Andhra News: అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి ఎవరు?

అసెంబ్లీ కార్యదర్శి ఎవరనే విషయంలో స్పష్టత కొరవడింది. రెగ్యులర్‌ కార్యదర్శి లేకపోవడంతో ఇన్‌ఛార్జితోనే నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఇన్‌ఛార్జి కార్యదర్శి ఎవరనే విషయంలో స్పష్టత రావడం లే

Updated : 15 May 2022 09:29 IST

 ఇద్దరు ఉండటంతో ఉద్యోగుల్లో గందరగోళం

ఈనాడు, అమరావతి: అసెంబ్లీ కార్యదర్శి ఎవరనే విషయంలో స్పష్టత కొరవడింది. రెగ్యులర్‌ కార్యదర్శి లేకపోవడంతో ఇన్‌ఛార్జితోనే నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఇన్‌ఛార్జి కార్యదర్శి ఎవరనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఉన్న ఇద్దరు ఇన్‌ఛార్జుల్లో ఎవరికి దస్త్రాలు పంపాలనేదీ ఇప్పటికీ ఉద్యోగుల్లో గందరగోళమే. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ నెల 12న స్వయంగా వెళ్లి ఇన్‌ఛార్జి కార్యదర్శిగా ఎవరు కొనసాగాలనే విషయమై మౌఖికంగా స్పష్టతనిచ్చారని తెలిసింది. అయినా.. పరిస్థితిలో మార్పు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ విషయం..

ప్రభుత్వం మొదట బాలకృష్ణమాచార్యులును ఇన్‌ఛార్జి కార్యదర్శిగా నియమించింది. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాతా మళ్లీ అదే హోదాలో కొనసాగిస్తోంది. మార్చిలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సమయంలో ఆయన అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారు. ఆ సమయంలో రాజ్‌కుమార్‌ అనే మరో అధికారికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించి సమావేశాలను ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే గత వారం బాలకృష్ణమాచార్యులు తిరిగి విధుల్లో చేరడంతో సమస్య మొదలైంది. ఆయనకు కార్యదర్శి ఛాంబర్‌ తలుపులు తెరవడం లేదు. దీంతో రోజూ కార్యాలయానికి వస్తూ మరో అధికారి గదిలో కూర్చుంటున్నారు. ఇప్పుడు బాలకృష్ణమాచార్యులు, రాజ్‌కుమార్‌లలో ఎవరు ఇన్‌ఛార్జి కార్యదర్శి..? ఎవరికి దస్త్రాలను పంపాలని ఉద్యోగుల ప్రతినిధులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రి బుగ్గన 12న అసెంబ్లీకి వెళ్లి బాలకృష్ణమాచార్యులు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని స్పష్టతనిచ్చారని సమాచారం. కానీ, 13న బాలకృష్ణమాచార్యులు గది తలుపులు తెరచుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని