Lakhimpur Kheri Case: ఈ జాప్యం ఉద్దేశపూర్వకం అనిపిస్తోంది

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరి ఘటన దర్యాప్తు తీరుపట్ల సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రస్తుత పరిస్థితులను బట్టిచూస్తే ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు అనిపిస్తోందని, ఆ అభిప్రాయాన్ని మార్చేలా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించింది

Updated : 24 Sep 2022 16:28 IST

ఆ అభిప్రాయం ముందు పోగొట్టండి
లఖింపుర్‌ ఖేరి కేసులో నిలదీసిన సుప్రీంకోర్టు
విచారణ అంతులేని కథలా సాగకూడదు
బాధితులకు, సాక్షులకు భద్రత కల్పించండి: సీజేఐ జస్టిస్‌ రమణ

ఈనాడు, దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరి ఘటన దర్యాప్తు తీరుపట్ల సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రస్తుత పరిస్థితులను బట్టిచూస్తే ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు అనిపిస్తోందని, ఆ అభిప్రాయాన్ని మార్చేలా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించింది. సాక్షుల నుంచి సెక్షన్‌-164 కింద వాంగ్మూలాల నమోదును వేగవంతం చేయాలని, వారికి తగిన భద్రత కల్పించాలని ఆదేశించింది. అక్టోబరు 3న జరిగిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌మిశ్ర కుమారుడు ఆశీష్‌ మిశ్ర వాహనాలు దూసుకెళ్లడం వల్ల నలుగురు రైతులు మృతి చెందడం, అనంతరం జరిగిన ప్రతీకార హింసలో మరో నలుగురు చనిపోయిన ఘటనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లీల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరఫున స్థాయీ నివేదికను సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే సమర్పించారు. 44 మంది సాక్షుల్లో నలుగురి వాంగ్మూలాలను సెక్షన్‌-164 కింద జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ సమక్షంలో నమోదు చేశామని చెప్పారు. ‘మిగిలిన సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. నిందితుల పట్ల అధికారులు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారన్న భావన ధర్మాసనం నుంచి ఇదివరకు వ్యక్తమైంది. ఇప్పుడు అందర్నీ అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు’ అని వివరించారు. ఇంతవరకు పదిమందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఘటన సమయంలో పెద్దసంఖ్యలో రైతుల గుంపు ఉన్నందున ఎవరేం చేశారన్న అంశంపై విచారణ చేపట్టడం కష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

రెండుగా విభజించి విచారించండి: సీజేఐ
యూపీ వాదనపై సీజేఐ స్పందిస్తూ.. రైతులపైకి వాహనం నడపడం, ఆ తర్వాత రైతులు కొందర్ని కొట్టి చంపడం అనే రెండు కేసులను విభజించి, వేర్వేరుగా విచారణ చేపట్టాలని సూచించారు. స్థాయీ నివేదిక కోసం మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు తాము ఎదురుచూసినా రాలేదని, కేసు విచారణకు ముందు సీల్డ్‌ కవర్లో అందించారని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు, అరెస్టులు వంటి అంశాలపై వాదప్రతివాదనలు జరిగాయి. ఒక దశలో జస్టిస్‌ రమణ స్పందిస్తూ ‘ఇది అంతులేని కథలా ఉండకూడదు’ అన్నారు. జ్యుడీషియల్‌ కస్టడీలో, పోలీసు కస్టడీలో ఎంతమంది ఉన్నారో తెలియాలని, వారందర్నీ విచారిస్తే గానీ పోలీసులకు సమాచారం రాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారం వ్యవధి ఇస్తే కేసు తాజా పరిస్థితి వివరిస్తామని హరీశ్‌సాల్వే చెప్పారు. సాక్షులందరి వాంగ్మూలాలు తీసుకోవాలని.. వారికి, బాధితులకు భద్రత కల్పించాలని సీజేఐ ఆదేశించారు. తదుపరి విచారణను 26కువాయిదా వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని