Nobel Prize: వలసవేదనల అక్షరశిల్పికి సాహిత్య నోబెల్‌

నిలువ నీడ కోల్పోయి పరాయి దేశాన్ని ఆశ్రయించే శరణార్థుల వ్యధ,  వలసపాలన మిగిల్చిన చేదు జ్ఞాపకాలకు అద్భుత రీతిలో అక్షర రూపాన్ని ఇచ్చిన టాంజానియా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నా

Updated : 08 Oct 2021 05:44 IST

పురస్కారానికి ఎంపికైన అబ్దుల్‌రజాక్‌

స్టాక్‌హోం: నిలువ నీడ కోల్పోయి పరాయి దేశాన్ని ఆశ్రయించే శరణార్థుల వ్యధ,  వలసపాలన మిగిల్చిన చేదు జ్ఞాపకాలకు అద్భుత రీతిలో అక్షర రూపాన్ని ఇచ్చిన టాంజానియా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నా (73)ను ఈ ఏడాది సాహిత్య విభాగంలో నోబెల్‌ పురస్కారం వరించింది. ‘‘వలసవాద దుష్ప్రభావాలను రాజీలేని విధంగా, కరుణాత్మకంగా ఆయన స్పృశించారు’’ అని ఎంపిక కమిటీ గురువారం ప్రశంసించింది. ఈ బహుమతి కింద ఆయనకు 11.4 లక్షల డాలర్లు అందుతాయి. 1986లో వోల్‌ సోయింకా తర్వాత ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నల్ల జాతి ఆఫ్రికన్‌గా అబ్దుల్‌ గుర్తింపు పొందారు.

భిన్న సంస్కృతులు, భౌగోళిక ఖండాల మధ్య ఉండే వైరుధ్యాల నేపథ్యంలో సాగే శరణార్థుల బతుకు పోరాటాన్ని అబ్దుల్‌ వెలుగులోకి తెచ్చారని నోబెల్‌ ఎంపిక కమిటీ ‘స్వీడిష్‌ అకాడమీ’ తెలిపింది. వలసపాలన అనంతర కాల రచయితల్లో అబ్దుల్‌ అత్యంత ప్రముఖుడని పురస్కార కమిటీ ఛైర్మన్‌ ఆండర్స్‌ ఆల్సన్‌ తెలిపారు. ‘‘అనేకమంది పాఠకులకు తెలియని ‘మరో ఆఫ్రికా’ను అత్యంత స్పష్టంగా తన రచనల్లో సాక్షాత్కరింపచేశారు. పోర్చుగీసు నుంచి బ్రిటిషు వరకూ వివిధ దేశాల వలసపాలనలో బానిసత్వంతో మగ్గిన తీరును ఆయన ఆవిష్కరించారు’’ అని కొనియాడారు.ఆఫ్రికా ఖండంలోని టాంజానియాకు చేరువలో హిందూ మహాసముద్రంలో ఉన్న జాంజిబార్‌ అనే దీవిలో 1948లో అబ్దుల్‌ జన్మించారు. అక్కడ అశాంతి ప్రజ్వరిల్లడంతో ఆయన 1968లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. కెంట్‌ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ‘వలసపాలన అనంతర సాహిత్యాన్ని’ బోధించారు. ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఆయన 10 నవలలను రచించారు. ఇందులో ‘పారడైజ్‌’, ‘‘డిజర్షన్‌’ కూడా ఉన్నాయి. పారడైజ్‌ నవలను 1994లో ప్రచురించారు. 20వ శతాబ్దం ఆరంభంలో టాంజానియాలో పెరిగిన ఒక బాలుడి కథను ఇందులో వర్ణించారు. ఇది ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌కు తుది రౌండ్‌ వరకూ పోటీ పడింది. ఇంకా.. ‘మెమరీ ఆఫ్‌ డిపార్చర్‌’, ‘పిలిగ్రిమ్స్‌ వే’, ‘బై ద సీ’ వంటి రచనలు చేశారు. ఆయన మాతృభాష స్వహిలి. రచనలు మాత్రం ఆంగ్లంలో సాగాయి. ఆఫ్రికాలో జన్మించిన రచయిత ఒకరికి నోబెల్‌ రావడం ఇది ఆరోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని