Assembly Elections 2022: కమల దుందుభి

కమలదళం మళ్లీ అదరగొట్టింది. సమకాలీన రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని ఘనంగా చాటుకుంటూ విజయ గర్జన చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4-1 తేడాతో ప్రత్యర్థి పార్టీలను మట్టికరిపించింది! అత్యంత కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌,

Updated : 11 Mar 2022 05:26 IST

ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌లలో భాజపా విజయ గర్జన
గోవాలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ
4 రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకున్న కమలనాథులు
పంజాబ్‌ను ఊడ్చేసిన ఆప్‌
యూపీ సీఎం పీఠంపై మళ్లీ యోగి
గతం కంటే సీట్లు పెరిగినా.. చతికిలపడిన సమాజ్‌వాదీ పార్టీ
కాంగ్రెస్‌, బీఎస్పీలకు ఘోర పరాభవం
పంజాబ్‌లో కొలువుదీరనున్న భగవంత్‌మాన్‌ సర్కారు
కాంగ్రెస్‌కు షాకిస్తూ 92 స్థానాల్లో ఆప్‌ గెలుపు
ఈనాడు - దిల్లీ

మలదళం మళ్లీ అదరగొట్టింది. సమకాలీన రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని ఘనంగా చాటుకుంటూ విజయ గర్జన చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4-1 తేడాతో ప్రత్యర్థి పార్టీలను మట్టికరిపించింది! అత్యంత కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవాల్లో అధికార పీఠాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యంగా యూపీలో మునుపటిలా ‘అయోధ్య’ రాగం ఆలపించకున్నా అవలీలగా మెజార్టీ మార్కును దాటేసి.. మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక సమరానికి తనదైన శైలిలో సమరశంఖం పూరించింది. వివాదాస్పద సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం ప్రభావంగానీ, కొవిడ్‌ రెండో ఉద్ధృతి సృష్టించిన విధ్వంసకాండ తాలూకు చేదు జ్ఞాపకాలుగానీ కాషాయ పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేసినట్లు ఏమాత్రం కనిపించలేదు. గురువారం అర్ధరాత్రి 1.30 గంటల సమయానికి యూపీలో భాజపా 254 స్థానాల్లో విజయం సాధించింది. మరో చోట ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు- పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఊడ్చేసింది! అంతర్గత కలహాలతో బలహీనపడ్డ హస్తం పార్టీకి షాకిస్తూ కేజ్రీవాల్‌ పార్టీ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్తరాఖండ్‌లో ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారే సంప్రదాయానికి తెరదించుతూ.. భాజపా అధికార పీఠాన్ని నిలబెట్టుకుంది. ఈశాన్యాన మణిపుర్‌లో ఈసారి సొంతంగానే మెజార్టీ మార్కును దాటింది. గోవాలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి.. హ్యాట్రిక్‌ ప్రభుత్వ స్థాపనకు సిద్ధమైంది. ఫిబ్రవరి 10 నుంచి ఈ నెల 7వరకు వివిధ విడతల్లో జరిగిన ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి.

యూపీ: యోగి సర్కారుకే పట్టం

సాగు చట్టాలు బాగా దెబ్బతీశాయ్‌..
యూపీలో ఇక భాజపా పనైపోయినట్టే!
‘గో రక్షణ’ బెడిసికొడుతోంది..
కమలనాథులు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే!
బ్రాహ్మణులు ఆగ్రహంగా ఉన్నారు..
యోగి మళ్లీ మఠానికి వెళ్లిపోవాల్సిందే!

దేశంలోకెల్లా అత్యధిక లోక్‌సభ స్థానాలు, అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రం- ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు జోరుగా వినిపించిన మాటలివి. వాటన్నింటినీ తిప్పికొడుతూ యూపీ ఓటర్లు మరోసారి భాజపాకే పట్టం కట్టారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని సర్కారుకు బ్రహ్మరథం పట్టారు. వరుసగా రెండోసారి ఆ పార్టీకి పాలనా పగ్గాలు అప్పగించారు. గత మూడు దశాబ్దాల కాలంలో యూపీలో అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి పార్టీగా భాజపా రికార్డు సృష్టించింది. తాజా ఎన్నికల్లో భాజపా మిత్రపక్షాలైన అప్నాదళ్‌-ఎస్‌ 12, నిషాద్‌ పార్టీ 6 శాసనసభ నియోజకవర్గాల్లో విజయపతాకాన్ని ఎగరేశాయి. ఐదేళ్ల కిందటితో (312) పోలిస్తే ప్రస్తుతం కమలదళం స్థానాల సంఖ్య తగ్గినప్పటికీ.. ఓట్ల శాతం పెరగడం విశేషం.

అఖిలేశ్‌ ఆశలు గల్లంతు

యూపీలో ఈ దఫా భాజపా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య హోరాహోరీ ఉంటుందని విశ్లేషకులు భావించారు. తాజా ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠమెక్కాలన్న కసితో.. ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా సాగిన అఖిలేశ్‌.. సామాజిక సమీకరణాలను విశ్లేషించుకొని రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ), సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) తదితర చిన్న పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటుచేశారు. అయితే- ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ‘మహరాజ్‌ జీ’గా పేరొందిన సీఎం యోగి వంటి అతిరథ మహారథుల వ్యూహచతురత ముందు ఆయన ఎత్తులు పారలేదు. గత ఎన్నికల్లో 47 స్థానాలే సాధించిన ఎస్పీ.. 110  సీట్లు గెల్చుకొని, మరో నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార పీఠానికి ఆ పార్టీ చాలా దూరంలో నిలిచిపోయింది. మరోవైపు- ఐదేళ్ల కిందటి కంటే మరింత దారుణంగా కాంగ్రెస్‌ 2, మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఒకే ఒక్క సీటుకు పరిమితమవడం.. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల దుస్థితికి అద్దం పడుతోంది. ఆర్‌ఎల్‌డీ అభ్యర్థులు 8 చోట్ల గెలిచారు.

పంజాబ్‌: ఆప్‌ భళా

దిల్లీని దాటి దేశమంతటా విస్తరించాలని వ్యూహాలు రచిస్తున్న కేజ్రీవాల్‌ పార్టీకి పంజాబ్‌లో అపురూప విజయం దక్కింది. రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలుండగా ఆప్‌ ఏకంగా 92 సీట్లు గెల్చుకుంది. అధికార కాంగ్రెస్‌ సహా శిరోమణి అకాలీదళ్‌, భాజపా తదితర పార్టీలను నామమాత్రంగా మార్చేసింది. కాంగ్రెస్‌ కేవలం 18 స్థానాలతో సరిపెట్టుకుంది. పంజాబ్‌ కూడా తన చేతుల్లో నుంచి జారిపోవడం కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ. ప్రస్తుతం దేశంలో హస్తం పార్టీ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు- రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ మాత్రమే. కాంగ్రెస్‌ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యల్పం. ప్రధానంగా అంతర్గత కలహాలు పంజాబ్‌లో పార్టీ కొంపముంచాయి. మాజీ క్రికెటర్‌, సీనియర్‌ నేత సిద్ధూతో విభేదాల నేపథ్యంలో గత ఏడాది కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సీఎం పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకోవడం, అనంతరం ముఖ్యమంత్రి పీఠమెక్కిన చన్నీతోనూ సిద్ధూకు విభేదాలు తలెత్తడం వంటి పరిణామాలు పార్టీ పాలిట శాపంగా మారాయి. ఇక గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన అకాలీదళ్‌కు.. ఈ దఫా మరింత నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. బీఎస్పీతో జట్టు కట్టి బరిలో దిగిన ఆ పార్టీ 3 స్థానాలకు పరిమితమైంది. అమరీందర్‌ పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల గోదాలో దిగిన భాజపా.. 2 నియోజకవర్గాల్లో గెలిచింది. రాష్ట్రంలో ఆప్‌ ధాటికి.. సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ తాను పోటీ చేసిన రెండు రెండు స్థానాల్లోనూ పరాజయం పాలయ్యారు. పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ, అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌, ఆయన తండ్రి-మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, అమరీందర్‌ సింగ్‌ కూడా ఓటమి చవిచూశారు.


ఉత్తరాఖండ్‌: కమలం ఖాతాలోకే..

దేవభూమి ఉత్తరాఖండ్‌లో ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారే సంప్రదాయానికి ఎట్టకేలకు తెరపడింది. అభివృద్ధి నినాదంతో బరిలో దిగిన భాజపా 47 సీట్లు గెల్చుకుంది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. కాంగ్రెస్‌ 19 స్థానాల్లో గెలిచింది.   మరోవైపు- రాష్ట్ర చరిత్రలో సిట్టింగ్‌ సీఎంలెవరూ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించని సంప్రదాయం మాత్రం యథాతథంగా కొనసాగింది. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ ఖటీమా స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు.


మణిపుర్‌: భాజపాకు సొంతంగా అధికారం

కొన్నేళ్లుగా ఈశాన్య భారత్‌పై పట్టు పెంచుకుంటున్న కమలదళానికి.. మణిపుర్‌లో మధురమైన విజయం దక్కింది. ఐదేళ్లుగా రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆ పార్టీ.. ఈ దఫా సొంతంగా మెజార్టీ మార్కును దాటింది. 32 సీట్లను ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌కు ఇక్కడా నిరాశే ఎదురైంది. ఆ పార్టీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) 7, జనతాదళ్‌ యునైటెడ్‌ 6, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 5 నియోజకవర్గాల్లో విజయం సాధించాయి.


గోవా: సరిగ్గా సగం

గోవాలో ఇన్నాళ్లూ మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్న భాజపా.. తాజా ఎన్నికల్లో ఇతర పార్టీలపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో 20 సీట్లు గెల్చుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కమలదళానికి గట్టి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్‌ 11 స్థానాలకు పరిమితమైంది. ఇక్కడ ఆప్‌ 2 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ) 2 సీట్లలో, గోవా ఫార్వర్డ్‌ పార్టీ ఓ చోట గెలుపొందాయి. ఎంజీపీతోపాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల నుంచి భాజపాకు ఇప్పటికే మద్దతు లేఖలు అందాయి.


మోదీ పథకాలపై విశ్వాసంతోనే యూపీలో విజయం

పేదలు, రైతుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు గల విశ్వాసమే యూపీలో పార్టీ ఘనవిజయానికి కారణం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో భయం లేని అవినీతి రహిత సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు. భాజపాపై విశ్వాసం ఉంచిన ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవా ప్రజలకు కృతజ్ఞతలు.

-అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి


ప్రధానికి కృతజ్ఞతలు

భాజపాకు అనుకూలంగా ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయి. మోదీ ప్రతిభతోనే ఇది సాధ్యమైంది. ఆయన పథకాలు, విధానాలకు ప్రజల నుంచి లభించిన ఆమోదానికి నిదర్శనం. కోట్లాది మంది పార్టీ కార్యకర్తల తరఫున ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.  

-జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు


ప్రజా ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉంటాం

యిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ఈ ఫలితాల నుంచి మేం నేర్చుకోవాల్సింది ఉంది. దేశ ప్రజల ప్రయోజనాల కోసం మేం కృషి చేస్తూనే ఉంటాం. విజేతలందరికీ శుభాకాంక్షలు. పార్టీ కోసం శ్రమించిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు నా కృతజ్ఞతలు.

- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు


పోరాడే ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం

యూపీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంతో కష్టపడ్డారు. దాన్ని ఓట్ల రూపంలోకి మలచడంలో విఫలమయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడే ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది.

ప్రియాంకా గాంధీ , కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి


పార్టీ అంచనాలకు భిన్నం

న్నికల ఫలితాలు పార్టీ అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. ప్రజాతీర్పును అంగీకరిస్తున్నాం. ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ పార్టీ ధైర్యాన్ని కోల్పోదు.  

- రణ్‌దీప్‌ సూర్జేవాలా, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి


కాంగ్రెస్‌లో సంస్కరణలకు తరుణమిదే

పార్టీ సంస్థాగత నాయకత్వంలో సంస్కరణలు తీసుకురావలసిన సమయమిదే. అవి దేశ ఆలోచనలు, ప్రజల్లోనూ స్ఫూర్తిని కలిగించేలా ఉండాలి. విజయం కావాలంటే మార్పు అనివార్యం అనేది సుస్పష్టం.

-శశిథరూర్‌, కాంగ్రెస్‌ ఎంపీ


దిల్లీలో పనితీరు ఆప్‌కు కలిసొచ్చింది

పంజాబ్‌లో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను నిర్ఘాంతపరిచేవే. అక్కడ ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయానికి దిల్లీలో ఆ పార్టీ ప్రభుత్వ పనితీరు దోహదపడింది. భాజపాకు తగిన ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు కనీస ఉమ్మడి కార్యక్రమం కింద ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచే ప్రయత్నాలు ప్రారంభించాలి.

-శరద్‌ పవార్‌, ఎన్‌సీపీ అధ్యక్షుడు


ప్రజల తీర్పును శిరసావహిస్తున్నా

త్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని శ్రమించాను. కానీ మా పార్టీ గెలుపొందలేదు. ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాను.

- అఖిలేశ్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత


పంజాబ్‌లో భాజపా ఏం సాధించింది?

టమిని జీర్ణించుకోవడం సులువే..అయితే విజయాన్ని అరిగించుకోవడాన్ని భాజపా నేర్చుకోవాలి. కొంత మందికే అది సాధ్యం. మోదీ, అమిత్‌షా ద్వయంతో పంజాబ్‌లో కమలదళం ఏం సాధించింది?

- సంజయ్‌ రౌత్‌, శివసేన అధికార ప్రతినిధి


మత ఏకీకరణతోనే యూపీలో భాజపా విజయం

త్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఘనవిజయానికి అక్కడ జరిగిన మత ఏకీకరణ, కొన్ని మీడియా సంస్థల నియంత్రణ, ధన బలం కారణాలు. పంజాబ్‌లో ఆప్‌ అఖండ విజయం.. కాంగ్రెస్‌, అకాలీదళ్‌ వంటి సంప్రదాయ పార్టీలను ప్రజలు తిరస్కరించడమే. భాజపాను ఎదుర్కొనేందుకు ప్రజాస్వామ్య పార్టీలు తమ శక్తియుక్తులను ద్విగుణీకృతం చేసుకోవాలి.

   - సీపీఎం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు