Updated : 15 Mar 2022 05:11 IST

YS Jagan: 1000కి పైగా ప్రాంతాలను ఏజెన్సీలో కలపాలి

అప్పుడే వాటి అభివృద్ధికి కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయి
గిరిజన ప్రాంతాలపై సీఎం జగన్‌కు ఎస్టీ ఎమ్మెల్యేల వినతి

ఈనాడు, అమరావతి: ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న అర్హత కలిగిన ప్రాంతాలను ఏజెన్సీలో (షెడ్యూల్‌ ఏరియాలో) కలపడంపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు ఎస్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు. సోమవారం అసెంబ్లీలోని కార్యాలయంలో సీఎం జగన్‌ను ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యేలు పి.రాజన్నదొర, వి.కళావతి, ఎన్‌.ధనలక్ష్మి, కె.భాగ్యలక్ష్మి, శెట్టి ఫల్గుణతోపాటు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కలిశారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 805 ప్రాంతాలు ఇలాంటివి ఉండగా వాటిని ఏజెన్సీలో కలిపేందుకు ప్రతిపాదిస్తూ కేంద్రానికి పంపారు. వాటిలో నిబంధనల ప్రకారం కొన్ని మార్పులు చేయాలని కేంద్రం వెనక్కి పంపింది. ఆ 805లో తెలంగాణలో 256 ఉండగా ఏపీలోనివి 549 ఉన్నాయి. ఆ ప్రక్రియను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ‘ఇవే కాకుండా 70శాతంపైగా గిరిజన జనాభా ఉండి ఏజెన్సీలో ఇప్పటివరకూ కలపని ప్రాంతాలు మరో 500కుపైగా గుర్తించారు. వాటిని కూడా కలిపి కేంద్రానికి పంపాలి. వీటన్నింటినీ ఏజెన్సీలో కలిపేందుకు రాష్ట్రపతి ఆమోదం పొందితే.. ఈ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయి’ అని వివరించారు. అలాగే మంచినీటి, రహదారుల మరమ్మతుల సమస్యలనూ సీఎంకు వివరించారు. వచ్చే నెల తర్వాత నిధుల విడుదలకు కొంత వెసులుబాటు వస్తుందని, పెండింగు బిల్లులను చెల్లించడంతోపాటు కొత్త పనులను చేపట్టేందుకు ఏర్పాట్లు చేద్దామని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. పార్వతీపురం జిల్లాలోనే రెండు ఐటీడీఏ ఏజెన్సీలు (పార్వతీపురం, సీతంపేట) వస్తున్నాయని.. అందువల్ల ఒకటి తొలగించాలని ఎమ్మెల్యేలు చెప్పగా.. ‘ఉన్నవాటిలో దేన్నీ తొలగించొద్దు, అవసరమైతే శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం ప్రాంతంలో కొత్తగా ఐటీడీఏ ఏర్పాటుపై ఆలోచిద్దాం’ అని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. గిరిజన ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts