Andhra News: ఏపీలో సినిమా టికెట్‌ ధరల ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లోని సింగిల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్‌ ధర కనీసం రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.250గా నిర్ణయించింది.

Updated : 08 Mar 2022 06:51 IST

గరిష్ఠం రూ.250, కనీస ధర రూ.20
షరతులతో ఐదో ఆటకు అనుమతి
20శాతం షూటింగ్‌ ఏపీలో జరిగితేనే
100 కోట్ల సినిమాకు ప్రత్యేక ధరలు
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని సింగిల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్‌ ధర కనీసం రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.250గా నిర్ణయించింది. ఏసీ, నాన్‌ ఏసీ, థియేటర్లు ఉన్న ప్రాంతాలు, వాటిలో కల్పించే సదుపాయాల ఆధారంగా టికెట్ల ధరలను నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. టికెట్ల ధరల్లో జీఎస్టీ మినహా నిర్వహణ ఛార్జీలు ఏసీకి రూ.5, నాన్‌ ఏసీకి రూ.3తోపాటు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఛార్జీలు కలిసి ఉంటాయి. ఏసీ థియేటర్లలో రిక్లెయినర్‌ సౌకర్యం అందుబాటులో ఉన్నచోట టికెట్‌ ధర రూ.250కి అనుమతించింది. కొన్ని నిబంధనలతో 5వ ఆట నిర్వహణకు వెసులుబాటు కల్పించింది.

* ఎక్కువ ధరకు టికెట్‌ కొని సినిమా చూడలేనివారి కోసం ప్రతి థియేటర్‌లోని మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను ప్రీమియం కాని (నాన్‌ప్రీమియం) కేటగిరీగా కేటాయించాలి.  
* ఎయిర్‌కూల్‌ థియేటర్లను సింగిల్‌ కేటగిరీ ఏసీ థియేటర్ల జాబితాలో విలీనం చేశారు. ఇవి ఏసీ లేదా నాన్‌ ఏసీ ఛార్జీలను వసూలు చేసుకునేందుకు రెండేళ్ల వరకు అనుమతిస్తారు.
* ప్రత్యేక థియేటర్లను ప్రత్యేకంగా వర్గీకరించారు. 2కే ప్రొజెక్షన్‌, ఇతర మౌలిక సదుపాయాలు, హై ఎండ్‌ సీటింగ్‌, అంతకంటే ఎక్కువ డిజిటల్‌ సరౌండ్‌ సిస్టమ్‌ వంటి సౌకర్యాలతో మల్టీప్లెక్స్‌ థియేటర్‌లకు సమానంగా అనేక సింగిల్‌ థియేటర్లు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ప్రత్యేక కేటగిరీ థియేటర్ల గుర్తింపు కోసం నోడల్‌ అధికారిగా ఆ జిల్లా సంయుక్త కలెక్టర్‌తో జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, అవసరమైన మార్గదర్శకాలను విడిగా జారీ చేస్తారు.
* ఎక్కువ బడ్జెట్‌ సినిమాలతో పోటీపడే చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు షరతులతో ఐదు షోలకు ప్రభుత్వం అనుమతించింది. తక్కువ బడ్జెట్‌ సినిమా విడుదలైనప్పుడల్లా పండగ రోజు సహా ఏ రోజైనా వాటిని ప్రదర్శించడానికి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక ఆట తప్పనిసరిగా వాటికి రిజర్వు చేయాలనే షరతుతో 5 ఆటలకు అనుమతించింది.
* కథానాయకుడు, నాయిక, దర్శకుడి పారితోషికాన్ని మినహాయించి రూ.100 కోట్ల కంటే ఎక్కువ నిర్మాణ వ్యయంతో తీసే చిత్రాలను సూపర్‌ హై బడ్జెట్‌ చిత్రాలుగా పరిగణిస్తారు. ఇలాంటి చిత్రాలు కనీసం 20 శాతం షూటింగ్‌ ఏపీలో జరిగి ఉంటేనే.. విడుదలైన మొదటి పది రోజులకు ప్రత్యేక ధరలను ప్రభుత్వం నోటిఫై చేస్తుంది.
* తక్కువ బడ్జెట్‌, ఎక్కువ బడ్జెట్‌, సూపర్‌ హై బడ్జెట్‌ సినిమాలకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాలను సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుంది.

చిరంజీవి కృతజ్ఞతలు

సినిమా టికెట్‌ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ప్రముఖ నటుడు చిరంజీవి ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగేలా, థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ కొత్త జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు 5వ షోకు అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడుతుంది. ఇందుకు సహకరించిన మంత్రి పేర్ని నానికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని