Dera Baba: డేరా బాబాకు యావజ్జీవం

డేరా బాబాగా సుపరిచితుడైన వివాదాస్పదుడు, డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు, మరో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ చండీగఢ్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పునిచ్చింది. 2002లో హత్యకు

Updated : 19 Oct 2021 09:59 IST

చండీగఢ్‌: డేరా బాబాగా సుపరిచితుడైన వివాదాస్పదుడు, డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు, మరో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ చండీగఢ్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పునిచ్చింది. 2002లో హత్యకు గురైన డేరా మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ కేసులో వీరందరికీ శిక్షలు పడ్డాయి. డేరా బాబా రూ.31 లక్షల జరిమానా కూడా చెల్లించాలని, దానిలో సగం మొత్తాన్ని హతుడి కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మిగతా నిందితులకు రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది. వారిలో ఒకరు ఇప్పటికే మరణించారు.  ప్రధాన కార్యాలయంలో మహిళలను డేరా బాబా లైంగికంగా ఎలా దోచుకుంటున్నదీ వివరిస్తూ పేరు వెల్లడించకుండా లేఖను ప్రచారంలోకి తీసుకువచ్చారనే అనుమానం రంజిత్‌సింగ్‌పై ఉండేది. 2002లో ఆయన హత్యకు గురయ్యారు. దీనికి కుట్రదారుడు డేరా బాబాయేనని అభియోగపత్రంలో సీబీఐ పేర్కొంది. నిందితులందరికీ మరణ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమ కుటుంబానికి న్యాయం జరిగిందని తీర్పుపై రంజిత్‌ సింగ్‌ తనయుడు జగ్‌సీర్‌సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడినందుకు డేరా బాబాకు 2017లో 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. శిక్షను వ్యతిరేకిస్తూ చెలరేగిన హింసాకాండలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక పాత్రికేయుడి హత్య కేసులో డేరా బాబాకు 2019లో యావజ్జీవ శిక్ష పడింది. ప్రస్తుతం రోహ్‌తక్‌లోని సునారియా కారాగారంలో ఆ శిక్షలు అనుభవిస్తున్నాడు. తాజా తీర్పు వెలువడే ముందు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పలు ప్రాంతాల్లో చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని