Amaravathi: ఆకాంక్షల అమరావతి

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి రాజధాని అనేది నిలువుటద్దం. అలాంటి కీలకమైన రాజధానిని వైకాపా సర్కారు అన్ని విధాలా నాశనం చేసింది.

Updated : 18 Jun 2024 06:38 IST

రాజధాని నిర్మాణంలో కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు
జగన్‌ జమానాలో ఐదేళ్లుగా పాడుబడిన రాజధాని
ఆ నష్టాలను భర్తీ చేసి, పునర్వైభవం తేవడమే పెద్ద సవాల్‌ 
కాలంతో పోటీపడి పని చేస్తే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం
ఈనాడు - అమరావతి

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి రాజధాని అనేది నిలువుటద్దం. అలాంటి కీలకమైన రాజధానిని వైకాపా సర్కారు అన్ని విధాలా నాశనం చేసింది. మొగ్గ దశలో ఉన్న అమరావతిని స్వార్థ ప్రయోజనాల కోసం చిదిమేసింది. మూడు రాజధానుల పేరుతో నాటకాలాడి.. రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసింది. తెదేపా హయాంలో ముమ్మరంగా సాగిన పనులను 2019లో వైకాపా ప్రభుత్వం నిలిపేసింది. ఐదేళ్లపాటు రాజధానిని పాడుబెట్టింది. ఈ పరిస్థితుల్లో అమరావతి రూపశిల్పి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మళ్లీ కొలువుదీరింది. దీంతో రాజధాని సాకారమవుతుందని రాష్ట్ర ప్రజలంతా ఆశిస్తున్నారు. ఐదేళ్ల చెరవీడిన అమరావతి రాబోయే ఐదేళ్లలో ప్రజారాజధానిగా అందుబాటులోకి వస్తుందని ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చీరావడంతోనే ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. రెండున్నరేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని ప్రాజెక్టును పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం.. అందుకోసం మార్గసూచిని సిద్ధం చేసుకుంటోంది. 

ఈ ఐదేళ్లూ కీలకం 

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో జగన్‌ అరాచకాలకు, అమరావతి విధ్వంస పాలనకు అడ్డుకట్ట పడిందని ప్రజలు, అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రాజధాని పునర్నిర్మాణం సీఎం చంద్రబాబుకు పెద్ద సవాలే. ఈ ఐదేళ్లలో వ్యూహాత్మకంగా, వడివడిగా అడుగులు వేస్తూ రాజధాని నిర్మించాలి. భవిష్యత్తులో మరొకరు జగన్‌లా విధ్వంస ఆలోచనలకు తావివ్వకుండా అమరావతిని రాజధానిగా సుస్థిరపరచాలని రైతులు కోరుతున్నారు. ఆచరణాత్మక లక్ష్యాలను నిర్దేశించుకొని.. తన హయాంలోనే అందరి ఆశలను నెరవేరుస్తూ మొదటి దశను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సిన బృహత్తర బాధ్యత చంద్రబాబు భుజస్కంధాలపై ఉంది. అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అపార్ట్‌మెంట్లు 72 శాతం, ఎన్జీవోల నివాస సముదాయాలు 62 శాతం గెజిటెడ్‌ అధికారుల క్వార్టర్లు 65 శాతం మేర   పూర్తయ్యాయి. ఇక్కడ వెంటనే పనులు ప్రారంభించి, పూర్తి చేయాల్సి ఉంది.

తక్షణం దృష్టి సారించాల్సిన అంశాలు

క్యాబినెట్‌ సబ్‌ కమిటీ అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, సమగ్ర నివేదిక, తదుపరి కర్తవ్యం, తీసుకోవాల్సిన నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కోసం సమర్పించాలి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బోస్టన్‌ కమిటీ, జీఎన్‌ రావు కమిటీ, నిపుణుల కమిటీ, ఐఐటీ రూర్కీ, హైపవర్‌ కమిటీల తుది నివేదికలను సమీక్షించి తదుపరి కర్తవ్యం, తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి నివేదిక సమర్పించాలి. 

  • గత తెదేపా హయాంలో ప్రారంభమైన విభాగాధిపతులు, సచివాలయం, శాశ్వత హైకోర్టు భవనాల పునాదులు.. ఐదేళ్లుగా నీటిలో నానుతున్నాయి. ఈ నిర్మాణాల పటిష్టతను సాంకేతిక నిపుణులతో అంచనా వేయించాలి. సవరించిన అంచనాలతో తిరిగి పనులు మొదలుపెట్టడానికి చర్యలు చేపట్టడమే కాదు.. ఈ ఐదేళ్లలో వీటిని పూర్తయ్యేలా చూడాలి. దీనికోసం గుత్తేదారులకు పెండింగ్‌ బిల్లుల చెల్లింపు, మొబిలైజేషన్‌ అడ్వాన్సులు, గడువు పొడిగింపు, ప్రస్తుత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించాలా లేక మళ్లీ టెండర్లు పిలవాలా అన్న అంశాలపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. 
  • పెండింగ్‌ భూసేకరణ, ఈ ప్రాంతంలో రైతులకు కేటాయించిన ప్లాట్లు, వాటికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. అనంతరం ఆ భూములు సీఆర్డీఏకు తిరిగి దఖలుపడే విషయంలోనూ చొరవ తీసుకోవాలి. ఏపీ సీఆర్డీఏ చట్టం, పునర్విభజన చట్టం, అమరావతి బృహత్‌ ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసేందుకు తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలను ప్రారంభించాలి.
  • రైతుల రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను తక్షణం పూర్తి చేసి, వాటిని అన్ని వసతులతో అభివృద్ధి చేయాలి. దీనివల్ల రాజధానిలో నివాసయోగ్యత స్థాయి పెరుగుతుంది. పెండింగ్‌ ప్లాట్లు, కేటాయించిన ప్లాట్లలో ఇంకా చేయించాల్సిన రిజిస్ట్రేషన్లను నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాలి.
  • అమరావతిలో అత్యంత కీలకమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, మిగిలిన అనుసంధాన రహదారుల నిర్మాణం పూర్తి చేసేందుకు పక్కా కార్యాచరణతో ముందుకెళ్లాలి. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, హ్యాపీ నెస్ట్, తదితర ప్రాజెక్టులను సత్వరమే పునరుద్ధరించి వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలి. రాజధానిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానించాలి.  
  • ఎన్‌ఐడీ, ఎస్‌ఆర్‌ఎం, విట్, తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలకు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీనిపై దృష్టి పెడితే మరిన్ని సంస్థలు అమరావతికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్న సంస్థలు విస్తరణ పనులు చేపట్టేందుకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలి. దళితులు అధికంగా నివసించే అమరావతిలో ప్రణాళికలో పేర్కొన్న విధంగా అంబేడ్కర్‌ విగ్రహం, ఉద్యానాన్ని అభివృద్ధి చేయాలి.
  • రాజధానిలో భూములు కేటాయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వెంటనే పనులు ప్రారంభించి నిర్దిష్ట కాలపరిమితితో మూడేళ్లకు మించకుండా కార్యకలాపాలు సాగించేలా చర్యలు తీసుకోవాలి. ఈ సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం వైకుంఠపురం వద్ద 40 టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్‌ నిర్మించాలి. రాజధాని పరిధిలోని గ్రామాలతో అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు న్యాయపరమైన జనాభా ప్రాతిపదిక చిక్కులను అధిగమించే అంశంపై దృష్టి పెట్టాలి. ఆ గ్రామాల నుంచి వసూలు చేసే పన్నులతో, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను, సేవలను అందించేలా చూడాలి.

ఆ అధికారులను సాగనంపితేనే పూర్వ వైభవం

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ధ్వంసం చేయడంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్, అడిషనల్‌ కమిషనర్‌ కట్టా సింహాచలం కీలకపాత్ర పోషించారు. వీరితో పాటు పురపాలక శాఖ సీపీఆర్వో జాన్‌ సుందర్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో గత ప్రభుత్వ హయాంలో సీఐడీ అధికారులతో కుమ్మక్కై చంద్రబాబు, నారాయణలపై సీఐడీ అధికారులతో కేసులు నమోదు చేయించడంలో కీలకపాత్రధారిగా అసోసియేట్‌ ప్లానర్‌ మనోజ్‌కుమార్‌ సీఆర్డీఏలో చక్రం తిప్పుతున్నారు. సిటీస్‌ ప్రాజెక్టులో బోగస్‌ నాణ్యతా పత్రాలు, నివాస సముదాయాల విషయంలో బోగస్‌ డీసీసీఓ సర్టిఫికెట్లు ఇచ్చారంటూ సీఆర్డీఏ సీఈ పల్లంరాజుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆర్‌5 జోన్‌లో లేఅవుట్ల ఏర్పాటు పనులను విభజించి నామినేషన్‌ పద్ధతిలో అయిన వారికి కట్టబెట్టినట్లు తెలిసింది. ఇటువంటి వారిపై సమగ్ర విచారణ చేపట్టి, సత్వర చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని