Lata Mangeshkar: వసంతాలు వెదుకుతాయి నీవెక్కడని..!

ఏడు దశాబ్దాలపాటు ఆబాలగోపాలాన్ని గాన మాధుర్యంతో ఓలలాడించిన గాత్రం మూగబోయింది. 36 భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమె శాశ్వతంగా సెలవు తీసుకుని దివికేగారు. కొంతకాలం నుంచి కరోనాతో పాటు న్యుమోనియాతో పోరాడుతున్న ప్రఖ్యాత గాయని, భారత రత్న లతా మంగేష్కర్‌ (92) కన్నుమూశారు. స్వల్పంగా కొవిడ్‌-19 లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో గత నెల 8న చేరిన ఆమె అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. మధ్యలో కొన్నాళ్లు ఆరోగ్యం...

Updated : 07 Feb 2022 05:16 IST

భారతరత్న లతా మంగేష్కర్‌ ఇక లేరు
గానకోకిలను పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి
28 రోజులుగా చికిత్స పొందుతూ కన్నుమూత
7 దశాబ్దాలపాటు గానంతో ఓలలాడించిన మధుర స్వరం మూగబోవడంతో కన్నీటి సంద్రంలో అభిమానులు

ముంబయి

‘‘హమారే బాద్‌ అబ్‌ మెహఫిల్‌ మే, అఫ్సానే బయా హోంగే
బహారే హమ్‌ కో ఢూండేగీ, నా జానే హమ్‌ కహా హోంగే!’’

(నా తదనంతరం.. నలుగురూ చేరినచోట చర్చలు జరుగుతాయి
వసంతాలు వెదుకుతాయి నేనెక్కడని, ఎక్కడుంటానో తెలియదుగా!)
సినీ వసంతంలో కాలు మోపిన తొలిరోజుల్లో ‘బాగీ’ (1953) చిత్రం కోసం లతా మంగేష్కర్‌ పాడిన గీతమిది. ఆ గీతం నేడు అక్షరసత్యమై.. ప్రతి హృదిలో ప్రతిధ్వనిస్తోంది. దివికేగిన ఆ గాన కోకిలను యావద్దేశం గుర్తు చేసుకుంటోంది. భారమైన హృదయంతో నలుదిక్కులా చూస్తోంది. ఎటు వెళ్లిపోయింది లతా మంగేష్కర్‌? బహుశా.. గంధర్వలోక స్వాగత సత్కారాలు అందుకొంటూ ఉందేమో! తనకంటే ముందే అక్కడ చేరిన ముకేశ్‌, మహమ్మద్‌ రఫీ, కిశోర్‌కుమార్‌ వంటి సమకాలీన గాయక దిగ్గజాలతో కుశల ప్రశ్నల్లో నిమగ్నమై ఉన్నారేమో!!

డు దశాబ్దాలపాటు ఆబాలగోపాలాన్ని గాన మాధుర్యంతో ఓలలాడించిన గాత్రం మూగబోయింది. 36 భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమె శాశ్వతంగా సెలవు తీసుకుని దివికేగారు. కొంతకాలం నుంచి కరోనాతో పాటు న్యుమోనియాతో పోరాడుతున్న ప్రఖ్యాత గాయని, భారత రత్న లతా మంగేష్కర్‌ (92) కన్నుమూశారు. స్వల్పంగా కొవిడ్‌-19 లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో గత నెల 8న చేరిన ఆమె అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. మధ్యలో కొన్నాళ్లు ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో వెంటిలేటర్‌ను తొలగించారు. తర్వాత క్రమేపీ పరిస్థితి విషమించింది. శనివారం నుంచి అత్యంత విషమంగా మారింది. కీలక అవయవాలు పనిచేయకపోవడంతో ఆదివారం ఉదయం 8.12 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు వెల్లడించారు. అధికారిక లాంఛనాల నడుమ ఆదివారం సాయంత్రం దాదర్‌లోని శివాజీపార్క్‌ వద్ద నిర్వహించిన మంగేష్కర్‌ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, బాలీవుడ్‌ ప్రముఖులు షారుక్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌ సహా పలువురు హాజరయ్యారు. పోలీసులు, సైనికులు ఆమెకు సంప్రదాయబద్ధంగా గౌరవ వందనం చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే స్మారకానికి 100 మీటర్ల దూరంలో గాన కోకిలకు అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారంలో 25 కిలోల గంధపు చెక్కల్ని వినియోగించారు. చితికి లత సోదరుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ నిప్పంటించారు. పది కిలోమీటర్ల పొడవునా సాగిన అంతిమ యాత్రలో రహదారికి ఇరువైపులా వేలమంది నిల్చొని అశ్రు నివాళులు అర్పించారు. అభిమాన గాయనిని కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తారు. పూలరథంలో త్రివర్ణ పతాకం చుట్టిన శవపేటికలో భౌతిక కాయాన్ని అంతిమ యాత్రకు తీసుకువెళ్లారు. లతకు నివాళి అర్పించినవారిలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌; అమితాబ్‌ బచ్చన్‌, అనుపమ్‌ ఖేర్‌, జావేద్‌ అఖ్తర్‌, సంజయ్‌లీలా భన్సాలీ సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 1929 సెప్టెంబరు 28న జన్మించిన మంగేష్కర్‌కు మీనా, ఆశాభోంస్లే, ఉష, హృదయనాథ్‌లు తోబుట్టువులు. శాస్త్రీయ సంగీతకారుడైన తండ్రి పండిట్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లత.. ఐదో ఏట నుంచే పాడడం మొదలుపెట్టారు. తండ్రి మరణానంతరం నటనా రంగంలో ఆమె అడుగుపెట్టినా పాటల ప్రస్థానాన్ని మాత్రం కొనసాగించారు. మొట్టమొదటగా ఓ మరాఠీ చిత్రంతో ఆమె నేపథ్య గాయని అయ్యారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. చివరిసారిగా ఆమె ఆలపించిన పాట గత అక్టోబరులో విడుదలైంది. ‘చల్తే చల్తే’, ‘సత్యం శివం సుందరం’, ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’, ‘లగ్‌ జా గలే’ వంటి ఎన్నో చిరస్మరణీయ గీతాలు ఆమె గాత్రం నుంచి జాలువారాయి. ఆమెను వరించని పురస్కారం లేదు. 1999-2005 మధ్య ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. కళాకారుల కోటాలో కేంద్ర ప్రభుత్వం ఆమెను నియమించింది. భారతరత్నకు అదనంగా పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాలతో పాటు జాతీయ చలన చిత్రోత్సవాల్లో అనేక అవార్డులను ఆమె పొందారు. ఆమె గాత్ర మాధుర్యంతో పులకించిన అనేకమంది లతను సరస్వతీ దేవితో పోలుస్తుంటారు. సరిగ్గా సరస్వతీ పూజ మరుసటిరోజే ఆమె తనువు చాలించడాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు.

మధుర గాయని కన్నుమూతపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సహా అనేకమంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున సంతాపాలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆది, సోమవారాల్లో దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు, మధ్యప్రదేశ్‌/ కర్ణాటక వంటి రాష్ట్రాలు రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటించాయి.


దివ్యగళం మూగబోయింది..

- రామ్‌నాథ్‌ కోవింద్‌ భారత రాష్ట్రపతి

టువంటి కళాకారులు కొన్ని శతాబ్దాలకు ఒకరు పుడుతుంటారు. దివ్యమైన ఆ గళం మూగబోయింది. లతా మంగేష్కర్‌ పాడిన మధురగీతాలు అజరామరం. ఆ పాటలు మన మధ్య ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. భారతీయ ఔన్నత్యం, సౌందర్యం వాటిలో తొంగి చూస్తాయి. కొన్ని తరాలు ఆమె పాటలతో స్ఫూర్తి పొందుతాయి. ‘భారతరత్న’ లతాజీ విజయాలు అనితరసాధ్యం.


లతాజీ సంగీతరత్నం..
- ఎం.వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి

తాజీ మరణంతో భారతదేశం గొంతు మూగబోయింది. తన గళమాధుర్యంతో ఆమె కొన్ని దశాబ్దాలు భారత్‌తోపాటు ప్రపంచ సంగీత అభిమానులను అలరించారు. ఆమె సంగీతరత్న. హిందీ సినీ సామ్రాజ్యాన్ని రాణిలా ఏలారు. భారమైన హృదయంతో లతాజీ కుటుంబసభ్యులకు, ఆమె అభిమానులకు సంతాపం తెలుపుతున్నా.


మాటలు రావడం లేదు..

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

జాతికి ఇక ఆమె లేరన్న లోటును ఎవరూ పూడ్చలేరు. లతా దీదీ దయ, ప్రేమాభిమానాలు తలచుకుంటే బాధతో మాటలు రావడం లేదు. భారత సంస్కృతికి దిగ్గజ ప్రతీకగా ఆమెను ముందు తరాలు గుర్తు పెట్టుకుంటాయి. మధురమైన ఆ కంఠానికి ప్రజలను మైమరిపింపజేసే అసమాన సామర్థ్యం ఉంది. సినిమాలే కాకుండా.. ఈ దేశ ఉన్నతిని ఆమె సదా కోరుకున్నారు.


ఉపఖండం ప్రపంచస్థాయి గొప్ప గాయకురాలిని కోల్పోయింది.
- ఇమ్రాన్‌ఖాన్‌, పాక్‌ ప్రధాని
సంగీత మహారాణికి నివాళులు. ఉపఖండంలోని సంగీత ప్రియులకు ఇది తీరని లోటు
- షేక్‌ హసీనా, బంగ్లాదేశ్‌ ప్రధాని
పాటల రూపంలో లతా ఎప్పటికీ మనతో ఉంటారు.
- మహీంద్రా రాజపక్స, శ్రీలంక ప్రధాని


సంగీతానికి దేవుడిచ్చిన వరం
సీఎం కేసీఆర్‌ సంతాపం

ఈనాడు, హైదరాబాద్‌:  ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారన్నారు. ‘‘లతా మంగేష్కర్‌ భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం. వేల పాటలు పాడిన ఆమె సరస్వతీ స్వరనిధి. లతాజీ వల్ల పురస్కారాలకు గౌరవం దక్కింది’’ అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు సంతాపం తెలిపారు.  

గవర్నర్‌ తీవ్ర దిగ్భ్రాంతి: లతా మంగేష్కర్‌ మృతిపై గవర్నర్‌ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త విని బాధపడ్డానని ఆదివారం ట్విటర్‌లో పేర్కొన్నారు.  


కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంతాపం

తా మంగేష్కర్‌ మృతి పట్ల కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె అద్భుతమైన గానంతో వివిధ భాషల్లో వేలాది పాటలు పాడారన్నారు. ఇందులో తెలుగులో పాడిన మూడు పాటలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఇంకా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి,  ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని