Drought relief: రూ.319.77 కోట్ల కరవు సాయానికి అభ్యర్థన

మొన్నటి రబీ సీజన్‌లో (2023-24) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రూ.319.77 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్ర కరవు బృందానికి రాష్ట్రప్రభుత్వ అధికార యంత్రాంగం నివేదించింది.

Published : 20 Jun 2024 04:22 IST

ఉపాధి నిధులు  రూ.1,090 కోట్లకు ప్రతిపాదన
కేంద్ర బృందానికి అధికార యంత్రాంగం నివేదిక

సమీక్షిస్తున్న కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేష్‌ చౌహాన్‌. చిత్రంలో జేసీ కేతన్‌గార్గ్, అనంత కలెక్టర్‌ వినోద్‌కుమార్,
కేంద్ర అధికారి చిన్మయ్‌ పుండ్లిక్‌రావ్‌ గోత్మారే, రాష్ట్ర ప్రకృతి విపత్తుల ఎండీ కూర్మనాథ్‌

అనంత జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: మొన్నటి రబీ సీజన్‌లో (2023-24) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రూ.319.77 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్ర కరవు బృందానికి రాష్ట్రప్రభుత్వ అధికార యంత్రాంగం నివేదించింది. ఇందులో పంటనష్టమే రూ.228 కోట్లు కాగా, మిగతాది గ్రామీణ, పట్టణ నీటిసరఫరా, పశుసంవర్థక శాఖల పరిధిలో ఉన్నట్లు తేల్చింది. గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రూ.1,090.14 కోట్లు అదనంగా ఇవ్వాలని కోరారు. మొత్తంగా కరవు సాయం కింద రూ.1,409.91 కోట్లు రాష్ట్రానికి అందించాలని అభ్యర్థించారు. రబీలో పంటనష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ-రైతుల సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి రితేష్‌ చౌహాన్‌ సారథ్యంలో చిన్మయ్‌ పుండ్లిక్‌ రావ్‌ గోత్మారే, విత్తనాభివృద్ధి సంస్థ సంచాలకుడు డాక్టర్‌ కె.పొన్నుస్వామి, సునీల్‌ దూబే, పారిశుద్ధ్యం-నీటి సరఫరా డైరెక్టర్‌ ఆశిష్‌ పాండే, గ్రామీణాభివృద్ధిశాఖ ఉప సలహాదారు అరవింద్‌కుమార్‌ సోనీలతో కూడిన కేంద్ర కరవు బృందం అనంతపురానికి చేరుకుంది. రాష్ట్ర ప్రకృతి విపత్తుల శాఖ ఎండీ కూర్మనాథ్‌ సారథ్యంలోని బృందం కూడా వచ్చింది. వీరంతా కలిసి అనంత, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులతో బుధవారం అనంత కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో రాష్ట్రస్థాయి సమీక్ష జరిపారు. తర్వాత మూడు బృందాలుగా విడిపోయి ఆరు జిల్లాల పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో 87 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. వీటిని ఆదుకోవాలని కేంద్ర కరవు బృందాన్ని రాష్ట్ర అధికార యంత్రాంగం కోరింది. 

అదనపు పని దినాలకు అభ్యర్థన

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రబీలో 20రకాల పంటలు నష్టపోయారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం రూ.228 కోట్ల మేర పంటనష్టం వాటిల్లిందని నివేదించారు. పట్టణ నీటిసరఫరా కింద రూ.42.76 కోట్లు, గ్రామీణ నీటిసరఫరా శాఖలో రూ.36.23 కోట్లు, పశుసంవర్థక శాఖలో రూ.12.75 కోట్లు నష్టపోయారని వివరించారు. ఈ కరవు ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి అదనపు పని దినాలు కల్పించడానికి మరో రూ.1090.14 కోట్లు ఉపాధిహామీ కింద ఇవ్వాలని అభ్యర్థించారు. కరవు బృంద సభ్యులు మూడు రోజులపాటు పర్యటిస్తారు. ఆఖరుగా సీఎస్‌తో సమావేశమవుతారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రకృతి విపత్తుల ఎండీ కూర్మనాథ్, అనంత కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ విలేకర్లకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని