Badwel election: మెజారిటీ 90,533

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి పనతల సురేష్‌పై ఆమె 90,533 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా తరఫున వైఎస్‌ జగన్‌ సాధించిన ఆధిక్యాన్ని ఆమె అధిగమించడం విశేషం. ప్రత్యర్థులెవరికీ డిపాజిట్‌ కూడా దక్కలేదు. పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 1,47,163 ఓట్లు పోలయ్యాయి.

Updated : 03 Nov 2021 11:28 IST

బద్వేలులో వైకాపా ఘనవిజయం

ప్రత్యర్థులెవరికీ దక్కని డిపాజిట్లు

విజయం అనంతరం ధ్రువీకరణ పత్రంతో వైకాపా అభ్యర్థి దాసరి సుధ

ఈనాడు డిజిటల్‌, కడప: కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి పనతల సురేష్‌పై ఆమె 90,533 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా తరఫున వైఎస్‌ జగన్‌ సాధించిన ఆధిక్యాన్ని ఆమె అధిగమించడం విశేషం. ప్రత్యర్థులెవరికీ డిపాజిట్‌ కూడా దక్కలేదు. పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 1,47,163 ఓట్లు పోలయ్యాయి. వైకాపా అభ్యర్థి సుధకు 1,12,211, భాజపా అభ్యర్థి సురేష్‌కు 21,678, కాంగ్రెస్‌ అభ్యర్థి పీఎం కమలమ్మకు 6235, నోటాకు 3650 ఓట్లు వచ్చాయి. మిగిలిన చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బద్వేలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ వైకాపా అభ్యర్థిగా ఆయన భార్య సుధను ప్రకటించడంతో సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పోటీనుంచి తప్పుకొన్నాయి. ఫలితంగా ఇక్కడ వైకాపా, భాజపా, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖపోరు జరిగింది. ఈ ఎన్నికలో లక్ష ఓట్ల ఆధిక్యాన్ని సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకులకు లక్ష్యం నిర్దేశించారు. 90 వేలపైచిలుకు మెజార్టీని సాధించారు. గతంలో కంటే పోలింగ్‌ శాతం తక్కువగా నమోదుకావడమే ఇందుకు కారణమని మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వ్యాఖ్యానించారు.

బలం పెంచుకున్నా.. దక్కని డిపాజిట్‌

గతంతో పోలిస్తే బద్వేలులో భాజపా తన బలాన్ని పెంచుకుంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ భాజపా కేవలం 735 ఓట్లు (0.47%) సాధించింది. ఉపఎన్నికలోనూ భాజపా అభ్యర్థి సురేష్‌కు డిపాజిట్‌ దక్కలేదు. డిపాజిట్‌ సొమ్మును తిరిగి పొందేందుకు పోలైన ఓట్లలో 16.7% సాధించాల్సి ఉండగా.. 14.73% పొందారు. తెదేపా సానుభూతిపరుల ఓట్లు చాలావరకు భాజపాకు వచ్చాయి. జిల్లాలో తెదేపా గెలిచిన గోపవరం జడ్పీటీసీ పరిధిలో మొత్తం 9,918 ఓట్లు పోలవగా భాజపాకు 1,804 ఓట్లు వచ్చాయి. ఇటీవల పోరుమామిళ్ల మేజర్‌ పంచాయతీ సర్పంచి స్థానాన్ని తెదేపా కైవసం చేసుకోగా... ఆ మండలం పరిధిలో భాజపాకు 4,342 ఓట్లు వచ్చాయి. తెదేపాకు పట్టున్న బద్వేలు మండలం పుట్టాయపల్లెలోని 186 పోలింగ్‌ కేంద్రంలో వైకాపా, భాజపాలకు చెరో 290 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో నైతికవిజయం తమదేనని భాజపా అభ్యర్థి సురేష్‌ అన్నారు. భారీస్థాయిలో దొంగ ఓట్ల వల్లే వైకాపా గెలిచిందని ఆయన ఆరోపించారు.

మూడోస్థానానికి పరిమితమైన కాంగ్రెస్‌

2019లో బద్వేలు అసెంబ్లీ ఎన్నికలో భాజపా కంటే ఎక్కువ ఓట్లు సాధించిన కాంగ్రెస్‌.. తాజా ఉపఎన్నికలో మూడోస్థానానికి పరిమితమైంది. అయితే గత ఎన్నికల కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. అప్పుడు 1.49% ఓట్లు సాధించగా.. ఈసారి 4.23%కు పెరిగింది. తెదేపా పోటీలో లేకపోవడం కొంతమేర కాంగ్రెస్‌కూ కలిసొచ్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థి కమలమ్మ సొంతూరు పోరుమామిళ్ల మండలం గిరినగర్‌లోని 77ఏ పోలింగ్‌ కేంద్రంలో వైకాపాకు 288, కాంగ్రెస్‌కు 46, భాజపాకు 29, నోటాకు 6 ఓట్లు వచ్చాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని