Tiger: పెద్దపులిని ఢీకొన్న కారు!

వేగంగా ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు దాటుతున్న పెద్దపులిని ఢీకొట్టిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Published : 18 Jun 2024 04:58 IST

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రమాదంలో దెబ్బతిన్న కారు ముందుభాగం

మర్రిపాడు, న్యూస్‌టుడే: వేగంగా ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు దాటుతున్న పెద్దపులిని ఢీకొట్టిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. మర్రిపాడు మండలం నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కారులోని ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్‌ జిల్లా గోపవరం మండలం కాలువపల్లికి చెందిన సుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి తమ పిల్లలతో కలిసి కారులో నెల్లూరు వెళుతున్నారు. కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలోకి రాగానే వేగంగా వెళుతున్న వీరి వాహనం రోడ్డు దాటుతున్న పెద్దపులిని ఢీకొట్టింది. ఆ వేగంలో పులిని 50 మీటర్లు కారు ఈడ్చుకెళ్లింది. తీవ్రగాయాలైన పులి వాహనం ఆగిన తర్వాత లేచి అడవిలోకి వెళ్లిపోయింది. ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ డీఎఫ్‌వో ఎ.చంద్రశేఖర్, ఆత్మకూరు రేంజర్‌ శేఖర్, డీఆర్వోలు రవీంద్రవర్మ, పిచ్చిరెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులిదిగా భావిస్తున్న జంతువు పాద ముద్రల కొలతలు తీసుకున్నారు. అడవిలో గాలింపు చేపట్టినా వ్యాఘ్రం జాడ తెలియలేదు.


ఘటనా స్థలంలో జంతువు పాద ముద్రల కొలతలు తీసుకుంటున్న అధికారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు