PM Modi: అవినీతిపరుల్ని వెంటాడండి

అవినీతిపరులెంతటి బలవంతులైనా వదలొద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లకు స్పష్టం చేశారు. వారికి ప్రపంచంలో ఎక్కడా చోటు దొరకకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రధాని బుధవారం కేవడియాలో సీవీసీ, సీబీఐ సంయుక్త సమ్మేళనాన్ని

Updated : 21 Oct 2021 10:39 IST

అవినీతిపరులు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా.. వెంటాడండి
సీవీసీ, సీబీఐలకు స్పష్టం చేసిన ప్రధానిమోదీ

ఈనాడు, దిల్లీ: అవినీతిపరులెంతటి బలవంతులైనా వదలొద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లకు స్పష్టం చేశారు. వారికి ప్రపంచంలో ఎక్కడా చోటు దొరకకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రధాని బుధవారం కేవడియాలో సీవీసీ, సీబీఐ సంయుక్త సమ్మేళనాన్ని ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. జాతీయ జీవితం నుంచి అవినీతిని నిర్మూలించడానికి సీబీఐ, సీవీసీ అధికారులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ‘‘పెరిగిపోతున్న అవినీతిని అరికట్టడం సాధ్యమేనని ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంలో గత 6-7 ఏళ్లలో ప్రభుత్వం విజయవంతమైంది. మధ్యదళారీలు లేకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందొచ్చన్న నమ్మకం ఏర్పడింది. అవినీతిపై దాడిచేసే రాజకీయ సంకల్పంతోపాటు, పరిపాలన వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకొనే ఉద్దేశం ఇప్పుడు ఉంది. వ్యవస్థలో అవినీతిని ఇక ఏమాత్రం సహించే పరిస్థితి లేదు. పారదర్శకమైన, సమర్థవంతమైన వ్యవస్థను, సున్నితమైన పరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారు. దీనికైనా ముందస్తు నిఘా మంచిది. అప్రమత్తత, సాంకేతిక పరిజ్ఞానం, అనుభవంతోనే అది సాధ్యమవుతుంది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసే అధికారులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదు. పేదప్రజల్లో వ్యవస్థపట్ల ఉన్న భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాలి. నవ భారత నిర్మాణానికి అడ్డుగా పరిణమించే ప్రక్రియలను సీవీసీ, సీబీఐలాంటి అవినీతి నిరోధక సంస్థలు తొలగించాలి. పేదలను వ్యవస్థలకు దగ్గర చేర్చి, అవినీతిపరులను బయటికి తరిమేసేలా చట్టాలను అమలుచేయాలి’’ అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గిస్తున్నాం
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాజీవితంపై ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ప్రధాని చెప్పారు. ‘‘స్వాతంత్య్రం తర్వాత దేశంలో తయారైన వ్యవస్థల ద్వారా ప్రభుత్వం అన్నింటినీ తన కబ్జాలో ఉంచుకోవచ్చన్న భావన నెలకొంది. ప్రభుత్వం నియంత్రణాధికారాలను గరిష్ఠంగా తన వద్దే ఉంచుకోవడంతో దానివల్ల వ్యవస్థలో అనేకరకాలైన తప్పుడు ప్రవృత్తులు పురుడుపోసుకున్నాయి. ఇంట్లోనైనా, కుటుంబంలోనైనా, దేశంలోనైనా అధిక నియంత్రణ.. అధిక నష్టాన్ని కలగచేస్తుంది. అందుకే ప్రజాజీవితంపై ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాం. ప్రభుత్వ ప్రక్రియలను సరళతరం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.

 


ఎయిరిండియా ప్రైవేటీకరణ.. పెద్ద ముందడుగు

కుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

ఈనాడు, లఖ్‌నవూ: ఎయిరిండియా సంస్థను ప్రయివేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలో విమానయాన రంగానికి కొత్త శక్తిని ఇవ్వనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్‌లో రూ.260 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో విమానసేవలు వేగంగా విస్తరిస్తున్నాయని, రాబోయే రోజుల్లో 200 పైగా విమానాశ్రయాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఉడాన్‌ పథకం కింద ఇప్పటికే 900 కొత్త విమాన మార్గాలకు అనుమతులిచ్చామని తెలిపారు. అందులో 350కు పైగా మార్గాల్లో సర్వీసులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత...మోదీ ఖుషీనగర్‌లోని బుద్ధుని మహాపరినిర్వాణ మందిరాన్ని సందర్శించారు. అక్కడ బుద్ధుడికి పూజలు చేసి.. విగ్రహానికి చీవర్‌(ఒక వస్త్రం) సమర్పించారు. బోధి వృక్షం కూడా నాటారు. ఈ కార్యక్రమంలో విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, శ్రీలంక క్రీడా శాఖ మంత్రి నమల్‌ రాజపక్స పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని