Ramoji Rao: గొప్ప దార్శనికుడు.. రామోజీరావు

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీ నిర్మాణంతో భారత చలనచిత్ర రంగానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పెద్ద వరం అందించారని సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ అన్నారు.

Updated : 18 Jun 2024 06:10 IST

వందేమాతరం శ్రీనివాస్‌

రామోజీరావుకు నివాళులర్పిస్తున్న సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ దంపతులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీ నిర్మాణంతో భారత చలనచిత్ర రంగానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పెద్ద వరం అందించారని సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావుకు శ్రీనివాస్‌ దంపతులు నివాళులు అర్పించారు. ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు గొప్ప దార్శనికుడని.. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరని వందేమాతరం శ్రీనివాస్‌ అన్నారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా గొప్ప చిత్రాలు అందించారన్నారు. సంగీతం అంటే ఆయనకు ఎంతో ఇష్టమని... ఈనాడు, ఈటీవీ పనుల్లో తీరిక లేకున్నా ‘డాడీ.. డాడీ’ చిత్రం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో స్వయంగా పాల్గొన్నారని పేర్కొన్నారు.

తెలుగు పాత్రికేయాన్ని మలుపు తిప్పారు

తెలుగు పాత్రికేయాన్ని మలుపు తిప్పిన ఘనత రామోజీరావుదేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. సోమవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆయన చిత్రపటానికి చిన్ని నివాళులర్పించారు. రామోజీరావు తనయుడు, ఈనాడు ఎండీ కిరణ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు

చిట్‌ఫండ్‌ రంగానికి మార్గదర్శనం చేశారు

చిట్‌ఫండ్‌ రంగంలో రామోజీరావు చూపిన మార్గంలోనే పనిచేసేవాళ్లమని తెలంగాణ చిట్‌ఫండ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలోని రామోజీరావు నివాసంలో ఆయనకు వారు నివాళులు అర్పించారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిట్‌ఫండ్‌ రంగంలో రామోజీరావు లేని లోటు కనిపిస్తోందని అసోసియేషన్‌ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆలిండియా చిట్‌ఫండ్‌ అసోసియేషన్, తెలంగాణ చిట్‌ఫండ్‌ అసోసియేషన్‌లకు రామోజీరావు మార్గదర్శనం చేశారని చెప్పారు.

కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు

పలువురి నివాళులు

సోమవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావుకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. భాజపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం, రామినేని ధర్మప్రచారక్, కృష్ణా (విజయ) మిల్క్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు, మార్గదర్శి వైస్‌ ప్రెసిడెంట్లు రాజాజీ, సాంబమూర్తి, బలరాం, డైరెక్టర్‌ వెంకటస్వామి, సీఓఓ మధుసూదన్, జనరల్‌ మేనేజర్లు బాలకృష్ణ, ఆదినారాయణ, రామకృష్ణ, జె.శ్రీనివాస్‌లు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. 

రామోజీరావు విభిన్న రంగాలను ఎంచుకొని.. ప్రతి దానిలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారని కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు అన్నారు. ఆయన సోమవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు.

నివాళులర్పిస్తున్న పాతూరి నాగభూషణం, రామినేని ధర్మప్రచారక్‌


అమెరికాలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో రామోజీరావుకు నివాళులు

రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న తెలుగు సంఘం సభ్యులు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: అమెరికాలోని డాలస్‌లో ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి సాయిబాబా ఆలయ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇదే సమావేశంలో ఏలూరుకు చెందిన కళారత్న కె.వి.సత్యనారాయణను సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి, తానా పూర్వ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, తెలుగు సంఘం సభ్యులు సత్కరించారు. 


రేపు విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ

బాలోత్సవ్‌ భవన్‌లో నిర్వహణ
నివాళులు అర్పించనున్న ప్రజాసంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు, ప్రముఖులు

ఈనాడు, అమరావతి: ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షరయోధుడు రామోజీరావు సంస్మరణ సభ ఈ నెల 19న విజయవాడ రాఘవయ్య పార్క్‌ సమీపంలోని బాలోత్సవ్‌ భవన్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఫోరం ఈ సంస్మరణ సభను నిర్వహిస్తోంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జై భీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రమణ్యం, దళిత బహుజన ఫ్రంట్‌ ప్రతినిధులు కొరివి వినయ్‌కుమార్, మేళం భాగ్యారావు, కొసనం రాము, ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి అధ్యయన సమితి ప్రతినిధి లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు, అమరావతి బహుజన జేఏసీ కన్వీనర్‌ పోతుల బాలకోటయ్య, జనచైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి, ప్రజాసంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు, ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు, న్యాయవాదులు పాల్గొని రామోజీరావుకు నివాళులు అర్పించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని