Sugar cane: తిరగబడ్డ చెరకు రైతు

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందేవరకూ ఆందోళన... వచ్చిన పంటకు మద్దతు ధరపై ఆవేదన... అమ్మిన పంటకు ఏళ్ల తరబడి నగదు అందక అన్నదాతకు కన్నీరే మిగులుతోంది. బకాయిలు చెల్లించాలంటూ విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం వద్ద చెరకు రైతుల ఆందోళన బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతు నాయకుల అరెస్టుకు నిరసనగా పోలీసులపై ఎదురుతిరగడంతో

Updated : 04 Nov 2021 05:09 IST

బకాయిలు చెల్లించాలంటూ కర్మాగారం వద్ద ఆందోళన

కొబ్బరిమట్టలతో పోలీసులపై ఎదురుతిరిగిన అన్నదాతలు

విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర

కర్మాగారం వద్ద రాష్ట్ర రహదారిపై ఆందోళన చేస్తున్న అన్నదాతలు

సీతానగరం, న్యూస్‌టుడే: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందేవరకూ ఆందోళన... వచ్చిన పంటకు మద్దతు ధరపై ఆవేదన... అమ్మిన పంటకు ఏళ్ల తరబడి నగదు అందక అన్నదాతకు కన్నీరే మిగులుతోంది. బకాయిలు చెల్లించాలంటూ విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం వద్ద చెరకు రైతుల ఆందోళన బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతు నాయకుల అరెస్టుకు నిరసనగా పోలీసులపై ఎదురుతిరగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. గత రెండు సీజన్లకు సంబంధించి కర్మాగారం పరిధిలోని 2400 మంది రైతులకు యాజమాన్యం రూ.16.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో పలు గ్రామాల రైతులు ర్యాలీగా కర్మాగారం ప్రధానద్వారం వద్దకు చేరుకుని ఎదుట నిరసన చేపట్టారు. యాజమాన్యం, ప్రభుత్వ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు సమీపంలోని
36వ రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో పార్వతీపురం-బొబ్బిలి మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను చెదరగొట్టారు. రైతుసంఘం రాష్ట్ర నాయకుడు కృష్ణమూర్తి, మరో అయిదుగుర్ని అరెస్టు చేసి బొబ్బిలి పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరికొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. ఆగ్రహించిన రైతులు చేతికి దొరికిన మట్టిపెళ్లలు, కొబ్బరిమట్టలతో పోలీసులపై దాడికి దిగారు. సీతానగరం ఎస్సై బి.మురళి, మహిళా కానిస్టేబుల్‌ పద్మలకు గాయాలయ్యాయి. వారిని బొబ్బిలి, పార్వతీపురం ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. రైతుల ఆగ్రహాన్ని గుర్తించి, అక్కడ మిగిలిన పోలీసులు కర్మాగారంలోకి పరుగులు తీశారు. వర్షం పడుతున్నా రైతులు పరదాలు కప్పుకొని మరీ నిరసన తెలిపారు. సుమారు అయిదు గంటల తర్వాత జేసీ కిశోర్‌కుమార్‌, బొబ్బిలి డీఎస్పీ మోహనరావు రైతు నాయకులతో చర్చించడంతో శాంతించారు. జనవరి 15 లోగా బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జేసీ రైతులకు హామీ ఇవ్వగా అందుకు వారు అంగీకరించలేదు. 5న పార్వతీపురం డివిజన్‌లోని మండల కేంద్రాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు.

పోలీసులపై మట్టిపెళ్లలు, కొబ్బరిమట్టలతో ఎదురుతిరుగుతున్న చెరకు రైతులు

రైతులపై లాఠీఛార్జి హేయం: సీపీఎం

విజయవాడ (అలంకార్‌ కూడలి), న్యూస్‌టుడే: సీతానగరం షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిల కోసం ఆందోళన చేపట్టిన రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం హేయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యాజమాన్యం వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు. రైతులపై కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

పోలీసులతో రైతుల వాగ్వాదం

మట్టి పెళ్లలు విసురుతున్న మహిళా రైతులు


చెరకు రైతుకు.. బకాయిల చేదు

ఈనాడు, అమరావతి: మొత్తం కలిపి రూ.90 కోట్లు.. ప్రభుత్వం కరుణిస్తే 10వేల మంది చెరకు రైతుల బకాయిలు తీరిపోతాయి. రోడ్డెక్కి ఆందోళనలు.. ఆప్పులు తీర్చలేక అవమానాలు కర్షకులకు ఉండవు. నిశ్చింతగా పొలానికి వెళ్లి పంట పండించుకుంటారు. అధికారులు ఇదిగో అదిగో అని సాగదీస్తుండటంతో.. కొన్ని చెరకు కర్మాగారాలు పంచదారను అమ్ముకుని, తర్వాత నష్టం వచ్చిందని చేతులెత్తేస్తున్నాయి. రెండు మూడేళ్లకూ పంట సొమ్ము అందకపోవడంతో అప్పులు తెచ్చి చెరకు పండించిన రైతులకు అసలుతో పాటు వడ్డీభారం పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు కర్మాగారాల్లో రెండు మూడేళ్లుగా బకాయిలు పేరుకుపోయాయి. నెలలు, ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునేవారు లేక.. రైతులు రోడ్డెక్కుతున్నారు. కొన్నిచోట్ల న్యాయస్థానాలనూ ఆశ్రయిస్తున్నారు.

ఎకరాకు రూ.50వేల పెట్టుబడి.. రెండేళ్ల ఎదురుచూపు: ఎకరా చెరకు సాగుకు రూ.50వేల పెట్టుబడి పెడితే.. 30-40 టన్నుల దిగుబడి వస్తుంది. కర్మాగారానికి తోలిన తర్వాత 20 రోజులకైనా సొమ్ము వస్తుందనే ఆలోచనతో.. ప్రైవేటు వ్యాపారుల వద్ద వడ్డీలకు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. రైతుల నుంచి చెరకు తీసుకుంటున్న కొన్ని కర్మాగారాలు చెల్లింపులతోపాటు చెరకు గానుగ ఆడటం నిలిపేస్తున్నారు. దీంతో అప్పులు తీర్చలేకపోగా.. మళ్లీ పంట వేసే పరిస్థితి ఉండటం లేదు. వేసినా.. ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. సమీపంలోని కర్మాగారానికి తీసుకెళ్లినా ధరలో కోత పెట్టి తీసుకుంటున్నారు.

* క్రషింగ్‌, చక్కెర దిగుబడి, చెల్లింపులపై చెరకు శాఖ పర్యవేక్షించాలి. 15 రోజుల్లోగా చెల్లింపులు చేయకపోతే.. సంబంధిత సంస్థపై చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఆస్తుల్ని వేలం వేసి.. రైతులకు చెల్లింపులు చేయాలి. అదీ అమలు కావడం లేదు.

అప్పులోళ్లకు సమాధానం చెప్పలేక

చిత్తూరు జిల్లా నిండ్రలోని నేటం షుగర్స్‌ పరిధిలో 2019-20లో చెరకు తోలినవారికి రెండేళ్లుగా రూ.36 కోట్ల బకాయిలు చెల్లించలేదు. దీంతో 2020-21లో రైతులు చెరకు తోలలేదు. క్రషింగ్‌ నిలిచింది. బకాయిలు ఇప్పించాలని రెండేళ్లుగా రైతులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయింది. ‘102 టన్నుల చెరకు తోలాను. రూ.3 లక్షలు రావాలి. కోత ఖర్చులకు అప్పు చేసి చెల్లించాల్సి వచ్చింది. ప్రైవేటు అప్పులు పెరిగిపోతున్నాయి. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం. బ్యాంకు వాళ్లు ఇంటికి వచ్చి ఎప్పుడు చెల్లిస్తావని అడుగుతున్నారు.. పిల్లల చదువులకూ ఇబ్బందులు పడుతున్నాం’ అని నేతాజీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు బి.నారాయణస్వామిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు.

అంతా చిన్న రైతులమే

విజయనగరం జిల్లాలోని ఎన్‌సీఎస్‌ షుగర్స్‌ పరిధిలో 2019-20, 2020-21 సంవత్సరాల బకాయిలు చెల్లించాలి. అందరూ చిన్న, సన్నకారు రైతులే. దొరికిన చోట అప్పు తెచ్చి పంటకు పెట్టుబడి పెట్టారు. వాటికి వడ్డీలు పెరుగుతున్నాయి. ‘అయిదెకరాలు కౌలుకు తీసుకుని యజమానికి ముందుగా రూ.లక్ష చెల్లించాను. చెరకు బకాయిలు రూ.4 లక్షలు రావాలి. ఇన్నాళ్ల పాటు చెల్లించకపోతే ఎలా బతకాలి?’ అని ప్రశ్నించారు.


ఎలా బతకాలి?

ఏడాదంతా కష్టపడి పండించినా... పంట డబ్బు రెండు మూడేళ్లకూ రాకపోతే రైతు ఎలా బతకాలి? అప్పులెలా తీర్చాలి? వడ్డీభారం ఎవరు భరించాలి? ప్రభుత్వమూ పట్టించుకోకపోతే.. మా గోడు వినేదెవరు?

- చెరకు రైతుల ఆవేదన


రూ.30 కోట్లు ఓ లెక్కా?

చిత్తూరు జిల్లాలోనే సూదలగుంట షుగర్స్‌ యాజమాన్యం రైతులకు 2018-19 బకాయిల్ని ఇప్పటికీ చెల్లించలేదు. ఇక్కడా న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి ‘అయిదెకరాల్లో చెరకు సాగు చేశాను. మొదటివిడత పంట డబ్బు రూ.2.9 లక్షలు చెల్లించలేదు. ఇది మూడో సంవత్సరం.. అయినా పైసా అందలేదు. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇప్పించినట్లు మాకూ ప్రభుత్వమే చెల్లించి తర్వాత ఆర్‌ఆర్‌ చట్టం ప్రకారం వసూలు చేసుకోవచ్చుగా? రూ.30 కోట్లు ప్రభుత్వానికి లెక్కా?’ అని రైతు రాజేశ్‌ పేర్కొన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని