Raitu Nestam: ఉచితాలతో ప్రజలకు మేలు కలగదు

రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ప్రభుత్వాల పథకాలు ఉండాలని, జనాకర్షక పథకాలపై దృష్టి పెట్టి.. ఉన్న డబ్బును ఎక్కువగా వాటికి ఖర్చుపెడితే సమస్య పరిష్కారం

Updated : 31 Oct 2021 05:53 IST

దీర్ఘకాలిక చేయూత అందించే పథకాలు అవసరం

రైతులకు కావాల్సింది 12 గంటల నాణ్యమైన, నిరాటంక విద్యుత్తు

‘రైతునేస్తం’ పురస్కారాల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డికి జీవిత సౌఫల్య పురస్కారం అందజేస్తున్న

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కామినేని శ్రీనివాస్‌, మంత్రి కన్నబాబు

ఈనాడు, అమరావతి: రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ప్రభుత్వాల పథకాలు ఉండాలని, జనాకర్షక పథకాలపై దృష్టి పెట్టి.. ఉన్న డబ్బును ఎక్కువగా వాటికి ఖర్చుపెడితే సమస్య పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ‘ఉచితాలు, తాత్కాలిక జనాకర్షక పథకాలతో ప్రజలకు మేలు కలగదని 50 ఏళ్ల ప్రజాజీవితంలో నేను గమనించాను. ఇబ్బందిగా ఉన్నవారికి ఆహారం పెట్టాలి, ఉచితంగా బియ్యం ఇవ్వాలి.. అందులో అనుమానం లేదు. కానీ ఈ దేశంలో రేషన్‌ కార్డులు ఉన్నవారంతా పేదవాళ్లేనా? అనేది మనమంతా ఆలోచించుకోవాలి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటు దీర్ఘకాలికంగా వారికి చేయూతనందించేలా పథకాలు చేపట్టాలి’ అని సూచించారు. విజయవాడ సమీపంలోని ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో ముప్పవరపు ఫౌండేషన్‌, రైతునేస్తం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఐవీ సుబ్బారావు రైతునేస్తం పురస్కారాలు-2021’ ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు, గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నా లెక్కలో రైతుకు కావాల్సింది ఉచిత విద్యుత్తు కాదు.. 10-12 గంటల నాణ్యమైన, నిరాటంకమైన విద్యుత్తు.. ఇలా చెబితే రైతులు బాధపడతారని కొందరు అంటున్నారు. నేనూ రైతుబిడ్డనే’ అన్నారు. ‘రైతు తన ఉత్పత్తులను పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకునేందుకు, అక్కడి వారు పల్లెలకు వచ్చి కొనుక్కునేందుకు కావాల్సిన రవాణా సౌకర్యం కల్పించాలి. శీతల గోదాములు, శీతల వాహనాలు అందుబాటులోకి తేవాలి.. ఇవీ రైతు అనుకూల చర్యలంటే’ అని స్పష్టం చేశారు.

వ్యవసాయానికి సాయం పెరగాలి

‘రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం తలెత్తుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్న క్రమంలో రైతులకు చేయూత అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. వ్యవసాయ రంగంలో సవాళ్లు ఎక్కువగా ఉన్నాయి.. సాయం కూడా ఎక్కువగా ఉండాలి’ అని వెంకయ్యనాయుడు సూచించారు. ‘కొవిడ్‌ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. రష్యా సహా పలుదేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. అందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. కరోనా సమయంలో అన్ని రంగాలూ ఆటుపోట్లకు గురైనా.. రైతులు తమ అకుంఠిత దీక్షతో వ్యవసాయ ఉత్పత్తిని పెంచారు. వారికి జేజేలు’ అని చెప్పారు. ‘వ్యవసాయరంగ అభివృద్ధికి అన్నదాత సహా వివిధ పత్రికలు చేస్తున్న కృషిని అభినందిస్తున్నా. దినపత్రికలూ కొంతభాగాన్ని వ్యవసాయానికి కేటాయిస్తున్నాయి. ఇంకా ఎక్కువగా కేటాయించాలి’ అని సూచించారు. ‘మన నాటుకోడి పులుసు, రాగి సంగటి ముందు మరేదీ సాటిరాదు..’ అన్నారు.

రైతు భరోసా కేంద్రాల్ని సందర్శించండి

ఉన్నత విద్యావంతులు వ్యవసాయం బాట పట్టడం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ‘వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖవ్యూహంతో ప్రణాళికలు రూపొందించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించేలా మౌలిక వసతుల కల్పనపైనా దృష్టి సారించాం’ అని వివరించారు. రైతు భరోసా కేంద్రాలను సందర్శించాలని ఉపరాష్ట్రపతిని కోరారు. రైతునేస్తం ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా పురస్కారాలు అందిస్తున్నామని పత్రిక ఎడిటర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు చెప్పారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను పురస్కారాలకు ఎంపిక చేస్తున్నామని, చాలామంది వరి నుంచి చిరు ధాన్యాలకు మారుతున్నారని వివరించారు.

సారంపల్లి మల్లారెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం

అఖిలభారత కిసాన్‌సంఘ్‌ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డిని జీవితసాఫల్య పురస్కారం, రైతాంగ సమాఖ్య(ఆంధ్రప్రదేశ్‌) నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌ను ‘కృషిరత్న’ బిరుదుతో సత్కరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కృషి చేసిన పలువురికి అవార్డులు అందించారు. 16 మంది రైతులు, 10 మంది శాస్త్రవేత్తలతోపాటు విస్తరణ విభాగం నుంచి 9 మంది, వ్యవసాయ జర్నలిజం విభాగం నుంచి అయిదుగురికి పురస్కారాలు అందించారు.

ఎర్నేని నాగేంద్రనాథ్‌కి కృషిరత్న బిరుదు ప్రదానం చేస్తున్న వెంకయ్యనాయుడు.

చిత్రంలో రైతునేస్తం ఎడిటర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు,

పుస్తకాలను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

రైతునేస్తం పురస్కారాల ప్రత్యేక సంచికతోపాటు గ్రాస్‌ జనరల్‌ ఆఫ్‌ సదరన్‌ ఇండియా, లాభదాయకంగా నాటుకోళ్ల పెంపకం, మిద్దెతోట పుస్తకాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, మాజీ మంత్రి, స్వర్ణభారత్‌ ట్రస్టు ఛైర్మన్‌ డాక్టరు కామినేని శ్రీనివాస్‌ తదితరులు ఆవిష్కరించారు.
 

ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కార గ్రహీతల వివరాలు

జీవిత సాఫల్య పురస్కారం - సారంపల్లి మల్లారెడ్డి, ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు

కృషిరత్న బిరుదు - ఎర్నేని నాగేంద్రనాథ్‌, రైతాంగ సమాఖ్య (ఆంధ్రప్రదేశ్‌) నాయకుడు

రైతు విభాగం

అప్పన్నగారి యశోదమ్మ, చిన్నార్సుపల్లి, కడప జిల్లా

మీసాల రామకృష్ణ, నందివెలుగు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా

పల్లబోతుల శబరినాథ్‌, ఎ.కొండూరు, కృష్ణా జిల్లా

డాక్టరు మంచిపల్లి శ్రీరాములు, తోటపల్లి, పార్వతీపురం డివిజన్‌, విజయనగరం జిల్లా

ఒబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి, గుండుగొలను కుంట, ద్వారకాతిరుమల మండలం, పశ్చిమగోదావరి జిల్లా

పోసిన వెంకట అప్పాజీ, రావికంపాడు, తొండంగి మండలం, తూర్పుగోదావరి జిల్లా

పనపల హరికృష్ణారెడ్డి, దాసరాపల్లి, పెనుమూరు మండలం, చిత్తూరు జిల్లా

ముప్పాల అశోక్‌రాజు, నాగరాజుపల్లి, రామాపురం మండలం, కడప జిల్లా

వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఆరుట్ల, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

పుట్టా జనార్దన్‌రెడ్డి, పరడ, కట్టంగూర్‌ మండలం, నల్గొండ జిల్లా

కరుటూరి పాపారావు, జైతాపూర్‌, ఎడపల్లి మండలం, నిజామాబాద్‌ జిల్లా

దీప్యరెడ్డి, లింగారెడ్డి, మాదాపూర్‌, హైదరాబాద్‌

అనుముల రామిరెడ్డి, ముత్తగూడెం, ఖమ్మం జిల్లా

కె.మల్‌రెడ్డి, కొత్తగడి, వికారాబాద్‌ జిల్లా

భైరపాగ రాజు, గుమ్మకొండ, చిమ్మాజిపేట్‌ మండలం, నాగర్‌కర్నూలు జిల్లా

మావురం మల్లికార్జునరెడ్డి, కుర్మపల్లి, చొప్పదండి మండలం, కరీంనగర్‌ జిల్లా

శాస్త్రవేత్తల విభాగం

డాక్టరు ఏవీ రామాంజనేయులు, సీనియర్‌ శాస్త్రవేత్త (అగ్రానమీ), ఏఆర్‌ఎస్‌, పీజేటీఎస్‌ఏయూ, తోర్నాల

డాక్టరు ఎన్‌బీవీ చలపతిరావు, ప్రధాన శాస్త్రవేత్త (ఎంటమాలజీ), హెచ్‌ఆర్‌ఎస్‌, అంబాజీపేట, తూర్పుగోదావరి జిల్లా

ఆచార్య జంపాల వెంకటరమణ, ప్రొఫెసర్‌, పశువైద్య కళాశాల, గన్నవరం, కృష్ణా జిల్లా

డాక్టరు జి.చిట్టిబాబు, శాస్త్రవేత్త (క్రాప్‌ ప్రొటెక్షన్‌), కేవీకే, ఆముదాలవలస, శ్రీకాకుళం జిల్లా

డాక్టరు ఎన్‌.మల్లికార్జునరావు, ప్రధాన శాస్త్రవేత్త (ప్రోగ్రాం కోఆర్డినేటర్‌), కేవీకే, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా

డాక్టరు ఎం.శంకరయ్య, ప్రధాన శాస్త్రవేత్త (సాయిల్‌ సైన్స్‌), కేవీకే, కంపాసాగర్‌, పీజేటీఎస్‌ఏయూ, నల్గొండ జిల్లా

డాక్టరు యు.రాజ్‌కుమార్‌, ప్రధానశాస్త్రవేత్త, కోళ్ల పరిశోధనా స్థానం, హైదరాబాద్‌

డాక్టరు ఆకుల వెంకట ఉమాకాంత్‌, ప్రధాన శాస్త్రవేత్త, ఐఎంఆర్‌సీ, హైదరాబాద్‌

డాక్టరు సర్వేపల్లి విజయకుమార్‌, ఎస్‌ఎంఎస్‌, కేవీకే, క్రీడా, హైదరాబాద్‌

డాక్టరు కె.మధుబాబు, ప్రొఫెసర్‌ (ఎక్స్‌టెన్షన్‌), పీజేటీఎస్‌ఏయూ, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌

విస్తరణ విభాగం

డాక్టరు వైవీ మల్లారెడ్డి, ఏఎఫ్‌ ఎకాలజీ కేంద్రం, అనంతపురం

డాక్టరు సీహెచ్‌ శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు, పశుసంవర్థకశాఖ, గుంటూరు

గుత్తికొండ మాధవి, టెర్రస్‌ గార్డెనర్‌, విశాఖపట్నం

రావూరి వెంకటేశ్వరరావు (ఏడుకొండలు), పశుసంవర్థక సేవలు, తిక్కిరెడ్డిపాలెం, గుంటూరు జిల్లా

అన్న మణిరత్నం, టెర్రస్‌ గార్డెనర్‌, మచిలీపట్నం, కృష్ణా జిల్లా

కొప్పుల అశోక్‌, వ్యవసాయ పనిముట్లు, ఇర్లపాడు, నాదెండ్ల మండలం, గుంటూరు జిల్లా

ఎ.శాంతి ధీరజ్‌, టెర్రస్‌ గార్డెనర్‌, బోడుప్పల్‌, హైదరాబాద్‌

కె.శివప్రసాద్‌, డీడీఏ, వ్యవసాయశాఖ, హైదరాబాద్‌

వన్నోజు సుధాకర్‌, పీఆర్‌ఓ, పీజేటీఎస్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌

వ్యవసాయ జర్నలిజం విభాగం

వలేటి గోపీచంద్‌ (ఆకాశవాణి) హైదరాబాద్‌

కొడిపెల్లి పురుషోత్తం రెడ్డి (ఈనాడు), అర్సపల్లి, జగిత్యాల జిల్లా

శ్రీనివాస మోహన్‌ వేలమూరి (ఈటీవీ), తాడిగడప, కృష్ణా జిల్లా

మొలుగూరి గోపయ్య (సాక్షి), నడిగూడెం, సూర్యాపేట జిల్లా

సూర్యదేవర నవీన్‌బాబు (ఆంధ్రజ్యోతి), ప్రకాశం జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని