Andhra News: దోమల మందుకూ డబ్బుల్లేవ్‌!

గ్రామ పంచాయతీ ఖాతాలో ఉన్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో పనులు చేయడానికి నిధులు లేవని, ప్రజలకు సేవ చేయలేకపోతున్నానని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన

Updated : 16 May 2022 08:48 IST

గ్రామ పంచాయతీల్లో నిధుల్లేవ్‌

ప్రజల సమస్యలను తీర్చేందుకు రూ.6 లక్షలు అప్పు చేశా

పండ్లు, కొబ్బరిబొండాలు అమ్ముకుంటున్నా.. 

వట్టిచెరుకూరు సర్పంచి విజయ కుమార్‌ ఆవేదన 

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీ ఖాతాలో ఉన్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో పనులు చేయడానికి నిధులు లేవని, ప్రజలకు సేవ చేయలేకపోతున్నానని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన వట్టిచెరుకూరు సర్పంచి ఆరమళ్ల విజయ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి సొమ్ము లేకపోవడంతో పంచాయతీ కార్యాలయానికీ వెళ్లడం లేదని తెలిపారు. గ్రామస్థులు తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే వారి సమస్యలను తీర్చడానికి రూ.6 లక్షలు అప్పు తెచ్చి వివిధ పనులు చేశానని, ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. గ్రామ పంచాయతీ ఖాతాలో ఉన్న ఆర్థిక సంఘం నిధులు రూ.17లక్షలను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బిల్లులు కింద జమ చేసుకుందని తెలిపారు. ఎప్పటి నుంచో ఉన్న బకాయిలను ఒకేసారి జమ చేసుకుంటే పనులు ఎలా చేయాలని ప్రశ్నించారు. గ్రామంలో గ్రీన్‌ అంబాసిడర్‌లకు 9 నెలలుగా జీతాలు రాకపోవడంతో వారి అవసరాలకు జేబు నుంచి సొమ్ము చెల్లిస్తున్నానని చెప్పారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాల్సిన రాష్ట్రం.. కేంద్రం ఇచ్చిన నిధులు తీసేసుకుంటే తామేం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలం కావడంతో కొబ్బరి బొండాలు, పండ్లు అమ్ముకుంటున్నానని చెప్పారు. ‘మేజరు పంచాయితీ అయిన మా గ్రామంలోనే 3 గంటలు కరెంటు ఉండటం లేదు. చిన్న పిల్లలు, వృద్ధులు రాత్రి పూట ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీలో సొమ్ము లేకపోతే దోమల మందు, శానిటైజేషన్‌ ఎలా చేయాలి. పైపులైను లీకేజీలు ఎలా అరికట్టాలి’ విజయ కుమార్‌ ప్రశ్నించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని