AP Highcourt: అవినీతి కేసుల్లో అలసత్వమా?

అవినీతి కేసుల్లో దర్యాప్తు, అభియోగపత్రం దాఖలులో జాప్యం జరుగుతుండటంతో అనిశాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అవినీతి కేసుల్లో అనిశా కఠినంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించింది.

Updated : 16 Feb 2022 05:22 IST

సకాలంలో అభియోగపత్రం దాఖలు చేయనందుకు అనిశాపై హైకోర్టు ఆగ్రహం
స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని డీజీకి ఆదేశం
ప్రభుత్వం ఇలా నడవడానికి వీల్లేదని ఘాటు వ్యాఖ్య

ఈనాడు, అమరావతి: అవినీతి కేసుల్లో దర్యాప్తు, అభియోగపత్రం దాఖలులో జాప్యం జరుగుతుండటంతో అనిశాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అవినీతి కేసుల్లో అనిశా కఠినంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించింది. ప్రకాశం జిల్లా కొమరోలులోని ఎస్‌ఎల్‌వీ ఎడ్యుకేషనల్‌ సొసైటీపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో 2018లో కేసు నమోదైనా, ఇంతవరకు అభియోగపత్రం(ఛార్జిషీట్‌) దాఖలు చేయకపోవడంపై అనిశా డీజీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సంబంధిత సొసైటీకి రక్షణగా ఉంటూ ఉద్దేశపూర్వకంగా అభియోగపత్రం వేయడంలో జాప్యం చేస్తున్నారని అనిశాను తీవ్రంగా ఆక్షేపించింది. మొత్తం రికార్డులతో మార్చి 4న కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని అనిశా డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుని ఆదేశించింది. అనిశా ముందు ప్రస్తుతం ఎన్ని కేసులు ఉన్నాయి... ఎన్ని కేసుల్లో దర్యాప్తు చేస్తున్నారు... అవి ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయో అఫిడవిట్‌ రూపంలో కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తామని డీజీని హెచ్చరించింది. అనిశా కేసుల్లో జాప్యాన్ని సహించబోమంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నడవడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎస్‌.సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

* ఎస్‌ఎల్‌వీ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి చెందిన పాఠశాలల ఉన్నతీకరణ(అప్‌గ్రేడ్‌), విభజన, ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలపై విచారణ చేయాలని ప్రకాశం జిల్లా డీఈవోను పాఠశాల విద్య డైరెక్టర్‌ ఆదేశించడాన్ని సవాలు చేస్తూ సంబంధిత సొసైటీ కార్యదర్శి, ఎస్‌బీఎన్‌ఆర్‌ఎం ఎయిడెడ్‌ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ బి.నారాయణరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి దాన్ని కొట్టేశారు. డీఈవో వద్ద విచారణకు హాజరై పరిశీలన నిమిత్తం రికార్డులు సమర్పించాలని 3 నవంబరు 2021న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆ సొసైటీ కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. దస్త్రాలను పరిశీలించిన ధర్మాసనం... 2018 జనవరి 21న ఈ వ్యవహారంపై అనిశా కేసు నమోదు చేసినట్లు గుర్తుచేసింది. ఇప్పటివరకు అభియోగపత్రం వేయకపోవడంపై తీవ్రంగా మండిపడింది. అనిశా తరఫు న్యాయవాది సుభాని వాదనలు వినిపిస్తూ... దర్యాప్తు తుదిదశలో ఉందని, అభియోగపత్రం వేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి అవసరమన్నారు. మేము ఈ వ్యవహారాన్ని సీరియస్‌గానేతీసుకున్నామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... కోర్టు ముందుంచిన పత్రాలే ఏమాత్రం సీరియస్‌గా తీసుకున్నారో తెలియజేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేసింది. సంచిలోని పిల్లిని బయటకు ఎలా తీసుకురావాలో తమకు తెలుసంది. కేసు డైరీతోపాటు పూర్తి రికార్డులతో అనిశా డీజీ కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని