Zero interest: 0 వడ్డీ చిక్కిపోయింది

సున్నా వడ్డీ పంట రుణాల పథకం చిక్కిపోతోంది. 2020 ఖరీఫ్‌లో 11 లక్షల మంది రైతులు రూ.లక్ష లోపు రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లించారని బ్యాంకులు జాబితా ఇవ్వగా..

Updated : 14 Dec 2022 10:53 IST

2019 ఖరీఫ్‌తో పోల్చితే మూడో వంతూ లేదు
7.91 లక్షల మంది.. రూ.393 కోట్లు తగ్గుదల
ఈ-పంట నిబంధనతో తగ్గిన సంఖ్య
ఈనాడు - అమరావతి

సున్నా వడ్డీ పంట రుణాల పథకం చిక్కిపోతోంది. 2020 ఖరీఫ్‌లో 11 లక్షల మంది రైతులు రూ.లక్ష లోపు రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లించారని బ్యాంకులు జాబితా ఇవ్వగా.. వారిలో 6.67 లక్షల మందికి మాత్రమే రూ.112.70 కోట్లు విడుదలైంది. 2019 ఖరీఫ్‌లో సున్నా వడ్డీకి విడుదలైన మొత్తంతో పోలిస్తే.. ఇది రూ.393 కోట్లు తక్కువ. అర్హుల సంఖ్యా 7.91 లక్షలు తగ్గింది. ఈ-పంటలో పేర్లు నమోదు చేసుకోలేకపోవడంతో మిగిలిన రైతులు అర్హత సాధించలేకపోయారని వ్యవసాయశాఖ చెబుతోంది. అనంతపురం జిల్లాలో గతేడాదితో పోలిస్తే లబ్ధిదారులు 1.57 లక్షల మంది తగ్గారు. చిత్తూరు జిల్లాలో 2019 ఖరీఫ్‌లో 32,278 మందికి సున్నా వడ్డీ వర్తింపజేయగా... 2020 ఖరీఫ్‌లో ఆ సంఖ్య 8,365కి తగ్గింది. నెల్లూరు జిల్లాలో 2019 ఖరీఫ్‌లో రూ.4.84 కోట్లు ఇస్తే.. 2020 ఖరీఫ్‌లో రూ.1.23 కోట్లకే పరిమితమైంది. కర్నూలు జిల్లాలోనూ సగానికి సగం తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.

సున్నా వడ్డీ లెక్కింపు ఇలా..

పంట రుణంపై బ్యాంకులు 7% వడ్డీ వసూలు చేస్తాయి. రూ.లక్ష రుణం తీసుకుంటే ఏడాదికి రూ.7 వేలు వడ్డీ అవుతుంది. ఇందులో కేంద్రం ఇచ్చే వడ్డీ రాయితీగా 4% మినహాయిస్తారు. కొన్ని బ్యాంకులు ముందే వసూలు చేసుకుని తర్వాత రైతు ఖాతాకు జమ చేస్తాయి. అంటే రైతు రూ.లక్షకు ఏడాదికి రూ.3 వేలు చెల్లించాలి. రైతులు ముందు చెల్లిస్తే.. తర్వాత వారి ఖాతాలకు జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ-పంట ఆధారంగానే సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేయాలని నిర్ణయించింది. రైతు రుణం తీసుకుని ఏడాదిలో చెల్లించినట్లు బ్యాంకులు ధ్రువీకరించినా సరే.. ఈ-పంటలో ఆయన పేరు లేకపోతే సున్నా వడ్డీ అందదు. దీంతో పలువురు అర్హత సాధించలేకపోయారు. ‘సహకార పరపతి సంఘం నుంచి రూ.లక్ష రుణం తీసుకుని ఏడాదిలోగానే చెల్లించాం. సున్నా వడ్డీ జమ కాలేదు’ అని నెల్లూరు జిల్లా చేజర్ల రైతు జి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా లక్ష్మమ్మాపురం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం నాయుడు.. గతేడాది ఖరీఫ్‌లో రూ.99 వేల రుణం తీసుకున్నారు. ఏడాదిలోపే చెల్లించారు. వ్యవసాయ సిబ్బంది వచ్చి ఈ-క్రాప్‌ నమోదు చేసుకుని వెళ్లారని, అయినా సున్నా వడ్డీ పడలేదన్నారు.


ఈ-పంటలో పేరు లేకుంటే సున్నా వడ్డీ రాదు

- అరుణ్‌కుమార్‌, కమిషనర్‌, వ్యవసాయశాఖ

ఈ-పంటలో పేరు లేదంటే ఆ రైతు వ్యవసాయం చేయడం లేదని,  తీసుకున్న రుణాన్ని సాగుకు వాడలేదని భావించి సున్నా వడ్డీ వర్తింపజేయరు. 2019 ఖరీఫ్‌లో ఈ-పంట నిబంధనకు సడలింపు ఇవ్వడంతో ఎక్కువ మందికి సున్నా వడ్డీ అందింది. 2020 ఖరీఫ్‌ నుంచి ఈ నిబంధన కచ్చితంగా అమలవుతుంది. రుణం తీసుకున్న పంట, నమోదైన పంట వేర్వేరుగా ఉన్నా సున్నా వడ్డీ రాదు. ఇలాంటి వారికి ఈ ఏడాదికి వెసులుబాటు కల్పించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు