రూ.300కు చేరింది. టికెట్‌ ధరల్ని భారీగా పెంచుతూ మార్చి 7న ఇచ్చిన జీవోలో.. పేదలకు సినిమా వినోదాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రతి థియేటర్‌లోను కనీసం 25 శాతం సీట్లు నాన్‌ ప్రీమియం కేటగిరీకి కేటాయించాలని ప్రభుత్వం చెప్పింది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు నాన్‌ప్రీమియం, ప్రీమియం అన్న తేడా లేకుండా అన్ని కేటగిరీలకూ ఒకేలా ధరలు పెంచేస్తూ.. అలాంటి నిబంధన పెట్టి ఏం ఉపయోగం అన్న ప్రశ్న పేదవర్గాల నుంచి వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని