Anakapalle: ఇంజక్షన్లు వికటించి 17 మంది రోగులకు అస్వస్థత

అనకాపల్లి జిల్లా నక్కపల్లి 50 పడకల ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం రాత్రి ఇంజక్షన్‌లు వికటించడంతో అక్కడ చికిత్స పొందుతున్న పలువురు రోగులు మరింత అస్వస్థతకు గురయ్యారు.

Updated : 10 Jul 2024 07:49 IST

నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన

నక్కపల్లి ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో రోగి తరలింపు

నక్కపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా నక్కపల్లి 50 పడకల ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం రాత్రి ఇంజక్షన్‌లు వికటించడంతో అక్కడ చికిత్స పొందుతున్న పలువురు రోగులు మరింత అస్వస్థతకు గురయ్యారు. నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రోగులు, బాలింతలు రెండు మూడు రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారు. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న వైద్యురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో నర్సులు వీరికి ఇంజక్షన్లు ఇచ్చారు. కాసేపటికే పై అంతస్తులో చికిత్స పొందుతున్న రోగులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. కొందరికి చలి జ్వరం వచ్చింది. వీరిలో ఐదుగురు చిన్నారులూ ఉన్నారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారి వీరందరికీ విరుగుడు మందులు ఇస్తూనే పోలీసులు, ఉన్నతాధికారులకు తెలియజేశారు. రోగుల సహాయకులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఆందోళన నెలకొంది. హోం మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్‌తో మాట్లాడారు. చివరకు అంబులెన్స్‌ల్లో 17 మందిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో సింహాద్రి అనే రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు. ఇంజక్షన్లు వికటించడంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని