Updated : 10 Nov 2021 05:25 IST

MLC Elections: డిసెంబరు 10న 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

8 జిల్లాల పరిధిలోని స్థానిక సంస్థల కోటాలో ఖాళీలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి డిసెంబరు 10న పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఎనిమిది జిల్లాల పరిధిలోని 11 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు గాను భారత ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 16న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 23వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 26వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది.
డిసెంబరు 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహిస్తారు. 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. 16వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు.

ఖాళీ అయిన స్థానాలివే
కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన బుద్దా వెంకటేశ్వరరావు, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, తూర్పుగోదావరి నుంచి ఎన్నికైన రెడ్డి సుబ్రహ్మణ్యం, గుంటూరు స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయనగరం నుంచి ఎన్నికైన ద్వారపురెడ్డి జగదీష్‌, విశాఖపట్నం నుంచి ఎన్నికైన బుద్దా నాగ జగదీశ్వరరావు, పప్పల చలపతిరావు, చిత్తూరు నుంచి ఎన్నికైన గాలి సరస్వతిల పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 11తో ముగిసింది. అప్పటి నుంచి ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు అనంతపురం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎన్నికైన పయ్యావుల కేశవ్‌ స్థానం 2019 జూన్‌ 4నుంచి, గుంటూరు నుంచి ఎన్నికైన అన్నం సతీష్‌ ప్రభాకర్‌ స్థానం అదే సంవత్సరం జులై 10నుంచి, ప్రకాశం నుంచి ఎన్నికైన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్సీ పదవి 2019మార్చి14 నుంచి ఖాళీగా ఉన్నాయి. వారు పదవులకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి.. అయితే అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో ఓటర్ల జాబితా అందుబాటులో లేక.. ఆ కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. తాజాగా ఇప్పుడు ఆ స్థానాలన్నింటికీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైంది.

తెలంగాణలో..
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ శాసన మండలిలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయ్యే 12 స్థానాల భర్తీకి కూడా డిసెంబరు 10న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆయా స్థానాల నుంచి శాసనమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనుంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో రెండు స్థానాల చొప్పున, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, మెదక్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో  ఒక్కో స్థానానికి ఎన్నిక జరగనుంది. స్థానిక సంస్థల కోటాలో పురాణం సతీష్‌ (ఆదిలాబాద్‌), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్‌), వి.భూపాల్‌రెడ్డి (మెదక్‌), తేరా చిన్నపరెడ్డి (నల్గొండ), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), బి.భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు (కరీంనగర్‌), కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబాబాద్‌), పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి రాజు (రంగారెడ్డి) జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts