సీఎం జగన్‌కు నోటీసులు

అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం సీబీఐ ప్రధాన కోర్టు నోటీసులు జారీ చేసింది.

Updated : 29 Apr 2021 09:06 IST

బెయిలు రద్దుపై పిటిషన్‌ కేసులో జారీ చేసిన సీబీఐ కోర్టు
విచారణ మే 7కు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం సీబీఐ ప్రధాన కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్‌ బెయిలును రద్దు చేయాలని కోరుతూ వైౖకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై వచ్చిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ, ఇది విచారణార్హమేనంటూ మంగళవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో జగన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో హెటిరో, అరబిందోలకు భూకేటాయింపులపై సీబీఐ పెట్టిన కేసులో జగన్‌ బెయిలును రద్దు చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌కు సీబీఐ కోర్టు కార్యాలయం నంబరు కేటాయించింది. బెయిలు రద్దు కోరుతూ మూడో వ్యక్తి అయినా పిటిషన్‌ వేయవచ్చంటూ సుప్రీంకోర్టు రాతినాం కేసులో ఇచ్చిన ఆదేశాల మేరకు రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. దీనిపై జగన్‌ తరఫు న్యాయవాదులు కౌంటరు దాఖలు చేయడం కోసం గడువు కోరడానికి, లేదంటే ఈలోగానే పిటిషన్‌ విచారణార్హతపై సీబీఐ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయడానికీ అవకాశాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని