AP News: పేదల ఇళ్లపై ఇనుము భారం

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు సరఫరా చేసే స్టీలును పాత ధరలకే అందించలేమని కంపెనీలు గృహ నిర్మాణ సంస్థకు స్పష్టం చేశాయి.

Updated : 19 Feb 2022 05:47 IST

పాత ధరలకు ఇవ్వలేమన్న స్టీలు కంపెనీలు

మళ్లీ టెండర్లు పిలిచిన గృహ నిర్మాణ సంస్థ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు సరఫరా చేసే స్టీలును పాత ధరలకే అందించలేమని కంపెనీలు గృహ నిర్మాణ సంస్థకు స్పష్టం చేశాయి. ప్రస్తుతం టన్ను స్టీలును రూ.62-64 వేలతో కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ఇదే ధరకు మరికొంత కాలం సరఫరా చేయాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులు కంపెనీలకు విజ్ఞప్తి చేసినా అంగీకరించలేదు. కొన్ని జిల్లాల్లో గృహ నిర్మాణాలకు లబ్ధిదారుల నుంచి స్టీలుకు డిమాండ్‌ పెరుగుతుండటంతో అధికారులు మళ్లీ టెండర్లు పిలిచారు.

ఈ పథకం కింద ప్రభుత్వం మొదటి విడతగా 15.75 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. పథకం ప్రారంభంలో ఏడాది కాలపరిమితితో టెండర్లు పిలిచి టన్ను రూ.56 వేలకు ధర ఖరారు చేసి లబ్ధిదారులకు సరఫరా చేశారు. గతేడాది అక్టోబర్‌ వరకు ఇదే ధర కొనసాగింది. ఆ తర్వాత ఏడాది గడువుతో సరఫరాకు కంపెనీలు ముందుకురాలేదు. దీంతో కాలపరిమితిని మూడు నెలలకు కుదించి మళ్లీ టెండర్లు పిలిచారు. టన్ను ధర రూ.56 వేల నుంచి రూ.62-64 వేలకు చేరింది. గతేడాది అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు ఇదే ధరతో సరఫరా చేశారు. బహిరంగ మార్కెట్‌లో స్టీలు ధర పెరగడంతో కంపెనీలు మరికొంతకాలం నిర్దేశిత ధరకు సరఫరాకు ముందుకు రాలేదు. దీంతో 2 రోజుల క్రితం టెండర్లు పిలిచారు.

ఈనెల 25న టెండర్లు ఓపెన్‌ చేయనున్నారు. అయితే టెండరు    నిబంధనల్లో ఎక్కడా 3 నెలల గడువు పేర్కొనలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం 9 కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు స్టీలును సరఫరా చేస్తున్నాయి.

34 వేల టన్నుల సరఫరాకు టెండర్లు...

రాబోయే మూడు నెలల కాలంలో ఇళ్ల నిర్మాణాల పురోగతికి అనుగుణంగా జిల్లాల నుంచి స్టీలు ఇండెంట్‌ తెప్పించారు. 34 వేల టన్నుల స్టీలు అవసరం ఉన్నట్లు జిల్లా అధికారులు నివేదించారు. ఆ ప్రకారమే టెండర్లు పిలిచారు. పునాది దశలోనే స్టీలు వినియోగించాల్సి ఉన్నందున కోస్తా జిల్లాల నుంచే ఇండెంట్‌ ఎక్కువగా ఉంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పాత స్టాక్‌ పూర్తి కాగా మిగతా జిల్లాల్లో కొంతమేర ఉంది.

లబ్ధిదారునిపై రూ.2-3 వేల వరకు పెరిగిన భారం

ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభంలో లబ్ధిదారులకు టన్ను రూ.56 వేలతో స్టీలు అందించగా అది రూ.62-64వేలకు పెరగడంతో ఒక్కో లబ్ధిదారునిపై అదనంగా రూ.2 నుంచి 3 వేల(అర టన్నుకు) భారం పడింది. తాజాగా బహిరంగ మార్కెట్‌లో స్టీలు ధర మరింత పెరిగి రూ.70 వేలకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు కంపెనీలు అధిక ధరకు కోడ్‌ చేస్తే అది లబ్ధిదారులకు మరింత భారమయ్యే అవకాశముంది. కంపెనీలు ఏ మేరకు కోడ్‌ చేసినా సంప్రదింపులకు అవకాశం ఉంటుందని, ఆ మేరకు నిబంధనల్లోనే పేర్కొన్నామని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని