Kishan Reddy: వైకాపా అరాచక పాలన ఎన్నాళ్లో సాగదు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేసిందని ఎద్దేవా చేశారు. సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయడం లేదన్నారు.

Updated : 20 Mar 2022 06:37 IST

అప్పుల కోసం వైకాపా సర్కారు ఆరాటం

‘రాయలసీమ రణభేరి’ సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని నేతల ఉద్ఘాటన

ఈనాడు డిజిటల్‌, కడప: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేసిందని ఎద్దేవా చేశారు. సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయడం లేదన్నారు. అప్పులు చేసి ఎన్ని రోజులు పాలన సాగిస్తారని ప్రశ్నించారు.కడపలో శనివారం జరిగిన రాయలసీమ రణభేరి సభలో ఆయన మాట్లాడారు. ‘వ్యతిరేకంగా మాట్లాడేవారిని అణచివేసే ప్రభుత్వాన్ని ఇక్కడే చూస్తున్నాం. పార్టీ మారితే కేసులు పెడతారు. భూములు కబ్జా చేస్తారు. వ్యాపారాలు దెబ్బతీస్తారు. ఇలాంటి అరాచక పాలన ఎన్ని రోజులో సాగదు. రతనాల సీమ లాంటి రాయలసీమ నేడు వెనుకబడిపోయింది. ఇక్కడి నుంచి ఎందరో నాయకులు రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యారు. ఎవరు వచ్చినా సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడమే సీమ వెనుకబాటుకు కారణం. నికర జలాలు కేటాయింపు లేక రాయలసీమ నష్టపోయింది’ అని ధ్వజమెత్తారు. ‘నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సీఎం జగన్‌ ఏం చేశారు? రాయలసీమ సమస్యలపై భాజపా మొదటి నుంచి పోరాడుతోంది. జాతీయ రహదారుల అభివృద్ధి బాధ్యత కేంద్రం తీసుకుంది. గండికోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. శ్రీశైలం, అన్నవరం, అమరావతి క్షేత్రాల అభివృద్ధికి నిధులిస్తోంది’ అని తెలిపారు. ‘రానున్న రోజుల్లో రాయలసీమను మరింత అభివృద్ధి చేస్తాం. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో కుటుంబపాలనకు ప్రజలు స్వస్తి పలికారు. ఇక్కడ కూడా రౌడీ రాజ్యం పోవాలి. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం రావాలి’ అని ఆకాంక్షించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ‘పులివెందులలో మా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఆమె భూములు కబ్జా చేశారు. బద్వేలులో పార్టీకి మద్దతు పలికిన వారి భూములను నీటముంచారు. ఇసుక, మట్టి అమ్ముకునే దొంగల పార్టీ వైకాపా. చైనా, పాకిస్థాన్‌కే భాజపా భయపడలేదు. జగన్‌కు భయపడుతుందా?’ అని పేర్కొన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రివర్స్‌ పాలన సాగుతోందన్నారు. జగన్‌ మద్యం అమ్ముకుంటుంటే.. ఆ పార్టీ నేతలు కల్తీసారా దందా చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలులో న్యాయ రాజధాని పెడతానన్న జగన్‌.. ఏనాడైనా అమరావతి నుంచి హైకోర్టును మార్చాలని కేంద్రానికి లేఖ రాశారా? అని నిలదీశారు.

భాజపాతోనే మంచి భవిష్యత్తు

మా కుటుంబానికి రాయలసీమతో అవినాభావ సంబంధం ఉందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ‘రాయలసీమ దత్తపుత్రుడిగా ప్రకటించుకున్న ఎన్టీఆర్‌.. తిరుపతి నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఎన్టీఆర్‌ కుమార్తెగా నేను సీమ ఆడబిడ్డగా భావిస్తున్నా. రాయలసీమ క్షామ పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ ఇక్కడ భిక్షాటన చేపట్టారు. సిద్దేశ్వరం అలుగు రాయలసీమ జీవనాడి. దీనిపై ఏ ప్రభుత్వమూ దృష్టి పెట్టలేదు. పెండింగ్‌ ప్రాజెక్టులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. 200 టీఎంసీల నీరు రాయలసీమకు రావాల్సి ఉండగా.. ఎంతమేరకు అందిస్తున్నారో తరచిచూసుకోవాలి’ అని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర సహ బాధ్యులు సునీల్‌ దేవధర్‌ మాట్లాడుతూ.. తిరుమలేశుని తొలి గడప కడపలో టిప్పుసుల్తాన్‌ విగ్రహం పెడతామంటే ఊరుకోమన్నారు. హిందువులను ఊచకోత కోసిన వ్యక్తి విగ్రహాన్ని ప్రొద్దుటూరులో పెడతామంటే ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నించారు.

శవాలకు కుట్లు వేసే పార్టీ

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ మంత్రి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి విమర్శించారు. వైఎస్‌ వివేకాను వాళ్లే చంపించి నాపై కేసులు పెట్టారని మండిపడ్డారు. కేసులో బయటకు వస్తున్న పేర్లన్నీ వారివే అన్నారు. శవాలకు కుట్లు వేయడం, రక్తపు మరకలు తుడవడం లాంటి పనులకు పాల్పడే పార్టీ వైకాపా అని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ ఏమైందని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌, జీవీఎల్‌ నరసింహారావు, సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్‌, నాయకులు కామినేని శ్రీనివాస్‌, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్‌, వాకాటి నారాయణరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని