Punjab Assembly Elections: ఆప్‌దే ‘పంజా’బ్‌!

పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ ప్రభంజనం సృష్టించింది. అధికార కాంగ్రెస్‌ పార్టీనీ, హేమాహేమీలనూ మట్టి కరిపించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ కొనసాగిన సంప్రదాయ రాజకీయాలను తన ‘చీపురు గుర్తు’తో ఊడ్చి పారేసింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగానూ

Updated : 11 Mar 2022 05:16 IST

సంప్రదాయ పార్టీలను ఊడ్చేసిన ‘చీపురు’
92 స్థానాలతో ప్రభంజనం
మట్టికరిచిన హేమాహేమీలు
అమరీందర్‌, చన్నీ, సిద్ధూల అడ్రస్‌ గల్లంతు
బాదల్‌లకూ తప్పని పరాజయం

చండీగఢ్‌: పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ ప్రభంజనం సృష్టించింది. అధికార కాంగ్రెస్‌ పార్టీనీ, హేమాహేమీలనూ మట్టి కరిపించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ కొనసాగిన సంప్రదాయ రాజకీయాలను తన ‘చీపురు గుర్తు’తో ఊడ్చి పారేసింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగానూ ఆప్‌ ఏకంగా 92 స్థానాలను కొల్లగొట్టింది. కాంగ్రెస్‌-18, అకాలీదళ్‌-3, భాజపా-2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దళిత సామాజికవర్గం ఓట్లతో ప్రభావం చూపుతుందనుకున్న బీఎస్పీ... కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది! పోలైన మొత్తం ఓట్లలో ఆప్‌ 42.01%, కాంగ్రెస్‌ 22.98%, అకాలీదళ్‌ 18.38%, భాజపా 6.60%, బీఎస్పీ 1.77% ఓట్లు సాధించాయి. నోటాకు 0.71% ఓట్లు పోలయ్యాయి. పంజాబ్‌లో విజయంతో భాజపా, కాంగ్రెస్‌ల తర్వాత దేశంలో రెండు చోట్ల అధికారంలో ఉన్న మూడో పార్టీగా ఆప్‌ అవతరించింది. ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌ మాన్‌ ధురీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 58,206 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి దల్వీర్‌సింగ్‌ గోల్డీపై విజయం సాధించారు.

ఓటమి తప్పని ప్రముఖులు...

ఆప్‌ ధాటికి ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ సహా పలువురు ప్రముఖులకు ఓటమి తప్పలేదు. చన్నీ రెండు చోట్ల పోటీచేసినా విజయం మాత్రం కరుణించలేదు! బదౌర్‌ స్థానంలో ఆప్‌ అభ్యర్థి లబ్‌సింగ్‌ ఉగోక్‌ చేతిలో 37,558 ఓట్ల తేడాతో; చమ్‌కౌర్‌ సాహిబ్‌లో అదే పార్టీకి చెందిన చరణ్‌జీత్‌సింగ్‌ చేతిలో 7,942 ఓట్ల తేడాతో ఆయన ఓటమిపాలయ్యారు.

* శిరోమణి అకాలీదళ్‌ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ (94).. ముక్త్‌సర్‌ జిల్లాలోని తన సంప్రదాయ లంబి స్థానం నుంచి బరిలో దిగి, ఆప్‌ అభ్యర్థి గుర్మీత్‌సింగ్‌ ఖుదియాన్‌ చేతిలో 11,396 ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు.

* అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ కూడా జలాలాబాద్‌ నియోజకవర్గంలో చీపురు పార్టీ అభ్యర్థి జగ్‌దీప్‌ కంబోజ్‌పై 30,930 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

* మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్‌ లోక్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌సింగ్‌ను కూడా ఆప్‌ అభ్యర్థే ఓడించారు. పటియాలా (అర్బన్‌) స్థానంలో అజిత్‌పాల్‌సింగ్‌ చేతిలో ఆయన 19,873 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

* పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి, ఆప్‌ అభ్యర్థి జీవన్‌జోత్‌ కౌర్‌ చేతిలో 6,591 ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు. డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పలువురు మంత్రులు, అకాలీదళ్‌ సీనియర్‌ నేత బిక్రమ్‌సింగ్‌ మజీఠియా తదితరులు కూడా ఓటమి చవిచూశారు.


భగత్‌సింగ్‌ పూర్వీకుల గ్రామంలో ప్రమాణ స్వీకారం...

పంజాబ్‌ సీఎంగా భగవంత్‌మాన్‌.. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ స్వగ్రామమైన ఘట్కర్‌కలన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మాన్‌ గురువారం వెల్లడించారు. తాను రాజ్‌భవన్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని తెలిపారు. ఆ తేదీని త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలు ఎక్కడా ఉండవని.. ఆ స్థానంలో భగత్‌సింగ్‌, అంబేడ్కర్‌ చిత్రాలు ఉంటాయని పేర్కొన్నారు.


ఇది విప్లవం: కేజ్రీవాల్‌

పంజాబ్‌లో తమ పార్టీ ఘన విజయాన్ని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ‘విప్లవం’గా అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌తో తాను కలిసి ఉన్న చిత్రాన్ని ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు తమ పార్టీ ప్రత్యామ్నాయం కానుందని ఆప్‌ నేత రాఘవ్‌చద్దా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని