AP DGP: ఏకపక్ష ధోరణి లేకుండా చూస్తా

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే ధోరణి లేకుండా చూస్తానని నూతన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి చెప్పారు. వివాదాలకు తావివ్వకుండా పోలీసు వ్యవస్థను నిర్దిష్ట పద్ధతిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

Updated : 20 Feb 2022 04:46 IST

వివాదాలకు తావివ్వకుండా పోలీసు వ్యవస్థను నిర్దిష్ట పద్ధతిలో తీసుకెళ్తా
కొత్త డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి

ఈనాడు, అమరావతి: పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే ధోరణి లేకుండా చూస్తానని నూతన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి చెప్పారు. వివాదాలకు తావివ్వకుండా పోలీసు వ్యవస్థను నిర్దిష్ట పద్ధతిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనపై విశ్వాసంతో చాలా పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ప్రతిష్ఠ, గౌరవం పెంచేలా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తప్పులు జరిగినప్పుడు, నిరాధార ఆరోపణలకు గురైనప్పుడు సిబ్బందికి బాసటగా ఉంటానని ప్రకటించారు.

ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజా సహకారం పొందేలా డీఐజీలు, ఎస్పీలు.. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేయాలన్నారు. రాష్ట్ర డీజీపీగా శనివారం బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథరెడ్డి మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీసు యూనిట్ల స్వరూపం, సిబ్బంది విభజన తదితర అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో కమిటీ వేశామని, ప్రస్తుతం అధ్యయనం జరుగుతోందని చెప్పారు. ఉగాదికి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాల్సి ఉన్నందున ఈ అంశాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త పోలీసు కమిషనరేట్ల ఏర్పాటు అంశం చర్చల్లో ఉందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

ప్రభుత్వ సంస్థలపై దాడులు సహించం

‘ఇటీవల కొన్నిచోట్ల ప్రభుత్వ సంస్థలపై దాడులు చోటుచేసుకున్నాయి. అలాంటి ఘటనల్లో బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తా. మతపరమైన చిన్నచిన్న వివాదాలు తలెత్తితే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వాటిని పరిష్కరించాలి. పోలీసు శాఖను ప్రక్షాళించాల్సిన అవసరం ఉంటే చేస్తా. వీవీఐపీలు, వీఐపీల కార్యక్రమాల్లో భద్రతాపరమైన ఆంక్షల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రముఖుల భద్రతకూ సమస్య తలెత్తకుండా ఎలా వ్యవహరించాలో అధ్యయనానికి కమిటీ వేశాం. ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తా. మహిళలు, చిన్నారులు, అణగారిన వర్గాలపై జరిగే నేరాల విషయంలో పోలీసులు సత్వరం స్పందించాలి. ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి సాగు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తాం. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిస్తాం. మావోయిస్టుల సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఏపీ పోలీసుకు బాగా తెలుసు’ అని అన్నారు.

అప్పగించిన బాధ్యతలు నెరవేర్చా: గౌతమ్‌ సవాంగ్‌

పోలీసుశాఖ గతంలో ఎన్నడూ చూడని సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతల మేరకు పనిచేశానని పదవీ విరమణ చేసిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. కొత్త డీజీపీకి బాధ్యతలు అప్పగించిన అనంతరం సవాంగ్‌ దంపతుల్ని పోలీసు అధికారులు, సిబ్బంది పూలతో అలంకరించిన వాహనంలో ఎక్కించి, మంగళగిరి బెటాలియన్‌లో పరేడ్‌ నిర్వహించి గౌరవ వీడ్కోలు పలికారు. సవాంగ్‌ మాట్లాడుతూ ‘రెండేళ్ల ఎనిమిది నెలలపాటు నన్ను డీజీపీగా కొనసాగించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఈ సమయంలో పోలీసు శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాను. నా హయాంలో 7,552 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం చేశాం. కొత్త డీజీపీ రాజేంద్రనాథరెడ్డి పోలీసు వ్యవస్థను ఉన్నత శిఖరాలపై నిలబెడతారని ఆశిస్తున్నా’ అని అన్నారు.

ఆ ప్రశ్నకు నవ్వే సమాధానం

‘ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరిస్తారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా డీజీపీ పెద్దగా నవ్వారు. 

విలేకరి: ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ ప్రతిష్ఠకు గత రెండున్నరేళ్లలో తీవ్ర విఘాతం కలిగింది. దాన్ని ఎలా అధిగమిస్తారు?
డీజీపీ:
మీ మాటలతో నేను ఏకీభవించట్లేదు. ఎక్కడ సమస్య వచ్చినా సత్వరమే స్పందించాం. అవసరమైనచోట పరిస్థితులు చక్కదిద్దుతాం.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆ పరిస్థితిని ఎలా మారుస్తారు?
అలాంటి ధోరణి లేకుండా చూస్తాం. వివాదాలకు తావివ్వం.

ప్రభుత్వ విధానాల్ని విమర్శించినా, లోపాలు ఎత్తిచూపినా వారి భావప్రకటన స్వేచ్ఛ హరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దానికి మీరు అడ్డుకట్ట వేస్తారా?
అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూస్తాం.

కొన్నిచోట్ల పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా  బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు?
అలా దురుద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని