AP News: అణు జలాంతర్గాములు

అణు జలాంతర్గాములను నిర్మించుకునే స్థాయికి భారతదేశం ఎదగడం గర్వకారణమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ తీరంలో రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష(పీఎఫ్‌ఆర్‌)ను సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతితో పాటు

Updated : 22 Feb 2022 05:05 IST

నిర్మించుకునే స్థాయికి ఎదిగాం
ఇది మనందరికీ గర్వకారణం
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
పీఎఫ్‌ఆర్‌’లో నౌకాదళ విన్యాసాలను తిలకించిన ప్రథమ పౌరుడు

ఈనాడు, విశాఖపట్నం: అణు జలాంతర్గాములను నిర్మించుకునే స్థాయికి భారతదేశం ఎదగడం గర్వకారణమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ తీరంలో రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష(పీఎఫ్‌ఆర్‌)ను సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతితో పాటు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌, రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి డి.జె.చౌహాన్‌, తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా పాల్గొన్నారు. పీఎఫ్‌ఆర్‌లో భాగంగా 44 యుద్ధనౌకలను రాష్ట్రపతి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో నిర్మాణంలో ఉన్న యుద్ధనౌకలు, జలాంతర్గాములకు ఉపయోగిస్తున్న 70 శాతం పరికరాలు దేశీయంగా తయారైనవి కావడం ప్రశంసనీయమన్నారు. విమానవాహక యుద్ధనౌక ‘విక్రాంత్‌’నూ దేశీయంగానే తయారు చేసుకుంటున్నామని, గత ఏడాది డిసెంబరులో కొచ్చి వెళ్లినప్పుడు దాన్ని పరిశీలించడం ఆనందం కలిగించిందన్నారు. 1971 యుద్ధంలో తూర్పునౌకాదళం కీలకపాత్ర పోషించిందన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఘాజీ జలాంతర్గామిని దెబ్బతీయడంలో తూర్పునౌకాదళానికి సాహసోపేత పాత్ర అని గుర్తుచేశారు. పలుదేశాల నౌకాదళాలతో ఈ నెల 25 నుంచి విశాఖలో నిర్వహించబోతున్న ‘మిలాన్‌’ విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.

అబ్బురపరిచిన విన్యాసాలు
రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష సందర్భంగా ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. సముద్రంలో పడిన వారిని రక్షించడం, రాష్ట్రపతి ప్రయాణించిన ఐఎన్‌ఎస్‌ సుమిత్ర యుద్ధనౌక చుట్టూ హాక్‌ యుద్ధవిమానాలు వాయువేగంతో వృత్తాకారంలో తిరగడం, 90 డిగ్రీలకు పైగా వంగి చక్కర్లు కొట్టడం, చేతక్‌, సీకింగ్‌, యూహెచ్‌3హెచ్‌, ఏఎల్‌హెచ్‌ హెలికాప్టర్లు, డోర్నియర్‌, పీ8ఐ నిఘా విమానాలు, ఐఎల్‌ 38, మిగ్‌ 29కె యుద్ధ విమానాలు క్రమపద్ధతిలో చక్కర్లు కొట్టిన దృశ్యాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. 4 వరుసల్లో నిలిపి ఉంచిన యుద్ధనౌకలు, జలాంతర్గాములను రాష్ట్రపతి పరిశీలించారు. తెరచాప పడవలతో నిర్వహించిన ‘పరేడ్‌ ఆఫ్‌ సెయిల్స్‌’ను వీక్షించారు.  అనంతరం స్మారక స్టాంపు, ఫస్ట్‌డే కవర్‌లను రాష్ట్రపతి విడుదల చేశారు. నౌకాదళ అధికారులతో రామ్‌నాథ్‌ కోవింద్‌, రాజ్‌నాథ్‌సింగ్‌ ఫొటో దిగారు. సోమవారం రాత్రి విశాఖలోనే బస చేసిన రాష్ట్రపతి మంగళ వారం ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరనున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని