Satya Kumar: అతిసారం మరణాలకు.. వైకాపా ప్రభుత్వ వైఫల్యమే కారణం

Published : 24 Jun 2024 03:59 IST

వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

జగ్గయ్యపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతితో మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌.
చిత్రంలో శ్రీరాంతాతయ్య, నెట్టెం రఘురాం తదితరులు

జగ్గయ్యపేట, కాకినాడ కలెక్టరేట్, కాకినాడ (మసీదుసెంటర్‌), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే పదో ఆర్థిక సంఘం నిధులను గత వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టించిన పాపమే నేడు ప్రజల ప్రాణాలను హరిస్తోందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమై కనీసం గ్రామాల్లో సరైన రక్షితనీరు ప్రజలకు అందే పరిస్థితి లేదన్నారు. జగ్గయ్యపేటలో డయేరియా కేసులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వ్యాధి ప్రభావిత ప్రాంతాలను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ‘పంచాయతీల్లో చేపట్టాల్సిన పనుల గురించి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని 23 గ్రామాల పరిధిలో 160 డయేరియా కేసులు నమోదయ్యాయి’ అని సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు. 

తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయలేదు

వైకాపా హయాంలో పారిశుద్ధ్యం లోపించడం, తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయకపోవడంతోనే కాకినాడ జిల్లాలో అతిసారం వ్యాపిస్తోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకు ఇచ్చే చంద్రన్న బీమాను రూ.10 లక్షలకు పెంచనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు.

కాకినాడ జీజీహెచ్‌లో బాలికను పరామర్శిస్తున్న మంత్రి వాసంశెట్టి సుభాష్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని