Election commission: బద్వేలు పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి శనివారం జరగనున్న ఉపఎన్నికకు సంబంధించి అన్ని పోలింగ్‌స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌

Updated : 30 Oct 2021 06:37 IST

  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ వెల్లడి

  నేటి పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఉపఎన్నికల నిర్వహణ కోసం శుక్రవారం కడప జిల్లా బద్వేలులో ఎన్నికల సామగ్రితో వరుసకట్టిన సిబ్బంది

ఈనాడు, అమరావతి, కడప: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి శనివారం జరగనున్న ఉపఎన్నికకు సంబంధించి అన్ని పోలింగ్‌స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ తెలిపారు. సచివాలయంలో శుక్రవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. శనివారం జరిగే పోలింగ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రం వద్ద పది మంది చొప్పున పోలీసులను నియమిస్తున్నామన్నారు. కేంద్ర బలగాలతో కలిపి 2,622 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. ఉపఎన్నికల సందర్భంగా సరిహద్దులు, ఇతర చోట్ల ఆకస్మికంగా చేసిన తనిఖీల ద్వారా రూ.2.10 కోట్ల బంగారం, డబ్బు, గంజాయి, మద్యం తదితరాలను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. 218 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు తెలిపారు. రాజుపాలెంకు చెందిన ఓ పార్టీ నాయకుడు కిడ్నాప్‌ అయ్యారని తమకు ఫిర్యాదు వచ్చిందని, దీనిపై పోలీసుల విచారణలో తననెవరూ అపహరించలేదని ఆయన చెప్పారని వెల్లడించారు. ఉపఎన్నికల నిర్వహణలో కొవిడ్‌-19 ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు. కొవిడ్‌ బారినపడినవారు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఓటేసే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాలవద్ద ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి అందుబాటులో ఉంటారని వివరించారు. మరోపక్క, నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఒక మోస్తరు వర్షం కురవడంతో ఏర్పాట్లు పూర్తిచేయడంలో అధికారులు ఇబ్బందులు పడ్డారు. పోలింగ్‌ నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

తెలంగాణలోని ‘‘హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి.  మొత్తం ఓటర్లు 2,37,022 మంది ఉన్నారు. 306 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేంద్ర రాజీనామా చేయటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని