Anganwadi: నిర్బంధాలను నిగ్గదీసి..

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని జిల్లాల్లోనూ కదం తొక్కారు. పోలీసుల హెచ్చరికలు, ముందస్తు గృహ నిర్బంధాలు, అరెస్టులను లెక్కచేయలేదు. అడ్డంకులను అధిగమించి నిరసన గళం వినిపించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) పిలుపు మేరకు

Updated : 22 Feb 2022 06:53 IST

జిల్లా కేంద్రాల్లో కదం తొక్కిన అంగన్‌వాడీ కార్యకర్తలు
పలుచోట్ల ఉద్రిక్తంగా ‘చలో కలెక్టరేట్‌’
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని జిల్లాల్లోనూ కదం తొక్కారు. పోలీసుల హెచ్చరికలు, ముందస్తు గృహ నిర్బంధాలు, అరెస్టులను లెక్కచేయలేదు. అడ్డంకులను అధిగమించి నిరసన గళం వినిపించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేశారు. నిరసనల్లో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ల కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా కొన్నిచోట్ల అంగన్‌వాడీలకు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఈ సందర్భంగా... సీఎం జగన్‌ మాట తప్పి తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితిని కల్పించారని మండిపడ్డారు. కొవిడ్‌ సమయంలో మృతి చెందిన వారికి నష్టపరిహారం అందించాలని, కనీస వేతనం రూ.26 వేలు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూ.5లక్షలు ఇవ్వాలని, రేషన్‌కార్డును తొలగించకుండా సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.

బారికేడ్లను, బలగాలను అధిగమించి..

చిత్తూరుకు బయలుదేరిన కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించినా... బారికేడ్లను, పోలీసు బలగాలను తప్పించుకొని కొందరు కలెక్టరేట్‌ ఎదుట నినదించారు. అనంతరం కలెక్టర్‌ హరినారాయణన్‌కు వినతిపత్రం అందించి తిరిగి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని.. పోలీసుస్టేషన్‌కు తరలించారు. కడప కలెక్టరేట్‌ వద్ద నిరసనలో అంగన్‌వాడీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కర్నూలులో మహిళలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకురాకుండా భారీగా మహిళా పోలీసులను మోహరించినా కొందరు గేటు ఎక్కి కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అనంతపురంలో భారీ ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.


సాధారణ దుస్తుల్లో వచ్చి... పోలీసులను ఏమార్చి

కృష్ణా జిల్లాలో ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వందలాది మంది అంగన్‌వాడీలు మచిలీపట్నం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. పోలీసులను ఏమార్చడానికి వారంతా సాధారణ దుస్తుల్లో వచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ నిరసనల్లో పాల్గొన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌లు సైతం నిరసనలతో మారుమోగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దాంతో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ఆధ్వర్యంలో వారంతా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రోడ్డుపై బైఠాయించారు.

వాహనాల నుంచి దింపేసినా తెగువ చూపి...

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచే పలువుర్ని గృహ నిర్బంధంలో ఉంచారు. కవిటి, ఇచ్ఛాపురం, మందస, నందిగం, టెక్కలి, పాలకొండ తదితర మండలాల నుంచి ప్రైవేటు వాహనాలు, బస్సుల్లో వస్తున్న కార్యకర్తలను పోలీసులు కిందికి దింపేశారు. అయినా... వివిధ మార్గాల్లో కలెక్టరేట్కు చేరుకుని ధర్నా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం నుంచే ఆంక్షలు కొనసాగించిన పోలీసులు సోమవారం ఉదయం ధర్నాకు అనుమతిచ్చారు. కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అయిదు వరుసల్లో బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. మండుటెండలో మూడుగంటలకు పైగా కార్యకర్తలు, ఆయాలు అక్కడే బైఠాయించారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మద్దతు పలికారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి పాల్గొన్నారు. విజయనగరంలో చలో కలెక్టరేట్‌ అడుగడుగునా నిర్బంధాల నడుమ సాగింది. పోలీసులు గృహ నిర్బంధాలు చేసినా... అధిక సంఖ్యలో కార్యకర్తలు, సహాయకులు విజయనగరంలోని సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా తరలివచ్చారు. ఆంధ్రా-ఒడిశా జాతీయ రహదారిపై గంటపాటు బైఠాయించారు. ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట మానవహారం చేపట్టారు.


హతవిధీ... కాపలా విధి!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చేపట్టిన ధర్నాకు వెళ్లనీయకుండా అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈమేరకు తుని మండల అంగన్‌వాడీల సంఘం నాయకురాలు ధనలక్ష్మిని ఆదివారం నుంచి గృహ నిర్బంధం చేశారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆమె ఇంటి ఆవరణలో దోమతెరలు ఏర్పాటు చేసుకుని మరీ నిద్రించి, ధనలక్ష్మి బయటికి వెళ్లకుండా ఇలా సోమవారం ఉదయం వరకు కాపలా కాశారు.        

- న్యూస్‌టుడే, తుని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని