Digital library: ఉగాదికల్లా డిజిటల్‌ లైబ్రరీలు

గ్రామాల్లో తొలి దశలో నిర్మిస్తున్న డిజిటల్‌ లైబ్రరీలను ఉగాదినాటికి అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2022 డిసెంబరు నాటికి రెండో దశ, 2023 జూన్‌ నాటికి మూడో దశ నిర్మాణాలు

Updated : 30 Oct 2021 06:31 IST

అధికారులకు సీఎం ఆదేశం

ఈనాడు, అమరావతి: గ్రామాల్లో తొలి దశలో నిర్మిస్తున్న డిజిటల్‌ లైబ్రరీలను ఉగాదినాటికి అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2022 డిసెంబరు నాటికి రెండో దశ, 2023 జూన్‌ నాటికి మూడో దశ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని 12,979 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌ గ్రామీణ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా, తొలి దశలో 4,530 గ్రామాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటి పురోగతిని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. వచ్చే జనవరి నాటికి తొలి దశ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెప్పగా...

వాటిలో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి ఉగాది నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. ప్రతి డిజిటల్‌ లైబ్రరీలో డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, సిస్టమ్‌ చైర్లు, ప్లాస్టిక్‌ కుర్చీలు, ఫ్యాన్‌లు, ట్యూబ్‌లైట్‌లు, ఐరన్‌ ర్యాక్‌లు, పుస్తకాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి గ్రామీణ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్‌విడ్త్‌తో కూడిన ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని కోరారు.

గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలి

‘గ్రామీణ డిజిటల్‌ లైబ్రరీల్లో తాజా సాంకేతికతను అందుబాటులో ఉంచాలి. వాటి నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అవి ఉపయోగపడాలి. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలి’ అని సీఎం ఆదేశించారు. డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంలో వెనుకబడ్డ అనంతపురం, చిత్తూరు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని