Gujarat: అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో మొత్తం 38 మంది దోషులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార

Updated : 19 Feb 2022 05:35 IST

మరో 11 మందికి యావజ్జీవం

ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు

దేశంలో ఇంత మందికి మరణశిక్ష ఇదే మొదటిసారి

బాధిత కుటుంబాల హర్షం

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో మొత్తం 38 మంది దోషులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. సుమారు 13 ఏళ్ల విచారణ అనంతరం శుక్రవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది. దేశంలో ఒక న్యాయస్థానం ఒకేసారి ఇంతమందికి మరణ దండన విధించడం ఇదే తొలిసారి! ఇంతకుముందు 1998లో తమిళనాడులోని టాడా కోర్టు రాజీవ్‌గాంధీ హత్యకేసులో గరిష్ఠంగా 26 మందికి మరణశిక్ష విధించింది. 2008, జులై 26న... అహ్మదాబాద్‌ నగరంలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. 70 నిమిషాల వ్యవధిలోనే 21 బాంబు పేలుళ్లతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనల్లో మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోగా,
200 మందికి పైగా గాయపడ్డారు. యావద్దేశాన్ని తీవ్రంగా కలచివేసిన ఈ పేలుళ్లపై అహ్మదాబాద్‌, సూరత్‌లలో మొత్తం 35 కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక న్యాయస్థానం వీటన్నింటినీ కలిపి విచారణ ప్రారంభించింది. మొత్తం 78 మందిపై అభియోగాలు నమోదుకాగా, వీరిలో ఓ వ్యక్తి అప్రూవర్‌గా మారాడు. మిగతా 77 మందిపై 2009లో విచారణ ఆరంభమైంది. మొత్తం 1,171 మంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను నమోదు చేసిన న్యాయస్థానం... ఈ నెల 8న 49 మందిని దోషులుగా తేల్చింది. మరో 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ క్రమంలోనే, ప్రత్యేక న్యాయమూర్తి ఎ.ఆర్‌.పటేల్‌ శుక్రవారం దోషులకు శిక్షను ఖరారుచేస్తూ తీర్పు వెలువరించారు. 38 మందికి మరణ దండన, 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దోషుల్లో 48 మందికి రూ.2.85 లక్షలు, ఒకరికి రూ.2.88 లక్షల చొప్పున జరిమానా విధించారు. హత్య, నేరపూరిత కుట్ర, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వంటి అభియోగాల కింద ఈ శిక్షలను ఖరారు చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.లక్ష

పేలుళ్లలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. తీర్పు వెలువరిస్తున్న సమయంలో... దోషులంతా అహ్మదాబాద్‌లోని సబర్మతి కేంద్ర కారాగారం, దిల్లీలోని తిహార్‌ జైలుతో పాటు భోపాల్‌, గయ, బెంగళూరు, కేరళ, ముంబయి జైళ్ల నుంచి వీడియో ద్వారా విచారణకు హాజరయ్యారు.

ఇంకా నలుగురిపై అభియోగాలు

వరుస పేలుళ్ల కేసును గుజరాత్‌ పోలీసు విభాగం, ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంయుక్తంగా ఛేదించాయి. రాజస్థాన్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులు కూడా దర్యాప్తులో సహకరించారు. ఈ కేసులో మరో నలుగురిపైనా ఆరోపణలు నమోదైనా, ఇంకా విచారణ ప్రారంభం కాలేదని ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాది తెలిపారు. వరుస బాంబు పేలుళ్లపై తొలుత విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ త్రివేది... ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎ.ఆర్‌.పాటిల్‌ 2017 జులై 14 నుంచి వాదనలు వింటూ వచ్చారు.

మోదీని కూడా చంపాలనుకున్నారు...

అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లు చేపట్టడంతో పాటు... నాడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని కూడా హతమార్చాలని కుట్రదారులు ప్రణాళికలు వేసినట్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సుధీర్‌ బ్రహ్మభట్‌ చెప్పారు. కేసు దర్యాప్తు సందర్భంగా ఓ నిందితుడు ఈ విషయాన్ని వెల్లడించినట్టు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారని ఆయన వివరించారు. సదరు వ్యక్తిని న్యాయస్థానం దోషిగా తేల్చి, శిక్ష విధించిందన్నారు.


ప్రతీకారేచ్ఛతోనే..

2002-గోద్రా రైలు దుర్ఘటన అనంతర అల్లర్లలో వెయ్యి మందికి పైగా మృతిచెందారు. ప్రతీకారంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ అహ్మదాబాద్‌లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నింది. దీనిలోమధ్యప్రదేశ్‌కు చెందిన సఫ్దర్‌ నగోరి, కుమరుద్దీన్‌ నగోరి, గుజరాత్‌కు చెందిన ఖయూముద్దీన్‌ కపాడియా, జాహిద్‌ షేక్‌, షంషుద్దీన్‌ షేక్‌ కీలకపాత్ర పోషించారు. సఫ్దర్‌, జాహిద్‌లు పేలుడు పదార్థాల కొనుగోలుకు నిధులు సేకరించినట్టు ఆధారాలు లభించాయి.


స్వాగతించిన బాధిత కుటుంబాలు

పేలుళ్లలో మృతిచెందినవారి కుటుంబ సభ్యులు ఈ తీర్పును స్వాగతించారు. ‘‘ఈ సమయం కోసమే మా అమ్మ, నేను 13 ఏళ్లుగా నిరీక్షించాం. 38 మందికి మరణశిక్ష విధించడం ఆనందం కలిగించింది. మిగతా దోషులకూ ఇదే శిక్షను ఖరారుచేసి ఉంటే బావుండేది’’ అని ఈ దుర్ఘటనలో తండ్రిని, సోదరుడిని కోల్పోయి... తాను కూడా తీవ్రంగా గాయపడిన యశ్‌ వ్యాస్‌ పేర్కొన్నాడు. అతని తండ్రి దుష్యంత్‌ వ్యాస్‌ ఓ క్యాన్సర్‌ ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌. కుమారులిద్దరికి సైకిల్‌ తొక్కడం నేర్పిద్దామని సాయంత్రం వారిని సరదాగా బయటకు తీసుకువెళ్లగా... పేలుళ్లు సంభవించాయి! ఆ ధాటికి దుష్యంత్‌తో పాటు యశ్‌ సోదరుడు కూడా మృతిచెందారు. 50% కాలిన గాయాలతో యశ్‌ చాలా నెలలు ఐసీయూలోనే చికిత్స పొందాల్సి వచ్చింది. తొమ్మిదేళ్ల వయసులో ఇంతటి ఘోరాన్ని చూసిన యశ్‌... ఇప్పుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. భారీ పేలుడు కారణంగా పాక్షికంగా వినికిడి శక్తిని కోల్పోయాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని