Heavy Rain: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత

ఉపరితల ఆవర్తన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా నెల్లూరు నగరాన్ని నాలుగు రోజులుగా వర్షం ముంచెత్తుతోంది. శనివారం

Updated : 08 Nov 2021 05:26 IST

ఇళ్లలోకి చేరిన నీరు

నెల్లూరులోని ముత్తుకూరు రోడ్డు అండర్‌పాస్‌లో నిలిచిన నీరు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు, చిత్తూరు- న్యూస్‌టుడే- వరదయ్యపాళెం, కేవీబీపురం: ఉపరితల ఆవర్తన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా నెల్లూరు నగరాన్ని నాలుగు రోజులుగా వర్షం ముంచెత్తుతోంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8.30 వరకు నెల్లూరు జిల్లాలో సరాసరి 6.27 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తడ మండలంలో 16.5సెం.మీ., సూళ్లూరుపేటలో 13.8 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్‌, కనకమహల్‌ సెంటర్‌, ముత్తుకూరు కూడలి సమీపంలో రైల్వే అండర్‌పాస్‌ల వద్ద నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. మాగుంట లేఅవుట్‌లోని అండర్‌పాస్‌, రామలింగాపురం, లెక్చరర్స్‌ కాలనీ, హరినాథపురం, నాగసాయి మందిరం తదితర ప్రాంతాల్లోనూ నీరు భారీగా నిలిచింది.  ఇళ్లలోకి నీరు చేరింది. చేజర్ల మండలంలోని గొల్లపల్లి వద్ద పందల వాగు పొంగడంతో రాకపోకలు నిలిచాయి. సూళ్లూరుపేటలో రైల్వే వంతెన కిందకు నీరు చేరడంతో బస్సు ఇరుక్కుపోయింది.


చిత్తూరు జిల్లాలో ఒకరి మృతి

వెంకటకృష్ణయ్య 

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో స్వర్ణముఖి నదికి భారీగా వరద చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం, వరదయ్యపాళెం మండలాల్లో వరదనీటి ప్రవాహానికి పలు వంతెనలు కొట్టుపోయాయి. పలు గ్రామాలు నీట మునగడంతో సమీపంలోని పాఠశాలల్లో తాత్కాలిక వసతి కల్పించారు. కాళంగి రిజర్వాయర్‌కు పది వేల క్యూసెక్కుల వరద చేరుతుండటంతో పది గేట్లను ఎత్తారు. చెంచురామిశెట్టి కండ్రిగ గ్రామంలో వెంకటకృష్ణయ్య(45) వాన, చలికి తట్టుకోలేక చనిపోయారు. ఆయన ఇంట్లోకి వరదనీరు చేరింది. బీజీఆర్‌ ఎస్టీ కాలనీలోకి వరద చేరడంతో ప్రజలకు గోవర్ధనపురం పాఠశాలలో వసతి కల్పించారు. తిరుమలలోనూ కుండపోతగా వాన పడుతోంది. భక్తుల రాకపోకలకు అంతరాయమేర్పడింది. పాపవినాశనం, గోగర్భం డ్యాం నిండడంతో నీటిని విడుదలచేశారు. సత్యవేడు మండలం ఇరుగులంలో 13.5 సెం.మీ. వర్షం కురిసింది.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం

ఉల్సాపడవ రోడ్డులో కాజ్‌వేపై వరద ఉద్ధృతి


నేడు అల్పపీడనం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 11, 12 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ‘ఆగ్నేయ బంగాళాఖాతం, దాని సమీప ప్రాంతాల్లో సోమవారం అల్పపీడనం ఏర్పడి.. తర్వాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరం దిశగా ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణకోస్తాలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురవొచ్చు’ అని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని