బ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తోందని బ్రాహ్మణ సంఘం నాయకులు ధ్వజమెత్తారు. గత తెదేపా ప్రభుత్వంలో కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు

Updated : 02 May 2022 05:42 IST

బ్రాహ్మణ సంఘం నాయకుల విమర్శ

విజయవాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తోందని బ్రాహ్మణ సంఘం నాయకులు ధ్వజమెత్తారు. గత తెదేపా ప్రభుత్వంలో కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఈ ఏడాది డిసెంబరు 25న తలపెట్టిన బ్రాహ్మణ గర్జన ద్వారా తమ సత్తా చాటుతామని పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో ఆ సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకుపైగా బ్రాహ్మణులున్నా.. అన్ని విధాలా వివక్షకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేద పండితులు, పురోహితులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లభించడంలేదని వాపోయారు. ఒకప్పుడు దేవాలయ భూములను పురోహితులు సాగు చేసుకునే వారని, ప్రస్తుతం ప్రభుత్వాలు ఆధీనంలోకి తీసుకోవడంతో జీవనం కష్టంగా మారిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో బ్రాహ్మణులు కీలకంగా వ్యవహరించి, ఉనికి చాటేలా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ గర్జనను జయప్రదం చేయాలని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌ కోరారు. తమ హక్కుల కోసం పోరాడాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కె.సూర్యనారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో పురోహిత్‌ సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వై.నర్సింహమూర్తి, విజయవాడ నగర మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌, గజల్‌ శ్రీనివాస్‌, ఆర్టీవో కమిషనర్‌ ప్రసాదరావు, సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోసూరు సతీష్‌శర్మ, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని