AP News: సమస్యల పరిష్కారానికి సీఎస్‌లతో సంయుక్త కమిటీ
ఆంధ్రప్రదేశ్, ఒడిశా సీఎంల నిర్ణయం
భువనేశ్వర్‌లో నవీన్ పట్నాయక్‌తో జగన్ భేటీ
సాగునీటి ప్రాజెక్టులు, వామపక్ష ఉగ్రవాదం సహా పలు అంశాలపై చర్చ
భువనేశ్వర్‌లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు శ్రీవారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య ఉన్న సమస్యలను చర్చలతో పరిష్కరించేందుకు ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కమిటీ ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రులిద్దరూ నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్ మధ్య మంగళవారం భువనేశ్వర్‌లో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరడి బ్యారేజీ, జంఝావతి రిజర్వాయరు, పోలవరం ప్రాజెక్టు, బహుదా రిజర్వాయర్ నుంచి ఇచ్ఛాపురానికి నీటి విడుదల, బలిమెల, ఎగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టులకు పరస్పర ఎన్‌ఓసీలు, కొఠియా గ్రామాల వంటి అంశాల పరిష్కారానికి కలసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు. సమావేశం అనంతరం భువనేశ్వర్‌లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఏపీ సీఎం కార్యాలయం కూడా ఒక ప్రకటనలో ఆ సమావేశం వివరాల్ని వెల్లడించింది. సమావేశం ఫలప్రదంగా జరిగిందని ఇద్దరు ముఖ్యమంత్రులూ వేర్వేరుగా ట్వీట్ చేశారు.
గంజాయి సాగు అరికట్టేందుకు పరస్పర సహకారం
‘ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు రాష్ట్రాలే కాదు. రెండింటికీ వైభవోపేతమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాలూ ప్రకృతి విపత్తుల సమయంలో పరస్పర సహకారం అందించుకుంటున్నాయి. జలవనరులు, ఉమ్మడి సరిహద్దు, ఇంధనం, వామపక్ష తీవ్రవాదం వంటి అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. వామపక్ష తీవ్రవాదం, గంజాయి సాగు, రవాణాల్ని అరికట్టడం వంటి అంశాలపై రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలని నిర్ణయించారు’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
బ్రహ్మపుర యూనివర్సిటీలో తెలుగు పీఠం
‘శ్రీకాకుళంలోని బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో ఒడియా పీఠాన్ని, ఒడిశాలోని బ్రహ్మపుర యూనివర్సిటీలో తెలుగు భాషా పీఠాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. పాఠశాలల్లో తెలుగు, ఒడియా భాషల్ని బోధించే అధ్యాపకుల్ని నియమించాలని, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని, భాషా పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు’ అని వెల్లడించారు.
ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ఒడిశా, ఏపీ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, జగన్‌మోహన్‌రెడ్డి
సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు: జగన్
‘సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య చాలా అపరిష్కృత అంశాలున్నాయి. వాటి పరిష్కారం దిశగా తొలిసారి ముందడుగేశాం. ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించడం సంతోషకరం. చర్చలు జరిపినందుకు, సంయుక్త కమిటీ ఏర్పాటుకు ముందుకొచ్చినందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు, ఒడిశా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర అధికారులకు ధన్యవాదాలు. రెండు రాష్ట్రాల ప్రజల విశాల ప్రయోజనాల్ని కాపాడటమే మా ధ్యేయం’ అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఒడిశాలో పాక్షికంగా ముంపునకు గురువుతున్న ప్రాంతంలో రక్షణ చర్యలపై జగన్ సూచనలు చేశారు. ‘ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ధన్యవాదాలు. సాదరంగా ఆహ్వానించి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉంది. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలనిస్తాయని విశ్వసిస్తున్నాను’ అని జగన్ మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు.
ఫలప్రదంగా చర్చలు: నవీన్ పట్నాయక్
‘జగన్‌తో సమావేశం చాలా సంతోషాన్నిచ్చింది. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై సుహృద్భావ వాతావరణంలో, ఫలప్రదమైన చర్చలు జరిగాయి. జలవనరులు, ఉమ్మడి సరిహద్దు, ఇంధనం, వామపక్ష ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చించాం’ అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
జగన్‌కు సాదర స్వాగతం
విశాఖ నుంచి మంగళవారం సాయంత్రం 4.20 గంటలకు జగన్ భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఒడిశా అధికారులు స్వాగతం పలికారు. ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్లి, అక్కడి నుంచి లోక్‌సేవా భవన్‌కు చేరుకున్నారు. అక్కడ నవీన్ పట్నాయక్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. తొలుత ఇద్దరి మధ్య సమావేశం, అనంతరం రెండు రాష్ట్రాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నూతన వధూవరులను
ఆశీర్వదించిన ముఖ్యమంత్రి
పాతపట్నం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వేదిత (ఐఏఎస్) వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ మంగళవారం హాజరయ్యారు. నూతన వధువరూలను ఆశీర్వదించిన అనంతరం ఒడిశా బయలుదేరారు.
బాగున్నారా...అందరూ ఐక్యంగా ఉండాలి
ఒడిశాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు భువనేశ్వర్‌లోని రాష్ట్ర అతిథి భవనంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. బాగున్నారా? అని వారిని జగన్ కుశల ప్రశ్నలు వేశారు. ఒడిశాలోని తెలుగువారంతా ఐకమత్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కౌశలాంధ్ర తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు దాసరి మురళీకృష్ణ ముఖ్యమంత్రిని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. భువనేశ్వర్‌లోని ఆంధ్ర సాంస్కృతిక సమితి అధ్యక్షుడు వి.శ్రీనివాస్, కటక్‌లోని ఐక్యత స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్ వి.సుభాష్‌నాయుడు, ఆయా సంస్థల ప్రతినిధులు జగన్‌ను కలిశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dhanush: మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాం: ధనుష్
-
General News
Telangana News: బతుకమ్మ కానుకగా కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్: మంత్రి హరీశ్‌రావు
-
India News
‘ఆ రెండూ ఉచితాలు కావు.. ఇంతకుమించి మాట్లాడను’: స్టాలిన్
-
Sports News
Virat Kohli : విరాట్‌లా సుదీర్ఘ ఫామ్‌లేమి.. వారికి ఎందుకు ఉండదంటే..?
-
World News
Taliban: కాబుల్‌లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు