AP High Court: భర్త తప్పు చేస్తే.. భార్యకు పదవి ఇవ్వడం తప్పెలా అవుతుంది?

తప్పు చేశారన్న ఆరోపణలతో భర్తను పదవి నుంచి తొలగిస్తే.. అన్ని అర్హతలూ ఉన్న ఆయన భార్యకు అదే పదవి ఇవ్వకూడదని ఏ చట్టంలో ఉందో చూపాలని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. భర్త తప్పు చేసినప్పుడు భార్యను శిక్షించాలని కోరడం ఎంత మాత్రం సబబు కాదు అని వ్యాఖ్యానించింది

Updated : 28 Apr 2022 08:39 IST

పిటిషనర్లను ప్రశ్నించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: తప్పు చేశారన్న ఆరోపణలతో భర్తను పదవి నుంచి తొలగిస్తే.. అన్ని అర్హతలూ ఉన్న ఆయన భార్యకు అదే పదవి ఇవ్వకూడదని ఏ చట్టంలో ఉందో చూపాలని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. భర్త తప్పు చేసినప్పుడు భార్యను శిక్షించాలని కోరడం ఎంత మాత్రం సబబు కాదు అని వ్యాఖ్యానించింది. భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన.. భార్యకు అర్హతలు ఉన్నప్పుడు పదవి చేపట్టకూడదని చెప్పడం సరికాదంది.  బిహార్‌ ముఖ్యమంత్రిగా లాలూప్రసాద్‌ యాదవ్‌ దిగిపోయినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి ఆ పదవిని చేపట్టలేదా అని వ్యాఖ్యానించింది. అప్పీల్‌పై పూర్తిస్థాయి విచారణ చేసేందుకు జూన్‌కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఏలూరు జిల్లా దెందులూరు మండలం పోతునూరు గ్రామంలోని శ్రీభోగేశ్వరస్వామి విశాల సహకార పరపతి సంఘం మేనేజింగ్‌ కమిటీ ఇన్‌ఛార్జి ఛైర్‌పర్సన్‌గా ధూళిపాళ్ల రమాదేవి నియామకాన్ని సవాలు చేస్తూ ఎస్‌.రమేశ్‌ మరో ఇద్దరితో కలిసి హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్యం వేశారు. పరపతి సంఘం మేనేజింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి ధూళిపాళ్ల నాగేంద్ర వరప్రసాద్‌ను తప్పించారని పేర్కొంటూ ఆ స్థానంలో ఆయన భార్య రమాదేవిని నియమించడంపై అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంలో సింగిల్‌ జడ్జి జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. దీంతో ధర్మాసనం ముందు రమేశ్‌ అప్పీలు చేశారు. న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆరోపణలతో పదవి కోల్పోయిన వ్యక్తి స్థానంలో ఆయన భార్య నియామకం సరికాదన్నారు. ఆ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని