Uttarakhand Election Results 2022: ఉత్తరాఖండ్‌లో భాజపా విజయఢంకా

ఉత్తరాఖండ్‌లో పోరు హోరాహోరీగా ఉంటుందన్న అంచనాలు తారుమారయ్యాయి. ఈ పర్వత రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఘనవిజయం నమోదు చేసింది. వరుసగా రెండోసారి అధికార పగ్గాలను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.

Updated : 11 Mar 2022 06:13 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో పోరు హోరాహోరీగా ఉంటుందన్న అంచనాలు తారుమారయ్యాయి. ఈ పర్వత రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఘనవిజయం నమోదు చేసింది. వరుసగా రెండోసారి అధికార పగ్గాలను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. 70 స్థానాల శాసనసభలో 47 సీట్లతో జయకేతనం ఎగరవేసింది. 21 ఏళ్ల ఉత్తరాఖండ్‌ రాష్ట్ర చరిత్రలో అధికార పార్టీ మళ్లీ పీఠం దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ పరాజయం పాలయ్యారు. దేవభూమిగా పరిగణించే ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్‌ సీఎంలు గెలిచిన చరిత్ర లేదు. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ధామీ.. తన సొంత నియోజకవర్గం ఖటీమాలో 6,951 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి భువనచంద్ర కాప్రీ చేతిలో ఓడిపోయారు. ఉత్తరాఖండ్‌లో పాగా వేస్తామనుకున్న కాంగ్రెస్‌ ఘోరంగా చతికిల పడింది. ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను భాజపా మార్చిందంటూ ఆ పార్టీ చేసిన ప్రచారం ఓటర్లపై ప్రభావం చూపలేదు. కాంగ్రెస్‌ కేవలం 19 స్థానాల్లో విజయం సాధించింది. బహుజన్‌ సమాజ్‌ పార్టీకి రెండు, స్వతంత్రులకు రెండు దక్కాయి. పలు ఉచిత హామీలతో ఉత్తరాఖండ్‌ ఎన్నికల బరిలో దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒక్క సీటూ దక్కలేదు. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అవుతానన్న ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌కూ ఓటమి ఎదురైంది. లాల్‌కువా నియోజకవర్గంలో 17,359 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆప్‌ సీఎం అభ్యర్థి అజయ్‌ కోటియాల్‌కు గంగోత్రి నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు ధరావతు కూడా దక్కకపోవడం విశేషం. ఈ సీటును భాజపా కైవసం చేసుకుంది.

* నిజానికి ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చడం భాజపాకు ప్రతికూలంగా మారుతుందని పార్గీ వర్గాలు భయపడ్డాయి. ప్రతిపక్షాలూ దీన్నే ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. పైగా గత ఏడాది జులైలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ సీఎం బాధ్యతలు స్వీకరించారు. ఇంత తక్కువ వ్యవధిలో పార్టీ యంత్రాంగాన్ని ధామీ ఎలా సన్నద్ధత చేస్తారన్న విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు భాజపాను విజయ తీరాలకు చేర్చాయని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని