Hyderabad: ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ముఖాముఖి భేటీ కాబోతున్నారు.

Published : 06 Jul 2024 05:46 IST

హైదరాబాద్‌లో సమావేశం
రాష్ట్ర విభజన అంశాల పరిష్కారమే ప్రధాన ఎజెండా

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ముఖాముఖి భేటీ కాబోతున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సాయంత్రం ఆరుగంటలకు ఈ సమావేశం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల సమావేశం వేదిక కాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. హైదరాబాద్‌లో సమావేశమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకుందామని, సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో వీరిద్దరి భేటీకి వేదిక ఖరారైంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్‌కుమార్‌ ప్రసాద్, శాంతికుమారి పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాలశాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ పాల్గొంటారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌  కుమార్‌తో పాటు ఇతర శాఖల అధికారులు  హాజరవుతున్నారు.

ఆస్తుల విభజన... అప్పుల పంపకాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు అయింది. అప్పటి నుంచి కీలకాంశాలు ఎన్నో పెండింగ్‌లో ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగినా చాలా విషయాలు కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఉమ్మడిగా ఎజెండా అంశాలను ఖరారు చేశారు. అవి... 

  • రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు
  • విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు
  • ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ అంశాలు
  • పెండింగ్‌ విద్యుత్తు బిల్లులు
  • విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు
  • ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు
  • హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశం
  • లేబర్‌ సెస్‌ పంపకాలు
  • ఉద్యోగుల విభజన అంశాలు

షెడ్యూలు తొమ్మిదిలో ఉన్న సంస్థల ఆస్తులపై షీలా భిడే కమిటీ అధ్యయనం చేసి కొన్ని సిఫార్సులు చేసింది. ఈ షెడ్యూలు కింద ఉన్న 91 సంస్థల్లో 89 సంస్థలకు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విభజనకు ఆ కమిటీ సిఫార్సులు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఆ సిఫార్సులను ఆమోదించింది. తెలంగాణ రాష్ట్రం 68 సంస్థలకు సంబంధించి కమిటీ సిఫార్సులు ఆమోదించేందుకు సంసిద్ధత తెలియజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని