Ukraine: మీ సమస్యపై కేంద్రానికి లేఖ

ఉక్రెయిన్‌ నుంచి చదువు మధ్యలో వచ్చేసిన రాష్ట్ర విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం కేంద్రానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు సూచించారు. ఈ విద్యార్థులు

Updated : 22 Mar 2022 05:14 IST

చదువు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది

ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులతో ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉక్రెయిన్‌ నుంచి చదువు మధ్యలో వచ్చేసిన రాష్ట్ర విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం కేంద్రానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు సూచించారు. ఈ విద్యార్థులు చదువు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చెప్పారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన పలువురు విద్యార్థులు సోమవారం అసెంబ్లీలోని కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఉక్రెయిన్‌ నుంచి ఎలా తీసుకురాగలిగామనే విషయంపై సీఎం వారికి (విద్యార్థులకు) వివరించారు. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో రాష్ట్ర అధికార యంత్రాంగం చేసిన కృషిని ఆయన అభినందించారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. వారు ఉక్రెయిన్‌లో చేస్తున్న కోర్సులు, వాటిని కొనసాగించేందుకు ఉన్న ప్రత్యామ్నాయ అవకాశాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. కోర్సులను పూర్తి చేయడంలో ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చేటప్పుడు రాష్ట్రం నుంచి అందిన సహకారం గురించి పలువురు విద్యార్థులు సీఎంతో పంచుకున్నారు. ‘ఉక్రెయిన్‌ సమీప దేశాలకు చేరుకున్నాక అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చేంతవరకు ఆహారం, వసతి.. ఇలా అన్ని విషయాల్లోనూ బాగా చూసుకున్నారు. భారత్‌కు చేరుకున్నాక విమానాశ్రయంలో వీవీఐపీల్లా మమ్మల్ని స్వాగతించారు. మా స్వస్థలాలకు చేరుకునేంతవరకు విమాన టికెట్లు, వసతి వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీకు ధన్యవాదాలు’ అని సీఎంతో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఉక్రెయిన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబు, కమిటీ సభ్యుడు అహ్మద్‌ బాబు, దిల్లీలోని ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌, ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు మేడపాటి వెంకట్‌, సీఈవో కె.దినేష్‌కుమార్‌, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌, యూకేలో ప్రత్యేక ప్రతినిధి రవిరెడ్డి పాల్గొన్నారు.


మహిళల క్షేమం... సంక్షేమమే లక్ష్యం

రాష్ట్రంలో ‘ప్రతి మహిళా క్షేమం... ప్రతి మహిళా సంక్షేమం’ అనే నినాదంతో ముందుకెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ దిశానిర్దేశం చేశారు. ప్రతి గడపకూ ‘దిశ’ చేరేలా... ప్రతి మహిళా దిశ యాప్‌ వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు దిశ యాప్‌, దిశ చట్టం అమలుపై అసెంబ్లీలోని ఛాంబర్‌లో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘దిశ యాప్‌ నొక్కగానే వెంటనే స్పందించాలి. అతి తక్కువ సమయంలో ప్రమాద స్థలికి చేరి బాధితులకు సాయం అందించాలి. దిశ పీఎస్‌కు వచ్చే ప్రతి కేసునూ నిందితులకు శిక్ష పడేవరకు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. కేసు నిరూపితమయ్యే దిశగా త్వరితగతిన ఆధారాలు సేకరించాలి. గ్రామ వాలంటీర్‌, మహిళా పోలీసులను భాగస్వామ్యం చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి హైపవర్‌ కమిటీ సమీక్షించాలి. యాప్‌ ద్వారా వచ్చే కాల్స్‌, కేసుల్లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా... కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని