AP news: ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో కలకలం

అది బాగా పేరొందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి... గురువారం దాని సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో.. ప్రశాంతంగా ఉండే ఆ ఆసుపత్రి ప్రాంగణంలోకి ఒక్కసారిగా పదుల సంఖ్యలో పోలీసులు ప్రవేశించి, కార్యాలయంలో సోదాలు చేసి..

Updated : 24 Jun 2021 10:01 IST

నలుగురు ఉద్యోగుల అరెస్టు
సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకే...
డైరెక్టర్‌ డాక్టర్‌ బుచ్చయ్య ఆరోపణ

ఈనాడు- అమరావతి, మంగళగిరి-న్యూస్‌టుడే: అది బాగా పేరొందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి... గురువారం దాని సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో.. ప్రశాంతంగా ఉండే ఆ ఆసుపత్రి ప్రాంగణంలోకి ఒక్కసారిగా పదుల సంఖ్యలో పోలీసులు ప్రవేశించి, కార్యాలయంలో సోదాలు చేసి.. పలువురు ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకోవటంతో కలకలం రేగింది. తనిఖీలు ఎందుకో, అదుపులోకి ఎందుకు తీసుకుంటున్నారో కూడా చెప్పకపోవడంతో అక్కడున్న అందరిలోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకాని వద్ద ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి (ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌)లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న నలుగుర్ని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆసుపత్రిని అమ్మేయాలంటూ భయభ్రాంతులకు గురిచేసేందుకే సిబ్బందిని అదుపులోకి తీసుకోవటం, సోదాలు, రికార్డుల స్వాధీనం వంటివి చేసుకున్నారని, గురువారం సర్వసభ్య సమావేశం నేపథ్యంలో డైరెక్టర్లను భయపెట్టేందుకే.. బుధవారం ఈ చర్యలు చేపట్టారని ఆ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ బుచ్చయ్య మీడియాకు వెల్లడించటంతో తాజా ఘటన చర్చనీయాంశమైంది. ‘అమ్మకానికి అంగీకరిస్తూ సంతకం పెడతారా? చస్తారా? అని బెదిరించి సంతకాలు చేసి వెళ్లిపోమంటే మాకు తప్పదు కదా!’ అంటూ ఆయన వ్యాఖ్యానించటం సంచలనమైంది.

స్పష్టతివ్వని పోలీసులు...
ఈ అకాడమీ నిధుల్ని కొందరు పక్కదారి పట్టించారని, వారి వ్యక్తిగత అవసరాల కోసం వాటిని వినియోగించారన్న ఫిర్యాదుపై ఈ ఏడాది మార్చి 3న మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలోనే నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతుండగా... కొవిడ్‌ రోగుల నుంచి అధిక రుసుములు వసూలు చేశారనే ఫిర్యాదులపై విచారణలో భాగంగా వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కానీ దీనిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన ఏమీ లేదు. స్పష్టత కోసం ఉన్నతాధికారుల్ని సంప్రదించేందుకు ప్రయత్నించినా వారెవరూ అందుబాటులోకి రాలేదు. ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి క్యాషియర్‌ నాగేశ్వరరావు, అకౌంటెంట్‌ శ్రీనివాసరాజు, చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ ఆఫీసర్‌ చికాగో శ్రీనివాస్‌, వల్లూరుపల్లి నళీనిమోహన్‌లను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని డీఎస్పీ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో విచారించారు. ఆకాడమీలో పనిచేస్తున్న యుగంధర్‌, కామేశ్వరరావు అనే ఉద్యోగుల్ని పోలీసుస్టేషన్‌కు తరలించినా.. వారిని విచారించలేదు. అదుపులో ఉన్నవారందరి నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు.

గతంలో నమోదైన కేసు ఇది
ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, కోశాధికారి డాక్టర్‌ అక్కినేని మణి, సీసీవో ఉప్పలాపు శ్రీనివాసరావు, సీఎఫ్‌వో వల్లూరిపల్లి నళినీమోహన్‌ నేరచర్యల్లో భాగస్వాములయ్యారని.. సొసైటీ నిధులను వారి వ్యక్తిగత అవసరాల కోసం దారి మళ్లించారని, తద్వారా రూ.5.28 కోట్ల మేర నష్టం వాటిల్లిదంటూ ఆ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ కొండ్రగుంట బుచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి నలుగురిపై ఈ ఏడాది మార్చి 3న ఐపీసీ 420, 406, 120బీ రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 89/2016 నమోదైంది.

భయభ్రాంతులకు గురిచేసేందుకే: డా. బుచ్చయ్య


ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి విక్రయానికి సంస్థ సభ్యుల్లోని కొందరు చేస్తున్న ప్రయత్నాన్ని తనతో సహా మెజార్టీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని, అందుకే తమను భయపెట్టేందుకు కొందరు సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి డైరెక్టర్లలో ఒకరైన డాక్టర్‌ బుచ్చయ్య ఆరోపించారు. గురువారం సర్వసభ్య సమావేశం ఉందని, తమను భయపెట్టి.. దాన్ని అడ్డుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారని ధ్వజమెత్తారు. ‘మా సంస్థలో 30 మంది సభ్యులున్నారు. వారిలో 20 మంది ఆస్పత్రి విక్రయ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేశారు’ అని ఆయన బుధవారం మంగళగిరి పోలీసుస్టేషన్‌ వద్ద విలేకర్లతో వ్యాఖ్యానించారు. ‘మెజార్టీ సభ్యులం ఆసుపత్రి అమ్మకానికి సుముఖంగా లేం. కానీ విక్రయానికి ఆమోదం తెలుపుతారా? లేదా? అని బెదిరిస్తే ఏం చేస్తాం? సంతకాలు చేసి వెళ్లిపోమంటే అలాగే వెళ్లిపోతాం. తప్పదు కదా...! ఈరోజు యుద్ధం చేసే పరిస్థితి లేదు. ప్రజలే ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోవాలి’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఆసుపత్రిని రూ.650 కోట్లకు అమ్మేశారట కదా..! అమ్మేస్తున్నారట కదా..! అంటూ నాకు రోజూ చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. అప్పారావు ఆసుపత్రిని అమ్మేశారని.. సంతకాలు కూడా అయిపోయాయని.. టేకోవర్‌ చేయడానికి కొత్త యాజమాన్యం వచ్చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అది అసాధ్యం. మెజార్టీ సభ్యులు దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మాకు తెలియకుండా, మా ఆమోదం లేకుండా ఎలా అమ్మేస్తారు? పదిమంది సభ్యులు అమ్మేస్తామంటే అయిపోతుందా? అందుకే ఇప్పుడు వారు కొత్త ఎత్తుగడ వేశారు. సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు’ అన్నారు. ‘రూ.650 కోట్లకు ఆసుపత్రిని కొనేందుకు ఓ వ్యక్తి సిద్ధపడుతున్నారంటే అతను ఎలాంటి సేవలందిస్తారో అర్థం చేసుకోవాలి. డబ్బుల కోసం మేము ఈ ఆసుపత్రిని పెట్టలేదు. డబ్బులే కావాలనుకుంటే 2003లో మేము స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెడితే.. అందుకు 30 రెట్లు అధికంగా డబ్బు వచ్చేది. మేము ఆసుపత్రిని అమ్మదలుచుకోలేదు. మాకెవరికీ డబ్బు ఇబ్బంది లేదు. భయపెట్టి.. అరెస్టులు చేస్తామనే పరిస్థితి దారుణం. ఇది అన్యాయం. ఆసుపత్రిని కొంటామని మా బృందంలోని 20 మంది సభ్యుల్ని ఎవరూ సంప్రదించలేదు. రేపు సర్వసభ్య సమావేశం వర్చువల్‌గా ఉంది. దాన్ని ఎవరూ ఆపలేరు’ అని ఆయన స్పష్టంచేశారు. ‘ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి నిధుల్ని కొందరు వారి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారని మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే. అయితే నాకు అందిన సమాచారం సరికాదని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఫిర్యాదును ఉపసంహరించుకుంటానని పోలీసుల్ని కోరాను. తమపై ఒత్తిళ్లు ఉన్నాయని.. ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలని వారు చెప్పారు’ అని ఆయన పేర్కొన్నారు. ‘నేను పెట్టిన కేసు విషయంలో ఎవరినైనా అరెస్టు చేయాలంటే నెలరోజుల ముందే నోటీసు ఇవ్వాలని న్యాయస్థానం పోలీసులకు చెప్పింది. అయినా వారు పట్టించుకోలేదు’ అని డాక్టర్‌ బుచ్చయ్య వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని