YS Jagan: జంగారెడ్డిగూడెంలో అన్నీ సహజ మరణాలే

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్నవన్నీ సహజ మరణాలే. దేశ, రాష్ట్ర గణాంకాల ప్రకారం మరణాల రేటు 2 శాతంగా వేసుకున్నా అక్కడ నెలకు కనీసం 90 మంది అనారోగ్యం, వయోభారం, ప్రమాదాలవల్ల చనిపోతుంటారు

Updated : 15 Mar 2022 07:29 IST

అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో నెలకు ఆ ఊళ్లో 90 మంది సాధారణంగానే చనిపోతుంటారు
అక్రమ మద్యంవల్ల జరిగినవే అన్నట్లు తెదేపా యాగీ చేస్తోంది  
మద్యం ధరలు తగ్గించాక.. కల్తీ మద్యం ఎందుకు ప్రబలుతుంది: సీఎం జగన్‌


పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్నవన్నీ సహజ మరణాలే. దేశ, రాష్ట్ర గణాంకాల ప్రకారం మరణాల రేటు 2 శాతంగా వేసుకున్నా అక్కడ నెలకు కనీసం 90 మంది అనారోగ్యం, వయోభారం, ప్రమాదాలవల్ల చనిపోతుంటారు. సహజ మరణాలను అక్రమ మద్యం వల్ల జరిగినవే అన్నట్లుగా తెదేపా భ్రమ కల్పిస్తోంది. ఇలాంటి అన్యాయమైన పనిని మానుకోవాలని తెదేపా సభ్యులకు సభ ద్వారా తెలియజేస్తున్నా.

- శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌


​​​​​ఈనాడు, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్నవన్నీ సహజ మరణాలేనని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దేశ, రాష్ట్ర గణాంకాల ప్రకారం మరణాల రేటు 2 శాతంగా వేసుకున్నా నెలకు కనీసం 90 మంది అనారోగ్యం, వయోభారం, ప్రమాదాలవల్ల సహజంగానే అక్కడ చనిపోతుంటారని చెప్పారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ‘జంగారెడ్డిగూడెం జనాభా 2011 లెక్కల ప్రకారం 48,994. ఈ దశాబ్ద కాలంలో 12 శాతం వృద్ధిరేటుగా తీసుకుంటే అక్కడ 54,880 మంది నివాసం ఉంటున్నారు. ఇంత పెద్ద పురపాలక సంఘంలో మరణాలు ఒకే చోట జరిగినవి కాదు. మొత్తం పురపాలక సంఘం పరిధిలో జరిగినవి. ఈ 18 మంది సహజ మరణాలను వక్రీకరించి మాట్లాడడం మనం ఇక్కడే చూస్తున్నాం. ప్రతి నెలా 60-70 మంది గుండెపోటు, అనారోగ్యాలతో సహజంగా చనిపోతుంటారు. కల్తీ మద్యం తయారు చేసేవాళ్లకు ప్రభుత్వం ఎందుకు మద్దతిస్తుంది? కల్తీ మద్యం తయారీ ఇప్పుడు కొత్తగా జరుగుతోంది కాదు.. చంద్రబాబు హయాంలోనూ  జరిగింది. అప్పుడూ ఇప్పుడూ అక్కడక్కడా జరుగుతోంది. దీన్ని నేను కాదనడం లేదు’ అని తెలిపారు.

లాభాపేక్ష వద్దనే..
‘గతంలో లాభాపేక్షతో మద్యాన్ని విచ్చలవిడిగా బెల్టు దుకాణాల ద్వారా అమ్మేవారు. బడి, గుడి పక్కన గ్రామంలో ఎక్కడపడితే అక్కడ దొరికేది. లాభాపేక్ష ఉంటే వీటిని ఆపలేమనే ఉద్దేశంతో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడుపుతోంది. గతంలో అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి, ఇష్టమొచ్చినట్లు తాగించే పరిస్థితి. ఇప్పుడు వేళలు కచ్చితంగా పాటిస్తున్నారు. నిర్ణీత సమయాల్లోనే మద్యం అందుబాటులో ఉండే పరిస్థితి తీసుకొచ్చాం. అక్రమ మద్యం తయారీని అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్‌ ఫోర్సును ఏర్పాటు చేసి, ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టమైన సంకేతాలిచ్చాం. మా తపనంతా మద్యం వినియోగాన్ని తగ్గించాలనే. అధికారంలోకి వచ్చిన వెంటనే 43వేల బెల్టు దుకాణాలను పూర్తిగా లేకుండా చేశాం. గతంలో 4,380 మద్యం దుకాణాల పక్కనే పర్మిట్‌ రూమ్‌లకు అనుమతిచ్చారు. అక్కడే 50-60 మంది కూర్చుని, మద్యం తాగుతుంటే.. మహిళలు ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడేవారు. మనం అధికారంలోకి వచ్చాక పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశాం’ అని వెల్లడించారు. ‘వినియోగదారులకు షాక్‌ కొట్టేలా మద్యం ధరలు పెంచాం. దీంతో వినియోగం తగ్గినా.. ధరలు పెంచటంతో అక్రమ మద్యం ఎక్కువగా వస్తోంది. ధరలు తగ్గిస్తేనే అక్రమ మద్యాన్ని అడ్డుకోగలమని ఎస్‌ఈబీ నివేదిక ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీలూ అదే చెప్పేసరికి సదుద్దేశంతో ధరలు తగ్గించాం. చంద్రబాబు హయాంలో ఉన్న ధరలే మళ్లీ తీసుకొచ్చాం. అలాంటప్పుడు కల్తీ మద్యం ఎలా ప్రబలుతుంది? కల్తీ మద్యం తయారీదారులను ఉక్కుపాదంతో అణిచివేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అక్రమ మద్యంపై ఎస్‌ఈబీ 13 వేల కేసులు నమోదు చేసింది. సహజ మరణాలను అక్రమ మద్యం వల్ల జరిగినవే అన్నట్లుగా భ్రమ కల్పిస్తూ నానారకాలుగా యాగీ చేయడం తప్పని, ఇలాంటి అన్యాయమైన పనిని మానుకోవాలని తెదేపా సభ్యులకు సభ ద్వారా తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.

బాధపడకండి..ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాణ్యమైన మద్యం అందేలా చూస్తా..! నాటుసారా జోలికి పోకండి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు