New Districts: కొత్త జిల్లా.. వసతులెలా?

పరిమిత నిధులతో రాష్ట్రంలో కొత్త జిల్లాల కార్యాలయాలకు వసతులు ఎలా కల్పించాలన్నదానిపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో జిల్లా కేంద్రంలో 70 ప్రభుత్వ శాఖలు, 140 వరకు కార్యాలయాలు ఉంటాయి.

Updated : 13 Mar 2022 05:17 IST

రూ.3 కోట్లతోనే మరమ్మతులు చేయాలి.. రంగులూ వేయాలి

25 నాటికి భవనాలను సిద్ధం చేయాలని ఆదేశాలు

ఆ నిధులు ఎందుకూ సరిపోవని అధికారుల మొర

ఈనాడు - అమరావతి

పరిమిత నిధులతో రాష్ట్రంలో కొత్త జిల్లాల కార్యాలయాలకు వసతులు ఎలా కల్పించాలన్నదానిపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో జిల్లా కేంద్రంలో 70 ప్రభుత్వ శాఖలు, 140 వరకు కార్యాలయాలు ఉంటాయి. ఈ కార్యాలయాల ఏర్పాటుకు భవనాల గుర్తింపు తుది దశకు వచ్చింది. ఎంపిక చేసిన కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఒక్కో కొత్త జిల్లాకు రూ.3 కోట్లు మాత్రమే కేటాయించింది. భవనాల్లో క్యాబిన్ల ఏర్పాటు, సున్నం వేయించడం, రంగులద్దడం, సీలింగ్‌, కంప్యూటర్లు, ఫర్నిచర్‌ వంటి వాటిని సమకూర్చేందుకు, ఫర్నిచర్‌ను పాత జిల్లాల నుంచి తెప్పించేందుకు ఆ నిధులు సరిపోవడంలేదని అధికారులు వాపోతున్నారు.

ఖరారైన భవనాల దగ్గర కొత్త జిల్లాల పేర్లతో (కలెక్టర్‌/జిల్లా మేజిస్ట్రేట్‌) బోర్డులూ వెలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి సామగ్రినీ తరలిస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు లేని శాఖలకు ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటున్నారు. కొన్నాళ్లపాటు వివిధ ప్రభుత్వ శాఖలను ప్రస్తుత జిల్లాలోనే ఉంచి, కార్యకలాపాలను కొనసాగించాలని ఆలోచిస్తున్నారు. విజయనగరంలో ఇలాగే చేస్తున్నారు.

విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలు

విద్యా సంస్థల భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకోవద్దని ప్రభుత్వం ఆదేశించినా పలుచోట్ల అందుకు భిన్నంగా సాగుతోంది.  శ్రీసత్యసాయి జిల్లాలో 50 శాతానికిపైగా కార్యాలయాలను సత్యసాయి ట్రస్టు భవనాల్లో ఏర్పాటు చేయనున్నారు. పలు ప్రభుత్వ శాఖలను కొత్త చెరువులోని బీసీ బాలికల వసతి గృహాన్ని, బుక్కపట్నంలోని డైట్‌ కళాశాల భవనాలను సిద్ధం చేస్తున్నారు. కొత్త చెరువులో వసతి గృహానికి భవనాన్ని 2018లో రూ.80 లక్షలతో నిర్మించారు. నాలుగేళ్ల నుంచి నిరుపయోగంగా ఉంటోంది.

ఇందులోకి రావాల్సిన బాలికలు ఒక అద్దె భవనంలో అవస్థలు పడుతున్నారు. బుక్కపట్నంలోని డైట్‌ కళాశాలలో జడ్పీ కార్యాలయం, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలోని కొన్ని గదుల్లో డీఈఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేసే విషయమై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

ఉద్యోగుల సర్దుబాటుపై ఉత్తర్వులు సిద్ధం: కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ముగిసింది. అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. అనంతపురం జిల్లాకు 57.81%, కొత్తగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాకు 42.19% ఉద్యోగులను ఇచ్చారు. కడప జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు కడప నుంచి 27%, చిత్తూరు జిల్లా నుంచి 23% మంది ఉద్యోగులను ఇచ్చారు. ఈ తరహాలోనే మిగిలిన జిల్లాలకు కేటాయించారు.

తాత్కాలికమే కదా.. సర్దుకోండి!

విశాఖలో కొత్తగా ఏర్పడే 2 జిల్లాల్లోని కార్యాలయాల్లో మౌలిక వసతులను కల్పించడానికి రూ.40 కోట్ల వరకు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం రెండు జిల్లాలకు కలిపి రూ.6 కోట్లు ఇవ్వడంతో అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. అదనంగా నిధులు అవసరమని జిల్లా అధికారులకు విన్నవిస్తే తాత్కాలిక కార్యాలయాలే కావడంతో తక్కువ ఖర్చుతోనే కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చూడాలని సమాధానం వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు