TTD: విరులతో సిరులు

తిరుమలతో పాటు స్థానిక ఆలయాల్లో నిత్యం పెద్ద ఎత్తున పుష్పాలను వినియోగిస్తారు. అనంతరం వీటిని నిరుపయోగంగా పడేయకుండా వాటితో తితిదే పలు ఉత్పత్తులను తయారు చేయిస్తోంది. భక్తులకు

Updated : 19 Feb 2022 05:42 IST

ఆలయాల్లో వినియోగించిన పూలతో ఉత్పత్తులు

నూతన ఒరవడికి తితిదే శ్రీకారం

తిరుమలతో పాటు స్థానిక ఆలయాల్లో నిత్యం పెద్ద ఎత్తున పుష్పాలను వినియోగిస్తారు. అనంతరం వీటిని నిరుపయోగంగా పడేయకుండా వాటితో తితిదే పలు ఉత్పత్తులను తయారు చేయిస్తోంది. భక్తులకు స్వామివారిని దగ్గరకు చేర్చడంతో పాటు ఇటు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలు అందిస్తున్నాయి. గతంలో ఆలయాల్లో వినియోగించిన పూలను ఎవరూ తొక్కని ప్రదేశంలో ఉంచేవారు. వీటిని పునర్వినియోగించడం ద్వారా అగరుబత్తీలను తయారు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన దర్శన ఇంటర్నేషనల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 10 యంత్రాల ద్వారా రోజుకు సుమారు 3.50 లక్షల అగరుబత్తీలను తయారు చేస్తున్నారు. సప్తగిరులను ప్రతిబింబించేలా ఏడు బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు. తొలుత శ్రీవారికి వినియోగించిన పూలను మినహా మిగిలినవి ఉపయోగించారు. ఆ తర్వాత ఆగమ సలహా మండలి నిర్ణయం మేరకు వాటిని కూడా అగరుబత్తీల తయారీకి వాడుతున్నారు.


డ్రైఫ్లవర్‌ టెక్నాలజీతో..

ఆలయాల్లో వినియోగించిన పూలతోనే స్వామి, అమ్మవార్ల ఫొటోలు తయారు చేసేందుకు వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన సిట్రాస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌లో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఫొటోలతో పాటు క్యాలెండర్లు, కీ చెయిన్లు, పేపర్‌ వెయిట్‌లు, రాఖీలు, డ్రై ఫ్లవర్‌ మాలల తయారీపై తర్ఫీదు ఇచ్చారు.


పంచగవ్య ఉత్పత్తులు..

‘నమామి గోవింద’ పేరుతో 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్‌ ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక సహకారంతో వీటిని ఉత్పత్తి చేశారు. గో మూత్రం, గోమయం ద్వారా వీటిని రూపొందిస్తున్నారు. ఇందులో హెర్బల్‌ సబ్బు, పండ్ల పొడి, షాంపూ, అగరుబత్తీలు, దూప్‌ చూర్ణం ఇలా పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. గోమయం, మూత్రం ద్వారా జీవామృతం, ఘనామృతాలను తయారు చేసి తితిదే ఉద్యాన వనాల్లో వినియోగిస్తోంది. ఎక్కడా వ్యర్థం అనేది లేకుండా సాధ్యమైనంత మేరకు వాటిని పునరుత్పాదక వస్తువులుగా తీర్చిదిద్దుతున్నట్లు తితిదే అధికారులు స్పష్టం చేస్తున్నారు.


- ఈనాడు, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని