Sai Dharam Tej: ప్రమాదకరంగా సామాజిక మాధ్యమ ప్రపంచం

సామాజిక మాధ్యమ ప్రపంచం క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయిందని, దీనిని నియంత్రించలేం కనుక తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలు, వీడియోలను వాటిల్లో పోస్టు చేసేటప్పుడు విచక్షణతో వ్యవహరించాలని నటుడు సాయిధరమ్‌తేజ్‌ సూచించారు.

Updated : 08 Jul 2024 06:19 IST

పిల్లల ఫొటోలు, వీడియోల పోస్టింగ్‌పై జాగ్రత్త
తల్లిదండ్రులకు నటుడు సాయిధరమ్‌తేజ్‌ ‘ఎక్స్‌’లో సూచన
స్పందించిన సీఎం రేవంత్, ఉపముఖ్యమంత్రి భట్టి, డీజీపీ రవిగుప్తా

ఈనాడు, హైదరాబాద్‌: సామాజిక మాధ్యమ ప్రపంచం క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయిందని, దీనిని నియంత్రించలేం కనుక తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలు, వీడియోలను వాటిల్లో పోస్టు చేసేటప్పుడు విచక్షణతో వ్యవహరించాలని నటుడు సాయిధరమ్‌తేజ్‌ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు మృగాళ్లు ఉంటారని, వినోదం పేరిట పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారని పేర్కొన్నారు. అలాంటి వారిని అరికట్టేందుకు నాయకులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం ‘ఎక్స్‌’లో రాసుకొచ్చారు. దీనికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రులు భట్టి విక్రమార్క, పవన్‌కల్యాణ్‌లతోపాటు మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్‌ చేశారు. తండ్రీకూతుళ్లపై కొందరు యువ యూట్యూబర్లు(ఏపీకి చెందిన వారిగా సమాచారం) అసభ్యకరంగా సంభాషించిన వీడియోను కూడా సాయిధరమ్‌తేజ్‌ పంచుకున్నారు. కాగా ఈ పోస్టుపై సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి స్పందించారు. పిల్లల భద్రత తమ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని, నిందితులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ డీజీపీ రవిగుప్తా సైతం స్పందిస్తూ.. పిల్లలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై టీజీసైబర్‌బ్యూరోలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని