Chandrababu: నేటి నుంచి చంద్రబాబు 36 గంటల దీక్ష

తెదేపా కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై వైకాపా నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా తెదేపా అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేపడుతున్నారు. గురువారం ఉదయం 8

Updated : 21 Oct 2021 07:37 IST

ఈనాడు, అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై వైకాపా నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా తెదేపా అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేపడుతున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష కొనసాగిస్తారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై చేస్తున్న ఈ పోరాటానికి రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలసి రావాలని
తెదేపా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. ఫ్యాక్షనిజానికి అధికారం తోడైంది. దానిలో పోలీసులు అంతర్భాగమయ్యారు. ప్రజాస్వామ్యం నశించింది. ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద, మూక దాడులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెరతీశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై మూక దాడి చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. పార్టీ కేంద్ర కార్యాలయంలోని నాయకులు, సిబ్బందిపై అల్లరి మూకలు భౌతికదాడులకు పాల్పడ్డారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు కుట్రతో పార్టీ కార్యాలయాలు, తెదేపా నేతల ఇళ్లపై దాడి చేశారు. కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికిపోయేలా దాడులకు తెగబడ్డారు. ముఖ్యమంత్రి, డీజీపీ ప్రోద్బలంతోనే విధ్వంసానికి పాల్పడ్డారు’’ అని పేర్కొంది. చంద్రబాబుతో పాటు పార్టీ ముఖ్య నేతలు దీక్షలో పాల్గొంటారు. చంద్రబాబు దీక్ష కోసం తెస్తున్న టెంట్‌లు, ఇతర సామగ్రిని బుధవారం సాయంత్రం పోలీసులు చాలాసేపు అడ్డుకున్నారు. సామగ్రి తెస్తున్న వాహనాల్ని రాత్రి 8 గంటల తర్వాతే విడిచిపెట్టారు.

దీక్షలో పెద్ద ఎత్తున తెదేపా నాయకులు, కేడర్‌ పాల్గొనే అవకాశం ఉన్నందున కరోనా మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తూ తెదేపా కార్యాలయ వర్గాలకు మంగళగిరి డీఎస్పీ బుధవారం పోలీసులు నోటీసు ఇచ్చారు.

అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోరిన చంద్రబాబు: పార్టీ కార్యాలయంపై దాడి అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు, ఆయనను స్వయంగా కలసి పరిస్థితిని వివరించాలని నిర్ణయించారు. అమిత్‌షాను కలిసేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ కోరినట్టు తెలిసింది. తెదేపా నాయకుల బృందం గురువారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి...ఫిర్యాదు చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని